ఆత్మవిశ్వాసంతో ఎవరెస్ట్ అధిరోహించిన వెంకీ - అభినందించిన మంత్రి లోకేశ్
దివ్యాంగులతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహింపజేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే క్రతువు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం - గండికోటలో సాహస విన్యాసాలపై కఠోర శిక్షణ - అనంతరం ఎవరెస్ట్ శిఖర యాత్ర

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 26, 2026 at 1:39 PM IST
Disabled Student From Badvel Climb Mount Everest: ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఎవరెస్టు ఒకటి. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో నిత్యం మంచుతో కప్పి ఉండే ఈ శిఖరాన్ని అధిరోహిచండం ఓ సాహసం. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వారే పర్వతారోహణకు కాస్త వెనకడుగు వేస్తారు. క్లిష్ట వాతావరణానికి ఎదురేగేందుకు భయపడతారు. వైఎస్సార్ కడప జిల్లా బద్వేలుకు చెందిన ఓ దివ్యాంగుడు మాత్రం అందుకు భిన్నమనే చెప్పాలి. ఎత్తైన ఈ శిఖరాన్ని ఆత్మవిశ్వాసంతో అధిరోహించి శభాష్ అనిపించుకున్నారు.
చిన్నపట్టి నుంచే ఆటల్లో చురుకు: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణం మార్తోమనగర్‌కు చెందిన బాలచంద్ర, పద్మ దంపతుల కుమారుడు వెంకీ. తల్లి ఇళ్లలో పనిచేస్తూ తండ్రి రోజూ వారీ కూలిగా రెక్కలు ముక్కలు చేసుకుంటూ వచ్చే కొద్దిపాటి మొత్తంతో జీవనం సాగిస్తున్నారు. వెంకీ స్థానిక భవిత పాఠశాలలో ఇటీవల పదో తరగతి చదివాడు. వెంకీ చిన్నప్పటి నుంచి మూగ. ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేదు. మాటలు రావని వైద్యులు తేల్చేశారు. చదువు కోసం అతన్ని స్థానిక భవిత పాఠశాలలో చేర్పించారు. చదువులు, ఆటపాటల్లో ఇతర విద్యార్థుల కంటే ఎప్పుడూ ముందుండేవాడు. జిల్లా సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఉమ్మడి కడప జిల్లా స్థాయిలో నిర్వహించిన పరుగు పందెంలో సత్తా చాటి ఔరా అనిపించాడు.

కఠోర శిక్షణ - శ్రమకు ఫలితం: దివ్యాంగులతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహింపజేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే క్రతువును రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టింది. అందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ విద్యార్థుల్లో మెరికలను ఎంపిక చేసింది. వీరికి గండికోటలో సాహస విన్యాసాలపై కఠోర శిక్షణ ఇచ్చింది. అనంతరం ఎవరెస్ట్ శిఖర యాత్రను విజయవంతంగా ముగించారు. ఈ బృందంలోని దివ్యాంగ విద్యార్థులను మంత్రి నారా లోకేశ్ ఇటీవల అభినందించారు. వీరిలో జిల్లాకు చెందిన వెంకీ కూడా ఒకరు. అతని ఆత్మవిశ్వాసానికి భవిత పాఠశాల ఉపాధ్యాయుడు రామచంద్రారెడ్డి, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటసుబ్బారెడ్డి, ఉన్నతాధికారులు కొనియాడారు.
"ఎవరెస్ట్"పై గురి పెట్టిన 'సిరి' - ఉమ్లింగ్ లా పాస్'ను అధిరోహించిన మూడో తరగతి చిన్నారి!
దక్షిణం వైపు నుంచి ఎవరెస్ట్ అధిరోహించిన నిషా - ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు

