ఒకవైపు ఎండలు, మరోవైపు వానలు - ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు
రాష్ట్రంలో కొనసాగుతున్న విభిన్న వాతావరణ పరిస్థితులు - కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ఎండ, ఇంకొన్ని చోట్ల వానలు -పలుచోట్ల గాలులు, పిడుగుపాట్లతో కూడిన వర్షాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 3, 2026 at 8:15 PM IST
Different Weather in AP One Side Sunny and Other Side Rainy : రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు నిప్పులు చెరుగుతుంటే, ఇంకొన్ని చోట్ల వానలు దంచికొడుతున్నాయి. పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగుపాట్లతో కూడిన వర్షాలు కురిశాయి. ఇవాళ 16 జిల్లాల పరిధిలోని 286 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం కూడా 27 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల ప్రభావం ఉండనందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో సోమవారం అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, విశాఖ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాలు కురిసే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ ముమ్మిడివరంలో అత్యధికంగా 72.7 మిల్లీమీటర్లు, కాట్రేనికోనలో 57.7 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి.
పిడుగుపాటు హెచ్చరికలు : అలాగే రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీచేసింది. వచ్చే 3 గంటల్లో పల్నాడు, ప్రకాశం, తిరుపతి, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఆయా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
మరోవైపు ఎండలు, వడగాలులతో అల్లాడుతున్న వేళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు ఉన్నట్లుండి జోరువానలు కురిశాయి. గాలులతో కూడిన వర్షాలు కురవడంతో, కాసేపు వేడి దూరమైంది. భానుడి భగభగల నుంచి వర్షం చల్లదనంతో ప్రజలకు ఉపశమనం లభించింది.
పలు జిల్లాల్లో భారీ వర్షం : కాకినాడ జిల్లాలో భారీ వర్షం కురిసింది. నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో జోరు వాన పడింది. కాకినాడలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల రోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయం సమీపంలో ధాన్యంపై పట్టాలు కప్పుతుండగా పిడుగుపడి కౌలు రైతు మృతిచెందారు.
తడిచిన కళ్లాల్లో ఉన్న ధాన్యం : కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిచి ముద్దయింది. అమలాపురం సహా పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కుండపోతగా కురిసింది. కళ్లాల్లోని ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించారు. తిరుపతిలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు ఈ వర్షం ఎంతో ఉపశమనానిచ్చింది.
వేడిగాలుల వేళ 'వడగళ్లు' - రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జోరు వానలు
ఉపరితల ఆవర్తన ప్రభావం - ఏపీలో ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షాలు

