ETV Bharat / state

శ్రీకాకుళంలో డయేరియా కేసులు - మున్సిపల్​ కమిషనర్​ సస్పెన్షన్​

శ్రీకాకుళం నగరపాలకసంస్థ పరిధిలో ప్రబలుతోన్న డయేరియా కేసులు - దమ్మలవీధి, మంగువారితోట, కాకివీధి, గుడివీధిలో ఇంటింటా కొనసాగుతున్న సర్వే - మెరుగైన పారిశుద్ధ్యం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన కార్పొరేషన్ సిబ్బంది

diarrhea_in_srikakulam
diarrhea_in_srikakulam (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 25, 2026 at 1:39 PM IST

|

Updated : February 25, 2026 at 2:50 PM IST

3 Min Read
Choose ETV Bharat

Diarrhea Cases Prevalent in Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో డయేరియా ప్రబలుతోంది. గడిచిన 3 రోజుల్లో 76 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం నగరంలోని దమ్మలవీధి, గోల్కొండ రేవు, కాకివీధి, మంగువారితోట పరిసర ప్రాంతాల్లో డయేరియా విజృంభిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 76 మంది ఆసుపత్రుల పాలయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరిది అనుమానాస్పద మృతిగా అధికారులు చెప్తున్నారు. మృతుడి కుటుంబానికి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే శంకర్‌ రూ.10 లక్షల పరిహారం అందజేశారు. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మరోపక్క అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

బాధితులకు జీజీహెచ్, జెమ్స్, కిమ్స్‌ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇంటింటా సర్వేలో భాగంగా స్వల్ప లక్షణాలతో బాధపడేవారిని గుర్తించి వారికి స్థానికంగానే వైద్య శిబిరాల్లో సేవలందిస్తున్నారు. కాగా ఈ ఘటనని సీరియస్​గా తీసుకున్న ప్రభుత్వం మునిసిపల్ కమిషనర్​పై సస్పెన్షన్ వేటు వేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి డయేరియా ప్రబలడానికి కమిషనర్ కారణమయ్యారని చర్యలు తీసుకుంది. ఉన్నతాధికారుల నివేదిక తర్వాత కమిషనర్ కూర్మారావును సస్పెండ్ చేస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీకాకుళంలో కలవరపెడుతున్న డయేరియా - 3 రోజుల్లో 76 కేసులు నమోదు (ETV)

ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహించొద్దు: ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్లక్ష్యం వహించొద్దని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో డయేరియాపై సమీక్ష నిర్వహించారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శ్రీకాకుళంలో చికిత్స పొందుతున్న ఇద్దరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని అధికారులు వివరించారు. చికిత్స పొందుతున్న మరొకరికి డయాలసిస్ అందిస్తున్నామన్నారు. వీరిద్దరి వైద్య చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో ఇంకా ఏమైనా కేసులు నమోదవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలి: శ్రీకాకుళంలో డయేరియా పరిస్థితిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదనపు సిబ్బందితో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు.

డయేరియాతో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పరామర్శించారు. అలాగే డయేరియాతో మృతి చెందిన సురేష్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం తరుపున రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే హుటాహుటిన మంగళవారం రాత్రి శ్రీకాకుళం చేరుకున్నారు. వచ్చిన వెంటనే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

బాధితులు కోలుకుంటున్నారు: అనంతరం ఈ ఘటనలో మృతి చెందిన సురేష్ కుటుంబసభ్యులకు కలిసి ఓదార్చారు. ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. దమ్మలవీధి, మంగువారితోట, కాకివీధి, గుడివీధిలో ఇంటింటా సర్వే చేయించామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. ఇప్పుడిప్పుడే బాధితులు కోలుకుంటున్నారని ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

ట్యాంకులు క్లీన్​: డయేరియా వ్యాధి నివారణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఓవర్ హెడ్ ట్యాంకులను నిరంతరం క్లీనింగ్ చేస్తున్నామని, నిరంతరం పర్యవేక్షణ, సర్వే చేయడం, వ్యక్తిగత శుభ్రత పెంచేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జల్ జీవన్ ద్వారా సురక్షితనీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు శాసన మండలిలో ఈ విషయమై ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.

నిర్వహణ చేయడంలో లోపం వల్లే డయేరియా ప్రబలుతోందన్న విపక్ష నేత బొత్స సత్యనారాయణ భవిష్యత్తులో డయేరియా వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. డయేరియా వ్యాధికి నీటి కలుషితమే ప్రధాన కారణమన్న మంత్రి, గతంలో గ్రామాల్లో నిధుల్లేక నీటి ట్యాంకులు శుభ్రం చేయలేదని, నిర్వహణ లోపించడంవల్లే వ్యాధి ప్రబలిందన్నారు. నీరు కలుషితం కాకుండా ప్రత్యేకంగా నిర్వహణ చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం - నిర్లక్ష్యం వహించొద్దు: సీఎం చంద్రబాబు

రాజమహేంద్రవరం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు సాయం - అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు

Last Updated : February 25, 2026 at 2:50 PM IST