జనసంద్రమైన స్వర్ణాల చెరువు - మూడో రోజు రొట్టెల పండగకు పోటెత్తిన భక్తులు
మూడో రోజు కోలహలంగా రొట్టెల పండగ - స్వర్ణాల చెరువు వద్ద నెలకొన్న భక్తుల కోలాహలం - దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 28, 2026 at 5:49 PM IST
|Updated : June 28, 2026 at 8:27 PM IST
Bara Shaheed Dargah Roti Festival 2026 : నెల్లూరు స్వర్ణాల చెరువు మూడోరోజూ భక్త జనసంద్రంగా మారింది. కీలక ఘటమైన గంధమహోత్సవం శనివారం అర్ధరాత్రి జరగ్గా జనం పెద్దఎత్తున తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో దర్గాకు వచ్చే దారులన్నీ రద్దీగా మారాయి. ఇవాళ సెలవు దినం కావడంతో బారాషాహీదుల దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఉద్యోగం, సంతానం, వివాహం రొట్టెలకు డిమాండ్ ఏర్పడింది. పలు స్వచ్ఛంద సంస్థలు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి.
నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండగకు పలువురు ఎమ్మెల్యేలు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలో బారాషాహీదులను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని కోరుతూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు రొట్టె వదిలారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ మరో రొట్టె పట్టుకున్నారు. 2029లో తన తమ్ముడు గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని కోరుతూ రొట్టె వదిలినట్లు ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి తెలిపారు. బారాషాహిద్ దర్గా వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనియాడారు.
కోర్కెలు నెరవేరాలని : సంతానం కోసం, ఉన్నత చదువులు, గృహం కోసం ఇలా తమ కోర్కెలు నెరవేరాలని భక్తులు స్వర్ణాల చెరువు దగ్గరికి వస్తారు. చెరువులో స్నానం చేసి తమ కోరికలు తీర్చమని దేవుళ్లని వేడుకుంటారు. మరోవైపు కోరిక తీరిన వారు అందుకు గుర్తుగా రొట్టెలు తెచ్చి పంచిపెడతారు. ఆ రొట్టె అందుకున్న వారు తిరిగి తమ కోర్కెలు నెరవేరాక మళ్లీ రొట్టెలను పంచుతారు. ఈ ఆచారం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది.
రొట్టె తీసుకోవడం ఆనవాయితీ : సంపద కావాలనుకునే వారికి ఒక రొట్టె, చదువు, ఉద్యోగం, సొంత ఇల్లు, ఆరోగ్యం, వివాహం, ఇలా ఎవరి కోరికలకనుగుణంగా వారు ఇక్కడ రొట్టె తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఒక ఏడాది ఇక్కడకు వచ్చి రొట్టె తీసుకొని కోరిక తీరిన తర్వాత కచ్చితంగా వచ్చి మళ్లీ రొట్టె విడిచి వెళ్లాలన్నది ఆచారం. అదేవిధంగా బారాషాహీద్‌లకు గలేఫ్‌లు, పూల చద్దర్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.
దర్గా పరిసర ప్రాంతాలు, ఘాట్లలో, పార్కింగ్ ప్రదేశాల్లో శానిటేషన్‌కు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాలు సులువుగా గుర్తించే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్వర్ణాల చెరువులో సోమశిల నుంచి నీటిని పెంచారు. రోజుకు మూడు సార్లు బ్లీచింగ్, నీటిలో క్లోరినేషన్ చేస్తున్నారు. 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన వైద్య బృందాలు, 108 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. నెల్లూరు రైల్వేస్టేషన్, బస్స్టేషన్ల నుంచి స్వర్ణాల చెరువుకు వచ్చేందుకు బస్ సర్వీసులను నడుపుతున్నారు.
జల్లు స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు : రొట్టెల పండుగకు వచ్చే భక్తులు జిల్లాలోని కసుమూరు, ఏఎస్ పేట దర్గాలను సందర్శించే అవకాశం ఉన్నందున, ఆయా ప్రాంతాల్లో శానిటేషన్, త్రాగునీటి సౌకర్యం కల్పించారు. రొట్టెల పండుగకు వచ్చే మహిళలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరిశుభ్ర వాతావరణంలో స్నానాలకు టెంట్లు ఏర్పాటు చేశారు. జల్లు స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ బడుల్లో స్మార్ట్ కిచెన్లు - జగన్ ఆరోపణలపై మంత్రి లోకేశ్ తీవ్ర విమర్శలు
తూర్పు తీరంలో లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ - ఈ ఏడాది అందుబాటులోకి రానున్న రెండు పోర్టులు

