ETV Bharat / state

ఇంటికే భద్రాద్రి రాములోరి ముత్యాల తలంబ్రాలు - ఇలా బుక్​ చేసుకోండి

సమీపిస్తున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ ఘడియలు - ముత్యాల తలంబ్రాలను అందుకునేందుకు భక్తుల ఎదురుచూపులు -కల్యాణం రోజున 200 క్వింటాళ్ల తలంబ్రాలను భక్తులకు ఉచితంగా పంపిణీ - పోస్టల్​ ద్వారా దేశమంతటా పంపిణీ

Bhadrachalam Mutyala Talambralu
Bhadrachalam Mutyala Talambralu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 1, 2026 at 2:36 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bhadrachalam Mutyala Talambralu : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముత్యాలతో కలిపిన తలంబ్రాలను అందుకునేందుకు భక్తులంతా ఎదురుచూస్తున్నారు. శ్రీ సీతారాముల పైన పడిన పవిత్రమైన తలంబ్రాలు మనతో ఉంటే సకల శుభాలూ కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నెల 27న మిథిలా మండపంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజున అభిజిత్​ లగ్నంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ప్రధాన వేడుక జరగనుంది. వివిధ కారణాలతో ఆ రోజున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భద్రాచలానికి రాలేకపోవచ్చు. దీనిని దృష్టిలో పెట్టుకుని వారికి సైతం తలంబ్రాలను పంపే విధానాన్ని గతంలోనే అమలులోనికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో భక్తుల కోరిక మేరకు వారి ఇళ్లకే స్వామివారి కల్యాణ తలంబ్రాలను పంపిణీ చేసేందుకు ఆలయ ఈవో దామోదర్​రావు పర్యవేక్షణలో ఆలయాధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ముత్యాల తలంబ్రాల ఉచిత పంపిణీపై దృష్టి : గత సంవత్సరం కంటే ఈసారి అధికంగా తలంబ్రాలు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మార్చి 4న పసుపు కొమ్ములు దంచి వసంత వేడుకలు, డోలనోత్సవం నిర్వహిస్తారు. అదేరోజున కల్యాణ తలంబ్రాలను సంప్రదాయబద్ధంగా కలపటాన్ని ప్రారంభిస్తారు. మొదటి రోజు 20 క్వింటాళ్లకు పైనే కలిపే వీలుంటుంది. ఇలా మొత్తంగా 300 క్వింటాళ్ల బియ్యాన్ని కేటాయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కల్యాణం రోజునే 200 క్వింటాళ్ల తలంబ్రాలను 100 కౌంటర్ల ద్వారా భక్తులకు ఉచితంగా అందిస్తారు. అదనంగా 100 క్వింటాళ్లను విడతల వారీగా అవసరం మేరకు ముత్యాలతో కలిపి లక్షల సంఖ్యలో ప్యాకెట్లను సిద్ధం చేస్తారు. వీటిని భక్తులకు విక్రయిస్తారు. ఆలయం కౌంటర్​తో పాటు దేవస్థానం అధికారిక వెబ్​సైట్​ ద్వారా వీటిని పొందవచ్చు. ఈసారి 4 లక్షలకు పైగా ప్యాకెట్లను విక్రయించే అవకాశం ఉంది. ఆలయం కౌంటర్​ వద్ద రూ.25 చెల్లించి ఒక ముత్యం గల తలంబ్రాల ప్యాకెట్​ను పొందవచ్చు.

ఈ విధంగా బుక్​ చేసుకోండి : ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన పోస్టల్​ సేవలను ఈసారి దేశమంతటా విస్తరించనున్నట్లు భద్రాచలం పోస్ట్ మాస్టర్​ రామ్మోహన్​ వెల్లడించారు. శనివారం నుంచి ఈ విధానం అందుబాటులోకి వచ్చిందని, మార్చి 20 వరకు ఇది అమల్లో ఉంటుందని తెలిపారు. రూ.151 చెల్లించి దగ్గరిలోని పోస్టాఫీసులో ఒక ముత్యం గల తలంబ్రాల ప్యాకెట్​ కోసం భక్తులు బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. రూ.450 చెల్లించిన భక్తుల పేరిట అంతరాలయంలో అర్చన ఉంటుందని తెలిపారు. పైగా కుంకుమ, ముత్యం, జీడిపప్పు, పటికబెల్లం కలిగిన తలంబ్రాల ప్యాకెట్​ను భక్తుల ఇంటికి చేర్చుతామని చెప్పారు.

"ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన పోస్టల్​ సేవలను ఈసారి దేశమంతటా విస్తరించనున్నాం. శనివారం నుంచి ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. మార్చి 20 వరకు ఇది అమల్లో ఉంటుంది. రూ.151 చెల్లించి దగ్గరిలోని పోస్టాఫీసులో ఒక ముత్యం గల తలంబ్రాల ప్యాకెట్​ కోసం భక్తులు బుక్ చేసుకోవాలి. రూ.450 చెల్లించిన భక్తుల పేరిట అంతరాలయంలో అర్చన ఉంటుంది. పైగా కుంకుమ, ముత్యం, జీడిపప్పు, పటికబెల్లం కలిగిన తలంబ్రాల ప్యాకెట్​ను భక్తుల ఇంటికి చేర్చుతాం." - రామ్మోహన్​, భద్రాచలం పోస్ట్ మాస్టర్

ఆర్టీసీ కార్గో : ఫిబ్రవరి 23 నుంచి తలంబ్రాల బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రూ.151 చెల్లించి ఆర్టీసీ లాజిస్టిక్స్​ కేంద్రాల్లో లేదా వెబ్​సైట్​లో వివరాలను భక్తులు నమోదు చేయించుకోవాలి. తెలుగు రాష్ట్రాల భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దీనికోసం అధికారిక వెబ్​సైట్​ www.tgsrtclogistics.gov.in ను సంప్రదించండి.

భద్రాచలంలో కనిపించే సుదర్శన చక్రం- ఇది వైకుంఠం నుంచి ఎలా వచ్చిందో తెలుసా?

భద్రాచలంలో రాములోరు ఒక్కరే కాదు - ఎన్నో ఆధ్యాత్మిక దర్శనీయ ప్రదేశాలు