పవన్ కల్యాణ్ దత్తత గ్రామం కొణిదెలకు కొత్తదశ - రూ.6 కోట్లతో అభివృద్ధి పనులు
2019 ఎన్నికల సమయంలో గ్రామంలో పవన్ పర్యటన - నాడు సమస్యలను విని పరిష్కరిస్తానని పవన్ హామీ - రూ.50 లక్షలతో 90 వేల లీటర్ల రక్షిత తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 22, 2026 at 10:51 AM IST
Development Works in Pawan Adopted Village : ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి మహర్దశ పట్టింది. పవన్ కల్యాణ్ ఇంటి పేరు, ఆ ఊరి పేరు ''కొణిదెల'' కావడం విశేషం. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో ఉండగా అక్కడ సమస్యలను స్థానికులు పవన్ దృష్టికి తెచ్చారు. తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని పవన్ వారికి హామీ ఇచ్చారు.
2025లో నందికొట్కూరు నియోజకవర్గంలో ఫారం పాండ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిన సందర్భంలో కొణిదెల గ్రామాభివృద్ధికి రూ.50 లక్షల విరాళం అందించారు. జిల్లా యంత్రాంగం సూచన మేరకు ఆ నిధులతో 90 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఓవర్ హెడ్ నీటి ట్యాంకు నిర్మించారు. దీంతో పాటు పల్లెపండుగ 1.0, పల్లెపండుగ 2.0, సాస్కీ, గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ ప్లాన్ తదితర పథకాల ద్వారా వచ్చిన నిధులతో రోడ్లు, డ్రెయిన్లు, కాలువల అభివృద్ధి, గోకులాలు, ఇళ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు. కేవలం ప్రభుత్వ పథకాల నుంచే ఇప్పటివరకు సుమారు రూ.6 కోట్లకు పైగా నిధులు కొణిదెల గ్రామాభివృద్ధికి వెచ్చించారు. గ్రామానికి అవసరం ఉన్న అభివృద్ధి పనులను చేపట్టాలని అధికారులకు సూచించారు.
గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.50 లక్షలతో 90 వేల లీటర్ల రక్షిత తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. దీని వల్ల ఆ గ్రామ పరిధిలో 2 వేల మంది దాహార్తి తీరనుంది. వేసవికి ముందే ట్యాంక్ నిర్మాణం పూర్తి కావడంపై పవన్ ఆనందం వ్యక్తం చేశారు. సకాలంలో నిర్మాణం పూర్తి చేసేందుకు సహకరించిన అధికారులను అభినందించారు.
- కొణిదెల గ్రామానికి 'పల్లె పండుగ 1.0'లో రూ.20 లక్షలకు పైగా వెచ్చింది 3 అంతర్గత రోడ్లు నిర్మించారు. 'పల్లె పండుగ 2.0'లో రూ.45 లక్షలతో చేపట్టిన 7 సీసీ రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి.
- ఉప ప్రణాళిక నిధులతో స్థానిక జిల్లా పరిషత్తు స్కూల్ నుంచి పగిడ్యాల మండల పరిధిలోని లక్ష్మాపురం వరకు 5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు, ఆర్అండ్బీ రోడ్డు నుంచి గ్రామం వరకు రోడ్డు పునరుద్ధరణకు రూ.45 లక్షలు డిప్యూటీ సీఎం పవన్ మంజూరు చేయించారు.
- కొణిదెల గ్రామస్థుల అభ్యర్థన మేరకు 4 గోకులాలు, గృహ నిర్మాణ శాఖ సహకారంతో 19 ఇళ్లు, నీటి తొట్టెలు నిర్మించారు.
- జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైతుల కోసం 49 ఫీడర్ ఛానళ్లు అభివృద్ధి చేశారు.
- 2 చిన్న కాలువల పునరుద్ధరణ, 3 కమ్యూనిటీ చెక్‌డ్యాంలు బాగు చేశారు.
జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే మాకు ముఖ్యం: పవన్ కల్యాణ్
ప్రభుత్వంతో భాగస్వామ్యానికి గేట్స్ ఫౌండేషన్ చూపుతున్న నిబద్ధతకు అభినందనలు: పవన్

