అమ్మలకు రాత్రి బడులు - నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యం
'అమ్మకు అక్షరమాల’ కార్యక్రమానికి శ్రీకారం - పట్టణాల్లో నిరక్షరాస్యుల మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ - పలు ప్రాంతాల్లో రాత్రి బడి ఏర్రాటుకు కార్యాచరణ చేపట్టిన అధికారులు

Published : January 7, 2026 at 11:55 AM IST
Amma ku Aksharamala Program : పట్టణాలో ఉన్న నిరక్షరాస్యుల మహిళా సంఘాల సభ్యులకు రాయడం, చదవడం, నేర్పించడానికి అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో ఉల్లాస్ కింద పేర్లు నమోదు చేసుకున్నారు. వీరికి పలు ప్రాంతాల్లోనే రాత్రి బడి ఏర్పాటు చేసి అక్షరాస్యత మెరుగుపరేందుకు కార్యాచరణ చేపట్టారు. తాజాగా నగరపాలికతోపాటు మూడు పురపాలికల్లో మొత్తం 17,778 మంది మహిళల ఉల్లాస్ పథకం ద్వారా చదువు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
పట్టణాల్లో సమాఖ్య సభ్యులకు శిక్షణ : పురపాలికల పరిధిలో చదువు రాని సంఘాల సభ్యులకు చదువు నేర్పేందుకు వీలు ఉండేలా అక్షరాస్యత కార్యక్రమాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో మంగళవారం సమాఖ్యలోని ముగ్గురికి చొప్పున పదాధికారులకు శిక్షణ ఇచ్చారు. ఇందులో సుమారు 400 మంది పాల్గొన్నారు. కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీఆర్పీ)లు ఇద్దరు శిక్షణ ఇచ్చారు. వరుసగా హుజారాబాద్, జమ్మికుంట, చొప్పదండి పట్టణాల్లో కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మొత్తం 179 సమాఖ్యలు ఉన్నాయి. ఆన్లైన్లో నమోదైన నిరక్షరాస్యుల ప్రకారం పది మంది చొప్పున మ్యాపింగ్ చేశారు. సమాఖ్య పరిధిలో శిక్షణ పొందిన పదాధికారులు అక్షరమాలపై పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది.
ఉన్నత విద్యకు అవకాశం : స్వశక్తి సంఘాల్లోని మహిళలు చదువును మధ్యలో వదిలేసి ఇబ్బందులు పడుతున్న సంఘ సభ్యులకు మంచి అవకాశం కల్పించనుంది. ఈ టాస్ పథకం ద్వారా దూర విద్య ప్రవేశాలు తీసుకున్నారు. పది, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసేందుకు మహిళా సంఘ సభ్యులు ముందుకొచ్చారు. ఒక వైపు మధ్యలో చదువు మానేసిన వారికి ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కూడా ఇక్కడ కల్పిస్తుండగా, మరో వైపు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు మెప్మా ముందుకొచ్చింది. అంతే కాదు శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి రాత్రి పూట చదువు చెప్పించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
డ్వాక్రా మహిళలకు రాత్రి పూట బడులు : ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. నిరక్షరాస్యులైన మహిళల్లో అక్షర వెలుగులు నింపేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుత రోజుల్లో పల్లె, పట్టణం తేడా ఎక్కడ చూసినా డిజిటల్, సాంకేతికత, నగదు రహిత లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు పొదుపు సంఘాల్లో మహిళలకు ఇవన్నీ నేర్చుకోవడం ఎంతో అవసరం.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) అనే కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆర్థిక సామాజిక, డిజిటల్ అక్షరాస్యతపై మహిళలకు తరగతులు నిర్వహిస్తోంది. బ్యాంకు అకౌంట్లున్న వారికి వాటి నిర్వహణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అన్ని జిల్లాలో డ్వాక్రా మహిళలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఆయాలు, వంట పనిచేసే వారికి ఉల్లాస్ పథకం అమలు చేయనున్నారు.
మహిళలకు బోధించాల్సింది ఇదే :
- మన ఆచార వ్యవహారాలు
- మా ఇంటి మహాలక్ష్మి
- పిల్లల పెంపకం- మన బాధ్యత
- కుటుంబం-ఇరుగుపొరుగు
- పరిశుభ్రత-ఆరోగ్యం
- ఎన్నికలు
- చట్టాలు తెలుసుకుందాం
- డిజిటల్ అక్షరాస్యత
- పైన తెలిపిన అంశాల అనుగుణంగా తెలుగు భాష, గణితం దైనందిన వినియోగానికి సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశంతో వాచకం రూపొందించారు.
మెప్మా ఆధ్వర్యంలో ఎన్నో శిక్షణలు : మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా వివిధ రకాల శిక్షణలు ఇస్తున్నారు. ముఖ్యంగా అక్షరాస్యత ఉల్లాస్ వంటి పథకాల ద్వారా డిజిటల్ అక్షరాస్యత, బుక్ కీపింగ్ బ్యూటీషియన్, టైలరింగ్, స్వయం ఉపాధి కోర్సులు లాంటివి శిక్షణ ఇస్తున్నారు.
ఏడు నెలల శిక్షణతో జాబ్ పక్కా! - దరఖాస్తుకు ఇంకో ఆరు రోజులు మాత్రమే సమయంట
ఆంగ్ల భాషపై పట్టు సాధించాలా? - ఫ్రీగా కోచింగ్ సదుపాయం - అర్హులు వీరే

