ETV Bharat / state

ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం - నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం - క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్, ఫోరెన్సిక్‌ నిపుణులు కీలక ఆధారాలు సేకరణ - ఆలయ సిబ్బందిని ఇబ్బంది పెట్టాలనే అర్ధరాత్రి శివలింగం ధ్వంసం

Destruction of Shiva Lingam in Draksharamam
Destruction of Shiva Lingam in Draksharamam (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 31, 2025 at 12:07 PM IST

3 Min Read
Choose ETV Bharat

Destruction of Shiva Lingam in Draksharamam : దక్షిణ కాశీగా విరాజిల్లే క్షేత్రం, శక్తిస్వరూపిణిగా దర్శనమిచ్చే జగన్మాత, 14 అడుగుల ఎత్తుతో పరమేశ్వరుడు, ఊరి చుట్టూ శివలింగాలు ఇవన్నీ దక్ష వాటికగా పిలిచే ద్రాక్షారామంలో కనువిందు చేస్తాయి. కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న ఈ భీమేశ్వర ఆలయం పంచారామాల్లో ఒకటిగా, శక్తి పీఠాల్లో ప్రధానమైనదిగా సుప్రసిద్ధం కావడం విశేషం. అలాంటి క్షేత్రమైన భీమేశ్వరాలయంలో అపచారం జరిగింది. కపాలేశ్వర స్వామి లింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసుల ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిని తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్‌గా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా వెల్లడించారు. డ్రైనేజీ వివాదం నేపథ్యంలో ఆలయ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతో నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలిపారు.

ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం - నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు (ETV)

అసలేం జరిగిందంటే?

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో సోమవారం అర్ధరాత్రి ఉత్తర గోపురం సమీపంలో సప్తగోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు. మంగళవారం ఉదయం స్థానికులు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

'ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసులో నిందితుడు అరెస్టు చేశాం. డ్రైనేజీ వివాదంతో ఆలయ సిబ్బందిని ఇబ్బంది పెట్టాలనే అర్ధరాత్రి శివలింగం ధ్వంసం చేశాడు.' - ఎస్పీ రాహుల్‌ మీనా

6 బృందాలతో నిందితుల కోసం అన్వేషణ : సమాచారం అందుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు. ఇప్పటికే క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్, ఫోరెన్సిక్‌ నిపుణులు కీలక ఆధారాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. 6 బృందాలతో నిందితుల కోసం అన్వేషిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. శివలింగంపై సుత్తి వంటి ఆయుధంతో కొట్టి ధ్వంసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన చోట సీసీ కెమెరాలు లేకపోవడంతో చుట్టు పక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించారు. ధ్వంసమైన శివలింగం స్థానంలో మరో లింగాన్ని ప్రతిష్ఠించారు. దానికి ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

మంత్రి ఆనంతో మాట్లాడిన సీఎం చంద్రబాబు : ద్రాక్షారామంలో దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఆయన మాట్లాడారు. బాధ్యులను గుర్తించి, వారిని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. తాను ఇప్పటికే కలెక్టర్, ఎస్పీతో పాటు జిల్లా మంత్రితోనూ మాట్లాడినట్లు మంత్రి ఆనం సీఎంకు వివరించారు.

'‘నిందితులను గుర్తించేందుకు 4 ప్రత్యేక పోలీసు బృందాలను నియమించాం. ధ్వంసమైన శివలింగం స్థానంలో కొత్త దాన్ని పునఃప్రతిష్ఠ చేశాం. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో వేదపండితులు, అర్చకులతో శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం’' అని మంత్రి ఆనం వివరించారు. దర్యాప్తు వివరాలు ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సీఎం సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆలయాల పరిసరాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదు: ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసంపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్న ఆరా తీశారు. కలెక్టర్, ఎస్పీతో ఫోనులో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని మంత్రి ఆదేశించారు. ధ్వంసమైన శివలింగం స్థానంలో కొత్త విగ్రహం పునఃప్రతిష్ఠ అభినందనీయం అన్నారు. ఇలాంటి దుష్కృత్యాలకు పాల్పడినవారిని ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు.

పీవీఎన్‌ మాధవ్‌ డిమాండ్‌: ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ డిమాండ్‌ చేశారు.

టీటీడీ కీలక నిర్ణయం - అలిపిరి మెట్ల మార్గంలో ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌

వైసీపీ హయాంలో గుడి, బడి దేన్నీ వదల్లేదు : మంత్రి వాసంశెట్టి - Minister Vasamsetti Fires on YSRCP