అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామంటే దేవుడి దయ ఉండాలి: పవన్ కల్యాణ్
కొండగట్టులో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రత్యేక పూజలు - దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణం - అభివృద్ధి పనుల కోసం రూ.35.19 కోట్ల టీటీడీ నిధులు మంజూరు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 3:19 PM IST
|Updated : January 3, 2026 at 3:31 PM IST
Pawan Kalyan at Kondagattu Anjanna Temple: ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం కొండగట్టులో పర్యటించారు. టీటీడీ నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేశారు. కూటమి తరఫున ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొండగట్టు వెళ్లిన పవన్ స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు, అర్చకులతో మాట్లాడినప్పుడు సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు వసతి లేక పడుతున్న ఇబ్బందులు ఆయన దృష్టికి తెచ్చారు.
డిప్యూటీ సీఎం పవన్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రూ.35.19 కోట్ల టీటీడీ నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడారు.
"అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామంటే దేవుడి దయ ఉండాలి. కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి నేను ఎలా బయటపడ్డానో ఇప్పటికీ నాకే ఆశ్చర్యం కలిగిస్తోంది. కొండగట్టు అంజన్నే నన్ను కాపాడారు. దీక్ష విరమణకు మండపం, సత్రం కావాలని గతంలో నన్ను కోరారు. టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు అందరి సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది" అని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యం, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొన్నేళ్ల క్రితం ప్రచారం చేస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ తీవ్ర విద్యుదాఘాతానికి గురి కావడంతో కొండగట్టు అంజన కృప వల్లే ప్రమాదం నుంచి బయటపడ్డానని పవన్ కల్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్నికల ముందు వారాహి వాహనంతో వాహన పూజ చేయించి ఇక్కడి నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 2024 ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జూన్ 29 మరోసారి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి అంజన్నను దర్శించుకున్న పవన్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో అభివృద్ధి పనులకు పవన్ ప్రతిపాదించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడుతో చర్చించారు. కొండగట్టు అభివృద్ధి పనుల కోసం రూ.35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతారు. ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం తెలంగాణ జనసేన నాయకులు, శ్రేణులతో పవన్ సమావేశం అయ్యారు.
'కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది. విద్యుత్ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. దీక్ష విరమణకు మండపం, సత్రం కావాలని గతంలో నన్ను కోరారు. భక్తుల కోసం కోరుకున్న బలమైన సంకల్పమిది. ఆంజనేయస్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం కలగడం మా అదృష్టం. గిరిప్రదక్షిణకు నా వంతు సహకారం అందిస్తా. అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామంటే దేవుడి దయ ఉండాలి. కొత్త ఏడాది ఆంజనేయస్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నా.' - ఉపముఖ్యమంత్రి, పవన్ కల్యాణ్
"కొండగట్టులో కార్యక్రమాల కోసం టీటీడీ బోర్డుకు లేఖ రాశారు. లేఖను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఆమోదించారు. బోర్డు సమావేశంలో చర్చించి వెంటనే అనుమతులిచ్చాం. టీటీడీ ఆధ్వర్యంలో మరిన్ని పనులు చేయబోతున్నాం" అని బీఆర్ నాయుడు తెలిపారు.
పల్లె పండగ 2.0 - రూ. 6,700 కోట్లతో అభివృద్ధి పనులు
మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ -కోనసీమ కొబ్బరి రైతుల చిరకాల స్వప్నం సాకారం

