డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించేందుకు అందరూ చేతులు కలపాలి: పవన్ కల్యాణ్
మాదకద్రవ్యాలు నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని నాశనం చేసే హంతకులు - ఇది వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, అతిపెద్ద సామాజిక సవాలు - యువతను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మనందరిదన్న పవన్

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 26, 2026 at 10:19 PM IST
Pawan Kalyan on Anti Drugs : మాదకద్రవ్యాల మహమ్మారిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. డ్రగ్స్ వాడకం అనేది కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదని ఆయన చెప్పారు. అది కుటుంబాలను నిలువునా చీలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ పునాదులనే కదిలించే అత్యంత ప్రమాదకరమైన సామాజిక సవాలు అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. 'అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం' సందర్భంగా సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు, యువతకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన కీలక అంశాలు, ఇచ్చిన సందేశం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Drugs are not just a personal issue but a serious social challenge that can quietly destroy health, break families, and weaken the foundation of our society.
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) June 26, 2026
On this International Day Against Drug Abuse and Illicit Trafficking, I reaffirm my deep commitment to supporting all…
యువశక్తికి సరైన దిశానిర్దేశం : మన దేశానికి యువతే అతిపెద్ద బలమని, మన యువతరంలో అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని పవన్ కల్యాణ్ వెల్లడించారు. వారిలో అద్భుతమైన భవిష్యత్తు దాగి ఉందన్నారు. ఈ అపారమైన యువశక్తిని సరైన మార్గంలో మలచాలని సూచించారు. వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విద్య, క్రీడలు, సాంస్కృతిక విలువల పట్ల వారిలో మక్కువ పెంచాలన్నారు. నైపుణ్యాభివృద్ధికి తగిన అవకాశాలు కల్పించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలన్నారు. యువతను క్రమశిక్షణ, గౌరవం, సార్థకమైన జీవితం వైపు నడిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ప్రభుత్వ కఠిన చర్యలు, స్పష్టమైన వైఖరి : డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తన పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. మాదకద్రవ్యాల ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. డ్రగ్స్ దుష్ప్రభావాలపై ప్రజల్లో భారీగా అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. మత్తుకు బానిసలైన వారికి మెరుగైన పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అదే సమయంలో, డ్రగ్స్ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను అమలు చేస్తామని హెచ్చరించారు.
అందరం ఏకమవుదాం : ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేసినప్పటికీ, సమాజం అంతా మారితేనే శాశ్వత పరిష్కారం దొరుకుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు. సమాజం అంతా ఒక్కతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే ఈ మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టగలమని అన్నారు. ఈ పోరాటంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, స్వచ్ఛంద సంస్థల పాత్ర చాలా కీలకమని ఆయన గుర్తు చేశారు.
బాధితులకు అండగా నిలుద్దాం : సమస్యను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యమని డిప్యూటీ సీఎం తెలిపారు. పిల్లల ప్రవర్తనలో మార్పులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పసిగట్టాలన్నారు. యువతలో డ్రగ్స్ పట్ల తీవ్రమైన అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పొరపాటున ఎవరైనా మత్తు వలయంలో చిక్కుకుంటే, వారి పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదని కోరారు. వారికి సరైన సమయంలో మనమంతా మద్దతు ఇవ్వాలన్నారు. కచ్చితమైన మార్గదర్శకత్వం అందించడం ద్వారా వారిని మళ్లీ సాధారణ, సంతోషకరమైన జీవితంలోకి తీసుకురావచ్చని భరోసా ఇచ్చారు.
"మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. వారిని రక్షించుకోవడం మనందరి తక్షణ కర్తవ్యం. యువతను ఆరోగ్యకరమైన పౌరులుగా తీర్చిదిద్దాలి. దేశాభివృద్ధిలో పాలుపంచుకునే బాధ్యతాయుతమైన పౌరులుగా వారు ఎదిగేలా మనం అండగా నిలవాలి. ఇందుకోసం మనమందరం ఏకమవుదాం. డ్రగ్స్ ముప్పునకు వ్యతిరేకంగా ఉక్కుపాదం మోపుదాం. ఒక ఆరోగ్యకరమైన, డ్రగ్స్ లేని నవ సమాజం కోసం కలిసి పనిచేద్దాం" అని పవన్ కల్యాణ్ తన సందేశాన్ని ముగించారు.
రౌడీయిజం, గూండాయిజం చేసేవారిని తొక్కి నార తీస్తాం: పవన్ కల్యాణ్
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: పవన్ కల్యాణ్

