ETV Bharat / state

గ్రేట్‌ గ్రీన్‌ వాల్ ప్రాజెక్టుపై పవన్​ సమీక్ష - తీర ప్రాంత అడవులకు రక్షణ

తీరప్రాంతాలను పర్యావరణపరంగా మరింత బలంగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం - ఆ ప్రాంతానికి మహర్దశ - రాష్ట్రంలో నోటిఫై కాని మడ అడవులు 10 వేల ఎకరాల విస్తీర్ణంలో

DEPUTY CM PAWAN ON GREAT GREEN WALL
DEPUTY CM PAWAN ON GREAT GREEN WALL (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 7, 2026 at 1:38 PM IST

3 Min Read
Choose ETV Bharat

Deputy CM Pawan Kalyan About Great Green Wall Project : గ్లోబల్‌ వార్మింగ్‌ (భూతాపం)​ ప్రస్తుతం ప్రపంచాన్నంతటిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. దీనివల్ల సముద్ర మట్టాలు పెరిగి తీరప్రాంతంలో ఉన్న గ్రామాలు ప్రమాదంలో పడుతున్నాయి. తుపానుల వేళ అలలు విరుచుకుపడి ఇళ్లు, భూములు, ఆస్తులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కోసం ప్రభుత్వం తీర ప్రాంతాల వెంబడి "గ్రేట్ గ్రీన్ వాల్" కార్యక్రమాన్ని చేపట్టింది.

50 శాతం వరకు గ్రీన్‌కవర్‌ : రాష్ట్రంలో తీర ప్రాంత అడవుల సంరక్షణ, ఆక్రమణల నిరోధానికి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 'గ్రేట్‌ గ్రీన్‌వాల్, 50 శాతం వరకు గ్రీన్‌కవర్‌' ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ నెలాఖరులోగా మార్గసూచీ సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. తీరం వెంబడి ఉన్న మొక్కలకు భద్రత కల్పించడంతోపాటు అటవీ భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూసే బాధ్యతను తీర ప్రాంత నివాసిత ప్రజలకు అప్పగించాలని నిర్దేశించారు.

ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం : సచివాలయంలో మంగళవారం అటవీశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతాన్ని మొత్తం పచ్చదనంతో నింపాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు వ్యక్తిగతంగా నిర్దేశించిన లక్ష్యాల్లో ఒకటని పవన్​కల్యాణ్​ పేర్కొన్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖలతో దీన్ని సాధించే విధంగా కార్యదళాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. తీరప్రాంతాలను పర్యావరణపరంగా మరింత బలంగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. అంతేకాకుండా, రాబోయే తరాలకు సహజ వనరులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడటం కూడా ఈ ప్రాజెక్ట్​ ఉద్దేశం అని తెలిపారు. ఈ గ్రీన్ బెల్ట్ ఏర్పాటుతో తీరప్రాంతాలు మరింత సురక్షితంగా మారతాయని పేర్కొన్నారు.

తుపాన్‌‌తో పాటు తీర ప్రాంతాల్లో కోతలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా ప్రజలను, భూభాగాన్ని రక్షించడంలో ఈ ప్రాజెక్ట్ కీలకంగా ఉంటుందన్నారు. తీరప్రాంత గ్రామాలు ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలకు గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఒక దీర్ఘకాలిక పరిష్కారమన్నారు. ఈ ప్రాజెక్ట్ అమలులో నిపుణుల సలహాలను, శాస్త్రీయ విధానాలను పాటించాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ కేవలం పర్యావరణాన్ని సంరక్షించడమే కాకుండా, జీవవైవిధ్యాన్ని వృద్ధి చేయడంలోనూ, స్థానిక ప్రజలకు కొత్త ఉపాధి మార్గాలను చూపించడంలోనూ సహాయపడుతుందని తెలిపారు. ఆయన చెప్పిన ముఖ్యాంశాలివి.

ముఖ్యాంశాలు :

  • తీరప్రాంతం మొత్తాన్ని 5 కిలోమీటర్ల వెడల్పున మొత్తం పచ్చదనంతో నింపేయాలి. సరుగుడు, మడ, తాటి మొక్కలు వంటివి నాటాలి. అందులో అటవీశాఖ పరిధిలో ఎంతుంది? సీఆర్‌జడ్‌ పరిధిలోని భూ విస్తీర్ణమెంత? ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల చేతుల్లో ఉన్న భూమి ఎంత అనేదానిపై మొదట అధ్యయనం చేయాలి.
  • 50% గ్రీన్‌కవర్‌ పెంచడంలో సంబంధిత శాఖలన్నింటినీ దీనిలో భాగస్వాములను చేయాలి. మొక్కలు నాటేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలి. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇతర శాఖలను కూడా సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలి.
  • మూడు దశల్లో గ్రేట్‌ గ్రీన్‌వాల్‌ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలి. మొదటిదశలో కోస్తా ప్రాంతానికి ఆనుకుని ఉండే ప్రాంతం, రెండోదశలో తీరప్రాంతానికి ఆనుకుని ఉండే రహదారులు, కాలువలు, డొంకల వెంబడి ప్రాంతాలు. చివరి దశలో రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ భూముల్లో మొక్కలు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి.

"రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫై కాని మడ అడవులు 10 వేల ఎకరాల వరకు విస్తీర్ణంలో ఉన్నట్లు శాటిలైట్‌ ద్వారా గుర్తించాం. వీటిని కూడా నోటిఫై చేసి అటవీ శాఖకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నాం. ముందుగా అటవీ శాఖ పరిధిలోలేని ఈ మడ విస్తీర్ణంలో ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలి" - పవన్‌కల్యాణ్‌, ఉప ముఖ్యమంత్రి

ఇరుసుమండలో అదుపులోకి రాని బ్లోఅవుట్‌-మరో ఐదు రోజులపాటు మంటలు కొనసాగుతాయని అధికారులు వెల్లడి

అమరావతిలో రెండో దశ భూసమీకరణ - రేపు నోటిఫికేషన్