సోషల్ మీడియాలో పోస్టులు, రెచ్చగొట్టే ప్రసంగాలు - గవర్నర్‌తో పవన్ కల్యాణ్ భేటీ
గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పవన్ కల్యాణ్ భేటీ - రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన పవన్ - ఈగల్ ఐజీ రవికృష్ణ అందించిన రిపోర్ట్‌ను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన పవన్

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 3, 2026 at 6:40 PM IST
|Updated : July 3, 2026 at 7:51 PM IST
Pawan Meet Governor Abdul Nazeer : లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పాటు ఈగల్ ఐజీ రవికృష్ణ అందించిన రిపోర్ట్‌ను అబ్దుల్ నజీర్ దృష్టికి పవన్ తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో పోస్టులు, రెచ్చగొట్టే ప్రసంగాలు, కులమత విద్వేష వ్యాఖ్యలను గవర్నర్‌కు ఆయన వివరించినట్లు సమాచారం.
మరోవైపు సానుకూల వాతావరణంలో ఈ భేటీ జరిగిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అబ్దుల్ నజీర్‌తో సంభాషించడం, వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గవర్నర్ అందించిన విలువైన మార్గదర్శకత్వంతో పాటు ఆయన ఆప్యాయమైన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Had a warm and productive meeting with the Hon’ble Governor of Andhra Pradesh, Shri Abdul Nazeer Garu, today.
— Pawan Kalyan (@PawanKalyan) July 3, 2026
It was a pleasure interacting with him and exchanging thoughts on various matters. Grateful for his valuable guidance and gracious hospitality.@governorap pic.twitter.com/LdsPIc5ZZe
Pawan on Social Media Abuse : రెండు రోజుల క్రితమే సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాలు మన రోజువారి జీవితంలో భాగమయ్యాయని అన్నారు. మన అభిప్రాయాలు చెప్పడానికి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ఒకరితో ఒకరు అనుసంధానం అవ్వడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, శక్తివంతమైన వేదికలా మారిందని చెప్పారు. ఈ పేరుతో కొందరు వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయటాన్ని ఆయన తప్పుబట్టారు.
వాక్ స్వాతంత్రం అపరిమితమైన హక్కు కాదని, పరిమితులు ఉన్నాయని పవన్ పేర్కొన్నారు. ఎదుటివారి హక్కులకు భంగం కలిగించినప్పుడు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్ఛరించారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదని స్పష్టంచేశారు. కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం, ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుందని తెలిపారు. చాలా మంది ఫేక్ అకౌంట్స్ వెనక దాక్కొని వ్యక్తిగత దూషణలు, పరువు తీసే ప్రయత్నాలు, ఫేక్ ప్రొపగాండా, మార్ఫింగ్ ఫోటోలు, ఆర్గనైజ్డ్ హరాస్మెంట్కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చివరికి దేవుళ్లని, దేవతలపైనా ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ వెల్లడించారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్క్రీన్‌షాట్స్, లింక్స్, వీడియోలతో ఫిర్యాదు చేయాలని వాటి ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి నేరాలకి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే ఇవాళ గవర్నర్‌తో పవన్ కల్యాణ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Ake Ravi Krishna Meet Pawan Kalyan : అంతకుముందు మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈగల్ విభాగానికి సంబంధించిన వార్షిక నివేదికను ఆకే రవికృష్ణ, పవన్‌కు అందజేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు ఈగల్ విభాగం తీసుకుంటున్న చర్యలు, సాధించిన ఫలితాలను ఈ నివేదికలో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేధింపులు, ట్రోలింగ్ అంశాలతోపాటు మహిళలను టార్గెట్ చేస్తూ అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై సైబర్ క్రైమ్ విభాగం ద్వారా తీసుకుంటున్న కఠిన చర్యలను ఉప ముఖ్యమంత్రికి ఆయన వివరించారు.
ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడం టు అబ్యూజ్ కాదు : పవన్ కల్యాణ్
రౌడీయిజం, గూండాయిజం చేసేవారిని తొక్కి నార తీస్తాం: పవన్ కల్యాణ్

