ETV Bharat / state

టెక్నాలజీతో అటవీ జంతువుల సంరక్షణ - కూటమి సర్కారు ముందడుగు

నేడు హనుమాన్ ప్రాజెక్టు ప్రారంభించనున్న పవన్‌కల్యాణ్‌, లోకేశ్​ - ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో కార్యక్రమం - 11 అంశాలతో హనుమాన్‌ ప్రాజెక్టును రూపొందించిన అటవీశాఖ

Deputy CM Pawan Kalyan Launches Hanuman Project in Chittoor
Deputy CM Pawan Kalyan Launches Hanuman Project in Chittoor (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 3, 2026 at 9:47 AM IST

2 Min Read
Choose ETV Bharat

Deputy CM Pawan Kalyan Launches Hanuman Project in Chittoor : మనుషులు, జంతువుల మధ్య సంఘర్షణ నివారించడంతో పాటు టెక్నాలజీ సాయంతో అటవీ జంతువుల సంరక్షణ చేపట్టేలా కూటమి సర్కారు ముందడుగు వేసింది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అటవీశాఖ అధికారులు రూపొందించిన హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా నేడు మంత్రి నారా లోకేష్‌తో కలిసి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అడవి ఏనుగుల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బంది తప్పించటంపై ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ సూచన మేరకు అటవీశాఖ అధికారులు కసరత్తు చేశారు. అటవీ ప్రాంతాల్లో వణ్యప్రాణులకు ఎదురవుతున్న సమస్యలు తగ్గించటం సహా జనారణ్యంలోకి జంతువులు వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూసేందుకు హనుమాన్ పేరిట కార్యక్రమం రూపొందించారు.

నాలుగు నెలల క్రితం పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతానికి వెళ్లినప్పుడు అటవీశాఖ అధికారులు దీనిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 11 అంశాలతో కూడిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరికొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నారు.

జంతు సంచారానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పడు ప్రజలకు చేరవేసేందుకు వీలుగా గతంలో ఉన్న యాప్ ఆధునీకరించారు. ఏనుగులతో పాటు వణ్యప్రాణులకు ప్రత్యేక రేడియో కాలర్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఏనుగుల సంచారం ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. గుంపులుగా తిరిగే ఏనుగులతో పాటు ఒంటరి ఏనుగులు సమాచారం తెలిసేలా రూపకల్పన చేశారు.

దీని కోసం కేంద్రం నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. ఇదే సాంకేతికతతో ఇటీవల రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన పులిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అలాగే ఏనుగుల రాకను పసిగట్టి తుపాకీ శబ్దాలు చేసే వ్యవస్థను కూడా కొన్నిచోట్ల ఏర్పాటు చేశారు. ఇవన్నీ ప్రయోగాత్మకంగా విజయవంతమయ్యాయి. వాటిని పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు హనుమాన్ ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నారు. ఏనుగుల దాడిలో ఎవరైనా గాయపడితే వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందించేలా అంబులెన్సులు సమకూర్చారు. ప్రాణ, ఆస్తినష్టం జరిగినా పరిహారం కూడా ఈ ప్రాజెక్టు కింద అందించనున్నారు.

జనావాసాల్లోకి వచ్చిన పాముల నుంచి ప్రజలకు హాని జరక్కుండా వాటిని పట్టుకుని అడవుల్లో వదిలేలా వాలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. సర్పమిత్ర పేరుతో వాలంటీర్లు సేవలందిస్తారు. ఇలాంటి 11 ప్రత్యేకతలతో రూపొందిన హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టును పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసి మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో జరిగే కార్యక్రమంలో ప్రారంభిస్తారు.

వాలంటీర్లుగా గ్రామ యువకులు: అటవీ శాఖ సిబ్బందితో పాటు స్థానికుల భాగస్వామ్యం కూడా ఈ ప్రాజెక్టులో చాలా కీలకమైనది. అందుకే అటవీ సరిహద్దు గ్రామల్లోని చురుకైన యువకులను గుర్తించి, వారిని వాలంటీర్లుగా నియమిస్తారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అలాగే హనుమాన్ ప్రాజెక్టు కోసం అటవీ శాఖ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది.

ఒక్కో సర్కిల్ పరిధిలో 2 రెస్క్యూ బృందాలు నిరంతరం విధులు నిర్వహిస్తాయి. వీరికి అత్యాధునిక వైర్ లెస్ సెట్లు, యానిమల్ మేనేజ్​మెంట్ పరికరాలు అందజేస్తారు. ప్రమాదవశాత్తూ గాయపడే వన్యప్రాణులకు తక్షణ చికిత్స అందించడం చాలా ముఖ్యం. అందుకే ప్రతి సర్కిల్​కు 2 అధునాతన అంబులెన్సులనూ కేటాయిస్తారు. వాటితో పాటు ఇద్దరూ వెటర్నరీ డాక్టర్లు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.

గ్రేట్‌ గ్రీన్‌ వాల్ ప్రాజెక్టుపై పవన్​ సమీక్ష - తీర ప్రాంత అడవులకు రక్షణ

మనుషులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలకు చెక్ - మార్చి నుంచి 'హనుమాన్​'