ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడం టు అబ్యూజ్ కాదు : పవన్ కల్యాణ్
వాక్ స్వాతంత్ర్యం అభిప్రాయాలు చెప్పడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి హక్కు ఇస్తుందన్న పవన్ -వాక్ స్వాతంత్ర్యం ఉందని ఏదైనా మాట్లాడేందుకు వీలుండదు పరిమితులున్నాయని వ్యాఖ్య

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 1, 2026 at 7:44 PM IST
|Updated : July 1, 2026 at 8:44 PM IST
Pawan on Social Media Abuse : యూట్యూబ్ ఛానళ్ల పేరుతో జర్నలిస్టులుగా చెప్పుకుని కొందరు, ఎనలిస్టులుగా మరికొందరు, కులమతాల సభల పేరిట ఇంకొందరు ఇటీవలి కాలంలో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. వారిపై కేసులు నమోదు చేస్తే అప్రజాస్వామికం, వాక్ స్వాతంత్రం హక్కు అనే వాదనల్ని తెరపైకి తెస్తున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువమంది ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. ఇలాంటి చర్యలకు చట్టపరంగానే అడ్డుకోవటంతో పాటు వారి వాదనల్ని తిప్పికొట్టాలని ఆయన భావించారు. ఈ మేరకు పవన్ ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు.
సామాజిక మాధ్యమాలు మన రోజువారి జీవితంలో భాగమయ్యాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మన అభిప్రాయాలు చెప్పడానికి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ఒకరితో ఒకరు అనుసంధానం అవ్వడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, శక్తివంతమైన వేదికలా మారిందన్నారు. ఈ పేరుతో కొందరు వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయటాన్ని ఆయన తప్పుబట్టారు. వాక్ స్వాతంత్రం అపరిమితమైన హక్కు కాదని, పరిమితులు ఉన్నాయని చెప్పారు. ఎదుటివారి హక్కులకు భంగం కలిగించినప్పుడు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్ఛరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, క్లాస్ 2 ప్రకారం, దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడానికి వీల్లేదన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదని పవన్ స్పష్టంచేశారు.
"ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుంది. మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకు ఉంది. దాన్ని స్వాగతిస్తాం. కానీ ఒకరిని తిట్టడం, చంపుతామని బెదిరించడం, ఆధారాలు లేని ఆరోపణలు, మహిళల్ని తిట్టడం, మత విశ్వాసాలను అవమానించడం, హింసకు ప్రేరేపించడం రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాల కిందకు వస్తాయి." - పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి
'కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం, ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. చాలా మంది ఫేక్ అకౌంట్స్ వెనక దాక్కొని వ్యక్తిగత దూషణలు, పరువు తీసే ప్రయత్నాలు, ఫేక్ ప్రొపగాండా, మార్ఫింగ్ ఫోటోలు, ఆర్గనైజ్డ్ హరాస్మెంట్కు పాల్పడుతున్నారు. చివరికి దేవుళ్లని, దేవతలపైనా ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది భావప్రకటనా స్వేచ్ఛ కాదని' పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
"నిర్మాణాత్మక వ్యాఖ్యలు, విమర్శలు, సెటైర్లు ప్రజాస్వామ్యంలో భాగమే. అలాంటి అభిప్రాయాలను గౌరవిస్తాం. కానీ నేరపూరిత ఉద్దేశాలతో తప్పుడు ప్రచారాలు చేసేవారు, విద్వేషాలు రెచ్చగొట్టేవారు, పరువును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలనే ప్రయత్నాలు సమర్ధించేది లేదు. నేరస్థులకు, నేరానికి కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీ లేదు. తప్పు చేసిన తర్వాత కులం, మతం, ప్రాంతం లేదా రాజకీయ వెనకాలు దాక్కోవాలని చూడొద్దు. చట్టం ముందు పౌరులంతా సమానమే. తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలుంటాయి." - పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి
సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తన కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్క్రీన్‌షాట్స్, లింక్స్, వీడియోలతో ఫిర్యాదు చేయాలని వాటి ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి నేరాలకి పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, బిఎన్ఎస్ఎస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 మరియు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
'సైబర్‌క్రైమ్ పోలీస్, ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఎజెన్సీస్తో కలిసి పనిచేస్తూ, సామాజిక మాధ్యమాల్లో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే సమయంలో, రాజ్యాంగం కల్పించిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని పూర్తిగా పరిరక్షిస్తాం. మన మాటల్లో బాధ్యత ఉండాలి. మాట్లాడే భాషలో గౌరవంగా ఉండాలి. స్వేచ్ఛకు జవాబుదారితనం ఉండాలని' పవన్ కల్యాణ్ పేర్కొన్నారు
"మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి. కానీ, గౌరవంతో, బాధ్యతతో, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పాలి. అలా కాకుండా మా ఇష్టానికి మాట్లాడతాం, మా ఇష్టానికి ఏదైనా అంటాం అంటే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. తప్పుడు ప్రచారాలు, సమాచారాలు, చట్ట విరుద్ధమైన కంటెంట్ కనిపిస్తే దాన్ని వేరేవారికి పంపించవద్దు. ఆ ఆధారాలను భద్రపరిచి, అధికారులకు ఇవ్వాలి." - పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి
రౌడీయిజం, గూండాయిజం చేసేవారిని తొక్కి నార తీస్తాం: పవన్ కల్యాణ్
'దిల్లీ మెడలు వంచుతాం' అనేవాళ్లు ఇక్కడికొస్తే వెనక్కి తగ్గుతారు : పవన్ కల్యాణ్

