ప్రభుత్వంతో భాగస్వామ్యానికి గేట్స్ ఫౌండేషన్ చూపుతున్న నిబద్ధతకు అభినందనలు: పవన్
విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల బలోపేతానికి గేట్స్ భాగస్వామ్యం - సమగ్ర, స్థిర అభివృద్ధి కోసం సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోందన్న పవన్

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 16, 2026 at 10:50 PM IST
Deputy CM Pawan kalyan on Bill Gates AP Tour : విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసేందుకు గేట్స్ ఫౌండేషన్ చూపుతున్న నిబద్ధతకు అభినందనలు తెలుపుతున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. సమగ్ర, స్థిరమైన అభివృద్ధిని సాధించే దిశగా అర్థవంతమైన సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోందన్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో ఆత్మీయ స్వాగతం పలికటం ఆనందంగా ఉందని వెల్లడించారు.
Founder of Microsoft, Mr. @BillGates, visited Andhra Pradesh this morning. Hon’ble Chief Minister Sri @ncbn garu, and Deputy Chief Minister @PawanKalyan accorded him a warm welcome at the State Secretariat.
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) February 16, 2026
During the subsequent meeting, DyCM Pawan Kalyan appreciated the Gates… pic.twitter.com/yJMtHOcMkX
గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్‌తో ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతిక ఆధారిత పరిపాలన రంగాల్లో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసే అంశాలపై సచివాలయంలో చర్చలు సాగుతున్నాయని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రజలకు స్థిరమైన, విస్తృత ప్రభావం కలిగించే పరిష్కారాలను అందించేందుకు గేట్స్ ఫౌండేషన్‌తో సన్నిహితంగా పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తోందని వెల్లడించారు. బిల్ గేట్స్‌కు అమరావతి స్వాగతం పలుకుతోందన్నారు. సహచర మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ లతో కలిసి విజయవాడ విమానాశ్రయంలో స్వాగతించడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు.
ఏపీలో ముగిసిన బిల్ గేట్స్ పర్యటన : ఏపీలో బిల్ గేట్స్ రాష్ట్ర పర్యటన ముగిసింది. విజయవాడ నుంచి ముంబై మీదుగా దిల్లీకి వెళ్లారు. దాదాపు ఐదున్నర గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పటమట చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడారు. బిల్ గేట్స్ అమరావతి పర్యటన సందర్భంగా సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047, ప్రభుత్వ పాలసీలు, లక్ష్యాలు, కార్యక్రమాలపై బిల్ గేట్స్‌కు సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు.
వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ-దిశ ఏర్పడుతుందని చంద్రబాబు ఆకాంక్షించారు. బిల్ గేట్స్‌తో తన అనుబంధాన్ని సమావేశంలో ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. 1997లో మొదటిసారి బిల్ గేట్స్‌ను కలిసిన సంగతి, హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు జరిగిన విధానాన్ని గేట్స్ సమక్షంలో గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ఏపీలోని వివిధ ప్రాజెక్టులకు గేట్స్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధనకు కృషి: వైద్యరంగంలో తెచ్చిన మార్పులు-సాధించిన ఫలితాలపైనా ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బిల్ గేట్స్ అమరావతి పర్యటన చారిత్రాత్మకమన్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ పర్యటన దోహదం చేస్తుందని అన్నారు. నాడు మైక్రోసాఫ్ట్ రాకతో ఐటీ రంగంలో హైదరాబాద్ మేటిగా నిలబడిందని తెలిపారు. ఏపీలో అన్ని వనరులు ఉన్నాయి, ఇప్పుడు సంపద సృష్టి జరగాల్సి ఉందని అన్నారు.
బిల్ గేట్స్ సహకారంతో వివిధ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని వెల్లడించారు. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామన్నారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనేది ఏపీ ప్రభుత్వ విధానమన్న సీఎం ఇందుకు సాంకేతికతని విస్తృతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. అమరావతి డిజైన్ అండ్ ఫౌండ్రీ, క్వాంటం వ్యాలీగా ఆవిష్కృతం అవుతుందన్నారు. డేటా-ఏఐ సిటీగా విశాఖ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కాకినాడ, డ్రోన్ సిటీగా ఓర్వకల్లును తీర్చిదిద్దుతున్నామన్నారు.
యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్: ఎలక్ట్రానిక్స్-ఏరో సిటీగా లేపాక్షి, ఎలక్ట్రానిక్స్-స్పేస్ సిటీగా తిరుపతిని అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 10 రంగాలు, 30 ప్రభుత్వ విభాగాల్లో ఏఐని వినియోగిస్తున్నామన్నారు. విద్యారంగంలో అధునిక విధానాలను పాటిస్తున్నాం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా బోధనలో మార్పులు చేస్తున్నామన్నారు.
వ్యవసాయం, అనుబంధ రంగాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమం కోసం సాంకేతిక సాయం తీసుకుంటున్నామన్నారు. మెరుగైన ప్రజారోగ్య సేవలు అందించేందుకు అత్యున్నతస్థాయి నిపుణులతో సలహా మండలి ఏర్పాటు చేశామని వివరించారు. యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ విధానం ప్రజలకు ముందస్తుగానే మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
రాజధానిలో బిల్ గేట్స్ పర్యటన - సీఎం చంద్రబాబుతో భేటీ
బిల్‌గేట్స్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు - ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాలపై ప్రధానంగా చర్చ

