15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ది : పవన్ కల్యాణ్
ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పవన్ కల్యాణ్ హితబోధ - వైఎస్సార్సీపీ విధ్వంసాన్ని అధిగమించి రాష్ట్రాన్ని ప్రగతి వైపు తీసుకెళ్తున్నామని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 11, 2026 at 6:36 PM IST
Pawan Kalyan Comments in NDA Legislature Party Meeting: వైఎస్సార్సీపీ 5 ఏళ్ల విధ్వంసాన్ని అధిగమించి రాష్ట్రాన్ని ప్రగతి వైపు తీసుకువెళ్తున్నామని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. 3 పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హితబోధ చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 20 నెలల్లో చాలా కష్టపడి ఐక్యంగా పనిచేశామని గుర్తుచేశారు. 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, ఐక్యంగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
భిన్నమైన అభిప్రాయాలు ఉంటే పార్టీలో అంతర్గతంగా కూర్చుని మాట్లాడుకుందామని, కూటమి ధర్మానికి ప్రతి ఒక్కరం కట్టుబడి పని చేద్దామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఉన్న పోరాట స్పూర్తే ఇప్పుడూ కూటమి నేతల్లో కొనసాగాలని పవన్ కల్యాణ్ అన్నారు. దుర్మార్గపు పాలన అంతమొందించి రాష్ట్రం బాగు కోసం కలసి పనిచేసామని గుర్తుచేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉండేందుకు ఐక్యంగా కూటమి కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజలు బుద్ది చెప్పినా వైఎస్సార్సీపీ దుర్మార్గాలు పోలేదని కలసి కట్టుగా వారి కుట్రలను ధీటుగా తిప్పికొడదామని పిలుపునిచ్చారు. కూటమి ఐక్యతకు విఘాతం కలిగించేలా ఎవరూ ప్రవర్తించవద్దని పవన్ సూచించారు.
సభలో సమయస్ఫూర్తి ఎంతో ముఖ్యం: సభలో ఎంత సేపు మాట్లాడాం అనే దానికంటే ఎంత కంటెంట్ మాట్లాడామనేది ముఖ్యమని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు తాను కలిసే ప్రతీ సంస్థపై ముందస్తు సమాచారంతో కసరత్తు చేశామని గుర్తుచేశారు. భేటీలో ఆ సంస్థకు ప్రభుత్వ పరంగా కావాల్సినవి ఏంటి, మనకున్న వనరులు ఏంటి అనేది సూటిగా చెప్పి ప్రతీ సమావేశాన్ని 7 నిమిషాల్లో సీఎం ముగించారని అన్నారు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువమంది పారిశ్రామిక వేత్తలను సీఎం కలిశారని తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు కూడా సీఎం చంద్రబాబు స్పూర్తితో తక్కువ సమయంలో ఎక్కువ విషయం డెలివరీ చేసేలా చూడాలని మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. సభలో సమయస్ఫూర్తి ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు.

