తెలంగాణపై ప్రేమ ఉంటే గోదావరి బెల్ట్ కోల్‌బ్లాక్‌లు సింగరేణికి కేటాయించాలి : భట్టి విక్రమార్క
తాడిచెర్ల-2 బొగ్గు గనులను వేలం లేకుండానే సింగరేణి సంస్థకు కేటాయించిన కేంద్రం - అనుమతి ఇవ్వడం సంతోషకరమని వెల్లడించిన ఉపముఖ్యమంత్రి - గోదావరి బెల్ట్ కోల్ బ్లాక్‌లను వేలం లేకుండా సింగరేణికి ఇవ్వాలని విజ్ఞప్తి

Published : July 8, 2026 at 6:14 PM IST
|Updated : July 8, 2026 at 7:03 PM IST
Bhatti Vikramarka On Tadicharla 2 : సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వాస్తవాలను మరుగునపరిచి తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. 2013లో సింగరేణికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తు చేశారు. యూపీఏ హయాంలోనే తాడిచర్ల-2ను సింగరేణికి కేంద్రం కేటాయించిందని వెల్లడించారు. తాడిచెర్ల-2 బొగ్గు గనులను వేలం లేకుండానే సింగరేణి సంస్థకు కేటాయించినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో భట్టి విక్రమార్క ఈ విధంగా వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకు పెండింగ్‌లోనే : గిరిజన ప్రాంతాల్లోని బొగ్గును ప్రభుత్వ సంస్థలు తప్ప మరొకరు చేయకూడదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి అవసరాల దృష్ట్యా కేంద్రానికి లేఖ రాస్తే కేంద్రం కేటాయించిందని చెప్పుకొచ్చారు. గతంలోనే కేటాయిస్తే 2013 నుంచి ఇప్పటివరకు పెండింగ్‌లో పెట్టారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బ్లాక్ కేటాయింపు జరిగిందని అయితే మైనింగ్ లీజు కోసం అనుమతి ఇవ్వలేదని తెలిపారు.
కొత్త చట్టం ప్రకారం తాడిచర్ల-2 సింగరేణికి ఇవ్వబోమని ఆయన అన్నారు. యాక్టు రావడానికి ముందే సింగరేణికి తాడిచర్ల-2 కేటాయించారని తెలిపారు. ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసి వాస్తవాలను వారి ముందుంచామన్నారు. మైనింగ్ లీజు పెండింగ్ పెట్టడం వల్ల సింగరేణికి నష్టమని వివరించామని చెప్పారు. గోదావరి బెల్ట్ కోల్ బ్లాక్‌లను వేలం లేకుండా సింగరేణికి ఇవ్వాలని కిషన్‌రెడ్డిని కోరామన్నారు. వేలం లేకుండా ఇస్తే కొత్త బ్లాక్‌లు కేటాయించినట్లు అవుతుందని తెలిపారు.
బ్లాక్-3లో మైనింగ్ చేయడానికి వీలులేదు : 2022లో గిరిజన ప్రాంతంలో వేలం వేసి ప్రైవేటుకు అప్పగించారని ప్రస్తావించారు. గిరిజన ప్రాంతంలో మైనింగ్ ప్రక్రియను గిరిజనులు లేదా ప్రభుత్వ సంస్థలు మాత్రమే చేయాలనేది చట్టమని గుర్తు చేశారు. 2022లో కోయగూడెం బ్లాక్-3 వేలం వేసి ప్రైవేటు సంస్థకు అప్పగించారని అన్నారు. నాటి నుంచి బ్లాక్-3లో మైనింగ్ చేయడానికి వీలులేదన్నారు. ఈ నేపథ్యంలో ఇది పెండింగ్‌లో ఉందన్నారు.
వేల కోట్లు నష్టం వచ్చింది : సింగరేణికి తాడిచర్ల-2 అప్పగించకపోవడం వల్ల వేల కోట్లు నష్టం వచ్చిందని భట్టి విక్రమార్క అన్నారు. సీఎం ఒత్తిడికి స్పందించి మైనింగ్ అనుమతి ఇవ్వడం సంతోషకరమని చెప్పారు. మైనింగ్ అనుమతించారు అయితే కోల్‌బ్లాక్ కేటాయించామనడం సరికాదని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రేమ ఉంటే గోదావరి బెల్ట్ కోల్‌బ్లాక్‌లు సింగరేణికి కేటాయించాలని కోరారు.
ఇలా చేయడం ఇదే తొలసారి : తాడిచెర్ల-2 బొగ్గు గనులను వేలం లేకుండానే సింగరేణి సంస్థకు కేటాయిస్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్మిక సంఘాలు అలాగే సింగరేణి యాజమాన్యం నుంచి విజ్ఞప్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పలుమార్లు చర్చించినట్లు వివరించారు. చివరగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 2020 తర్వాత ప్రభుత్వ రంగ సంస్థకు వేలం లేకుండా బొగ్గు గనులను కేటాయించడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు. సమగ్ర న్యాయపరమైన సలహాలు తీసుకున్న తర్వాతే తాడిచెర్ల-2 గనుల ఫైల్‌పై సంతకం చేసినట్లు ఆయన వివరించారు.
అప్పట్లో ఎలాంటి స్పందనా రాలేదు : గతంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు తాడిచెర్ల-2 గనులను సింగరేణికి కేటాయించాలని కేంద్రానికి లేఖలు రాశారు. అయినా అప్పట్లో కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు, ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కానీ నేడు తమ ప్రభుత్వం ఆ పనిని పూర్తి చేసిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సింగరేణిలో ఉత్పత్తి తగ్గుతోందని ప్రస్తావించారు. ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయన్నారు. వీటితో పాటు అప్పుల భారం కూడా పెరుగుతోందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వేలం ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిలో తాడిచెర్ల-2 బొగ్గు గనులను కేటాయించడం సంతోషకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు.
"కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి నా విజ్ఞప్తి. గోదావరి పరిసర ప్రాంతంలోని కోల్ బ్లాక్లన్నింటినీ వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలి. తెలంగాణపై మీకు ఏమాత్రం ప్రేమ, అభిమానమున్నా దీనిని చేసిపెట్టాలి" - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
ముంచుకొస్తున్న ముప్పు - కొత్త బొగ్గు గనులు వస్తేనే సింగరేణికి మనుగడ
సింగరేణికి గుడ్ న్యూస్ - వేలం లేకుండానే తాడిచెర్ల బొగ్గుగని కేటాయించిన కేంద్రం

