ETV Bharat / state

గ్రామాల్లో వనరులు వాడుకుంటూ పన్నులు కట్టకపోవడమేంటి?: పవన్​

పరిశ్రమలు పన్ను చెల్లించకపోవడంపై పవన్ ఆగ్రహం - పంచాయతీ పన్నులు వసూలైతే రూ.5,400 కోట్లకుపైగా వస్తాయని వెల్లడి - రాజకీయ ఒత్తిళ్లున్నా పన్నుల విషయంలో ముందుకెళ్లాలని అధికారులకు ఆదేశం

DY CM Pawan Review Meet With Panchayat Raj Department officials
DY CM Pawan Review Meet With Panchayat Raj Department officials (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 1, 2026 at 3:28 PM IST

|

Updated : June 1, 2026 at 7:36 PM IST

2 Min Read
Choose ETV Bharat

DY CM Pawan Review Meet With Panchayat Raj Department Officials: పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల పన్నుల వసూళ్లపై అధికారులతో సమీక్షించారు. పరిశ్రమలు, ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి పన్ను వసూళ్లు ఎందుకు సరిగా ఉండటం లేదని అధికారులను అడిగారు. రాజధాని నుంచి ఉన్నతాధికారులతో కలిసి పవన్ నిర్వహించిన సమీక్షలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అధికారులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. తమ ప్రాంతాల్లో పన్ను వసూళ్లు వివరాలను పంచుకున్నారు.

పన్ను చెల్లించకపోవడంపై పవన్ ఆగ్రహం: పరిశ్రమలు పంచాయతీలకు పన్ను చెల్లించకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలు సంపాదించే పరిశ్రమలు పన్నులు చెల్లించకపోతే ఎలాగని అధికారులను ప్రశ్నించారు. గ్రామాల్లో వనరులు వాడుకుంటూ పన్నులు కట్టకపోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆంధ్రా పేపర్ మిల్స్ రూ.19 కోట్లు బకాయిలు పెట్టిందని గుర్తు చేశారు. విద్యాసంస్థలపై కూడా భారీగా పన్ను బకాయిలున్నాయన్నారు. రాష్ట్రంలో పంచాయతీ పన్నులు వసూలైతే రూ.5,400 కోట్లకుపైగా వస్తాయన్నారు.

అధికారులకు దిశానిర్దేశం: పన్నులు చెల్లించని కారణంగా ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు కూడా ఇబ్బందులు తలెత్తాయన్నారు. పేదలు, కులవృత్తులవారు, చిరుద్యోగులు కూడా పన్నులు చెల్లిస్తున్నారన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు పన్నులు కట్టని విషయం ప్రజలకు తెలియదన్నారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా పన్నుల విషయంలో ముందుకెళ్లాలని అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సీఎంతో పాటు మంత్రివర్గంతోనూ మాట్లాడతానని పవన్ అధికారులతో చెప్పారు. పల్స్ సర్వే తరహాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పన్నుల వసూళ్ల కార్యాచరణ చేప్టటాలని అధికార యంత్రాంగానికి ఈ సందర్భంగా పవన్ దిశానిర్దేశం చేశారు.

ఏపీలో పంచాయతీల్లో పన్నులు సక్రమంగా వసూలైతే గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, చెత్త వంటి సమస్యలేవీ ఉండవని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పన్నులు చెల్లించకుండా మొండి బకాయిలు పెట్టిన పరిశ్రమలు, విద్యాసంస్థల పంచాయతీ అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

"కొన్నిచోట్ల పరిశ్రమల యజమానుల నుంచి రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. పంచాయతీలకు వివిధ రకాల పన్నుల ద్వారా రూ. 5,400 కోట్లు వచ్చే అవకాశముంది. సరిగ్గా వసూలు చేస్తే ఎక్కడా ఎలాంటి సమస్యలుండవు. ఇందులో ప్రధానంగా పేదవర్గాల వారు, వివిధ రకాల కులవృత్తులు చేసుకునేవారు, చిరుద్యోగులు కూడా ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నప్పుడు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే పరిశ్రమలు, విద్యాసంస్థలు ఎందుకు చెల్లించడం లేదు. లాభాలు వచ్చే సంస్థలు పన్నులు చెల్లించకపోతే అధికారులెందుకు చర్యలు తీసుకోవటం లేదు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గొద్దు, అవసరమైతే దీనిపై సీఎం చంద్రబాబుతో పాటు మంత్రివర్గంతో మాట్లాడతాను. పన్ను వసూళ్లపై ఫైల్స్ సర్వే మాదిరిగా మూడు రోజులు వరుసగా డ్రైవ్ చేయాలి."-పవన్ కళ్యాణ్, ఉపముఖ్యమంత్రి

"విధి చాలా గొప్పది - విర్రవీగిన వాళ్లకు 11సీట్లతో సమాధానం చెప్పింది"

జనసైనికులు అప్రమత్తంగా ఉండాలి -ఆవేశాలకులోనై ఘర్షణకు తావీయవద్దు: డిప్యూటీ సీఎం పవన్‌

Last Updated : June 1, 2026 at 7:36 PM IST