నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం- నేడు, రేపు ఏపీకి వర్ష సూచన
వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంకలో ట్రింకోమలి, జాఫ్నా మధ్యలో శనివారం మధ్యాహ్నానికి తీరం దాటుతుందని ఐఎండీ అంచనా - తప్పిన తుపాను ముప్పు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 10, 2026 at 12:10 PM IST
Depression in Bay Of Bengal Rain Alert To AP : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. శుక్రవారం ఇది తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం తొలుత అంచనా వేసినా పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదని వాతావరణ నిపుణులు చెప్పారు. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంకలో ట్రింకోమలి, జాఫ్నా మధ్యలో శనివారం మధ్యాహ్నానికి తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షం కురవొచ్చని చెప్పింది. శని, ఆదివారాల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
గంటకు 6 కి.మీ. వేగం : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు ఆగ్నేయంగా 150 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. ఇది శ్రీలంకలోని పోట్స్‌విల్‌కు ఉత్తర ఈశాన్యంగా 180 కి.మీ. దూరంలో , చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 590 కి.మీ. దూరంలో ఉన్నట్లు వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. గడిచిన ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండం గంటకు 6 కి.మీ. వేగంతో కదిలింది. 24 గంటల్లో వాయవ్య దిశగా కదిలి మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. శ్రీలంకలోని ట్రింకోమలీ-జాఫ్నా మధ్య ఈ మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. శని, ఆది వారాల్లో రెండ్రోజులు ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు.
సంక్రాంతి ముంగిట పొంచి ఉన్న వాయు‘గండం’ - పోర్టులకు తుపాను హెచ్చరిక
పొంచి ఉన్న తుపాను : సంక్రాంతి ముంగిట దక్షిణాది రాష్ట్రాలకు వాయు‘గండం’ పొంచి ఉందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ఇది తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో భూమధ్యరేఖ సమీపంలో తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయానికి వాయుగుండంగా బలపడిందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. సాయంత్రానికి ఇది పొట్టువిల్ (శ్రీలంక)కు 570 కిలోమీటర్లు, బట్టికోలా (శ్రీలంక)కు 620 కి.మీ., కరైకల్ (తమిళనాడు)కు 990 కి.మీ., చెన్నైకి 1,140 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. పరిస్థితులు అనుకూలించకపోవడంతో రాష్ట్రానికి తుపాను ప్రమాదం తప్పినట్లు తాజాగా వాతావరణ నిపుణులు తెలిపారు.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం

