ఏపీకి అత్యంత గడ్డుకాలం - ఎల్‌నినోతో సాగుకే కాదు, తాగునీటికీ తిప్పలే!
తాగునీటికీ ఎల్‌నినో గుబులు - జలాశయాలకూ నీటి కొరతే - ఉన్న జలాలను కాపాడుకోవాలని జలవనరుల శాఖ ప్రణాళిక - వచ్చే జూన్ వరకు జాగ్రత్తగా వాడుకోవాలని సూచన

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 20, 2026 at 7:10 AM IST
Impact of El Nino on Water Resources : ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులతో తాగునీటికీ కష్టాలు తప్పేలా లేవని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుబాటులో ఉన్న జలాలను కాపాడునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. జలాశయాలకు ఆశించిన స్థాయిలో ప్రవహాలు రావడం లేదని, ఉన్న నీటిని వచ్చే జూన్ వరకు తాగునీటి అవసరాలకు జాగ్రత్తగా వాడుకోవాలని సూచిస్తున్నారు. గతంలో ఇలాంటి దారుణ పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని విశ్లేషిస్తున్నారు.
తీవ్ర ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర జలవనరులశాఖ 2027 జూన్ నెలాఖరు వరకు తాగునీటి ప్రణాళికకు తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే వర్షాభావంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ ఇంతకుమించిన వర్షాభావం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. జలాశయాలకు అక్టోబరు నెలాఖరు వరకు ఏ మేరకు ప్రవాహాలు వస్తాయో అంచనాలు రూపొందించారు.
తాగునీటి ప్రణాళికకు తొలి ప్రాధాన్యం: ప్రస్తుతం ఉన్న నీరు సాగుకు ఉపయోగించినా సరిపోయేలా లేదు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి జలాశయం కింద 2027 జూన్ నెలాఖరు వరకు తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. రాయలసీమ ఎమ్మెల్యేలతో సైతం సమావేశం ఏర్పాటు చేసి తుంగభద్ర నీటిని భద్రంగా వినియోగించుకోవాల్సిన పరిస్థితులను ప్రభుత్వం వివరించింది. సమీప ఎల్‌నినో సంవత్సరాలను పరిశీలిస్తే ఇంత దారుణ పరిస్థితులు ఎప్పుడూ లేవని అధికారులు విశ్లేషిస్తున్నారు. 2015-16లో 5 శాతం, 2016-17లో 27 శాతం, 2018-19లో 32 శాతం లోటు, 2023-24లో 16 శాతం లోటు వర్షపాతం నమోదయ్యాయని చెబుతున్నారు. 2026లో ఏకంగా 35.5 శాతం లోటు వర్షపాతం అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఒక్క జిల్ల్లాలోనూ సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం లేదంటున్నారు. 14 జిల్లాల్లో తీవ్ర కరవు పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఏపీకి అత్యంత గడ్డుకాలంగా: కృష్ణా నది పరివాహంలో జలాశయాలకు నీటి ప్రవాహం సాధారణం కన్నా తక్కువ ఉంటుందని జలవనరులశాఖ అధికారులు భావిస్తున్నారు. సాధారణ నీటి నిల్వలతో పోలిస్తే ఆలమట్టికి 58 శాతం, నారాయణపూర్‌కు 70 శాతం, ఉజ్జయిని డ్యాంకు 23 శాతం, జూరాలకు 74 శాతం, తుంగభద్రకు 8 శాతం, సుంకేశుల బ్యారేజికి 80 శాతం, శ్రీశైలం ప్రాజెక్టుకు 72 శాతం తక్కువ నీటి నిల్వలు చేరుతాయని అంచనా వేశారు. ఎగువ జలాశయాల్లోని లోటు రాష్ట్రానికి అత్యంత గడ్డుకాలంగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు గోదావరి నదిలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ఆగస్టు నుంచి డిసెంబరు మధ్య 58 శాతం తక్కువ ప్రవాహం ఉంటుందని భావిస్తున్నారు. గోదావరిలో వెయ్యి 71 టీఎంసీలు ఇంకా వచ్చే ఆస్కారం ఉన్నా ఆ నీటిని పట్టిసీమ, పురుషోత్తపట్నం, పుష్కర వంటి ఎత్తిపోతల పథకాలతో తప్ప పెద్దగా వినియోగించుకునే అవకాశం లేదంటున్నారు. పట్టిసీమ నుంచి కృష్ణాకు నీటి మళ్లింపు ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. పోలవరం ఎడమ కాలువ నుంచి ఇచ్చే నీళ్లతో చెరువులు, జలాశయాలు అన్నీ నింపి ఉంచాలని ఆలోచన చేస్తున్నారు. పెన్నా, వంశధార, నాగావళి పరివాహకాల్లోనూ సాధారణం కన్నా తక్కువ ప్రవాహాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
2027 జులై వరకు తాగునీటి కోసం: కృష్ణాపై ఉన్న ఉమ్మడి జలాశయాల నీటిని ప్రస్తుత నీటి సంవత్సరంలో తాగునీటికి మాత్రమే ఉపయోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. శ్రీశైలంలో ఆగస్టు రెండో వారం నాటికి అందుబాటులో ఉన్న నీటి నిల్వల ఆధారంగా రాష్ట్రానికి 115.70 టీఎంసీల నీటి వాటా దక్కుతుందని పేర్కొంది. అక్టోబరు నెలాఖరు వరకు 47 టీఎంసీలు తాగునీటి అవసరాలకు ఇవ్వాలని కోరింది. పోతిరెడ్డిపాడు నుంచి 22 టీఎంసీలు రాయలసీమ జిల్లాలకు, హంద్రీనీవా కింద 11 టీఎంసీలు, సాగర్ కుడి కాలువ కింద 7 టీఎంసీలు, ఎడమ కాలువ కింద ఏపీకి ఒక టీఎంసీ, కృష్ణా డెల్టాకు 6 టీఎంసీలు అవసరమని పేర్కొంది. తుంగభద్ర కింద సైతం హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీల్లో 2027 జులై వరకు తాగునీటి కోసం 16 టీఎంసీలు నిల్వ చేసుకోవాల్సి ఉంది. ఈ కాలువల కింద ఇప్పటికే సాగు చేసిన ఆరుతడి పంటలకు జాగ్రత్తగా నీళ్లు ఇస్తూ ఇక పంటలు సాగు చేయకుండా చూస్తూ అత్యంత కట్టుదిట్టమైన పర్యవేక్షణతో వినియోగించాలని నిర్ణయించారు.
రాయలసీమకు కష్టకాలమే - ఈనెలంతా వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అంచనా
ఎల్‌నినో ప్రభావంతో నష్టాల బాటలో నర్సరీలు - భారీగా పెరిగిన ఖర్చులు, పడిపోతున్న విక్రయాలు

