తెలంగాణ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు - రాబోయే మూడ్రోజుల పాటు ఇదే తీరు
కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గిందన్న వాతావరణ కేంద్రం - నాలుగు నుంచి ఐదు డిగ్రీల మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వెల్లడి - తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమ గాలులు

Published : January 1, 2026 at 6:21 PM IST
|Updated : January 1, 2026 at 8:30 PM IST
Latest Telangana Weather Updates : తెలంగాణ రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నుంచి ఐదు డిగ్రీల మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగినట్లు తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమ గాలులు ప్రవేశించడం వల్ల దట్టమైన పొగమంచు కమ్మేస్తోందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ రావు వెల్లడించారు. రాబోయే రెండు నుంచి మూడు రోజుల పాటు చలి ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. నాలుగో రోజు నుంచి ఉత్తర గాలులు ప్రారంభమై తెలంగాణలోని ఉత్తర, మధ్య జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుదంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
శీతాకాలంలో సాధారణంగా భూమి రిరేడియేటింగ్ క్రియేట్ చేస్తుంటుందని, అలాగే ఇటీవల మేఘాలు లేకుండా ఉండటం, గాలిలో తేమలేకపోవడం వల్ల చలి ఎక్కువగా ఉందని వాతావరణ అధికారి శ్రీనివాస్ రావు చెప్పారు. దీనికి తోడు ఉత్తర రాష్ట్రాల నుంచి చలి ఉండటం వల్ల డిసెంబరు నెల మొత్తం చాలా తక్కవ ఉష్ణోగ్రతల్లో ఉండటం జరిగిందన్నారు. గత రెండు రోజుల నుంచి కూడా ఈ గాలుల ప్యాటెర్న్ మారిందన్న ఆయన ఉత్తర, ఈశాన్య దిశల నుంచి కాకుండా ప్రస్తుతం తూర్పు, ఆగ్నేయం నుంచి ఈ గాలులు ప్రవేశిస్తున్నాయని తెలిపారు.
తీవ్ర స్థాయిలో పొగమంచు : తూర్పు, ఆగ్నేయం గాలుల వల్ల తేమ ప్రవేశించడం జరుగుతుందని, తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ తేమ ప్రవేశించడం వల్ల సాచురేషన్ అంటే వంద శాతానికి చేరుకోవడంతో ఉదయం పొగమంచు తీవ్ర స్థాయిలో ఉంటుందని వాతావరణ అధికారి తెలిపారు. ఇది భూమి నుంచి తక్కువ ఎత్తులో ఏర్పడుతుందని, తేమ వంద శాతం ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపారు. మనం రాష్ట్రంలో ఈరోజు చూసినట్లయితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీలు పెరిగాయని అన్నారు. ఇదే సమయంలో తేమ కూడా చేరడంతో రాష్ట్రవ్యాప్తంగా పొగమంచు కూడా ఎక్కువగా వ్యాపించిందని చెప్పారు.
శంషాబాద్లో 50 మీటర్ల ఎత్తు వరకు మంచు : ఈ పొగమంచు ప్రభావం అనేది ఎక్కువగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలో ఉందన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ రావు మనం సాధారణంగా చూస్తే తేమ శాతం శీతాకాలంలో చాలా తక్కువగా ఉంటుందన్నారు. ఈరోజు శంషాబాద్లో 50 మీటర్ల ఎత్తు వరకు పొగమంచు కురవడం జరిగింది. ఇది తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమై 8 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. మనకు నగర ప్రాంతాల్లో ఈ పొగమంచుకు కాలుష్యం తోడైనట్లయితే అంటే పరిశ్రమలు, వాహనాలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఆరుబయట తిరిగితే శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు సంభవిస్తాయని అన్నారు. తెల్లవారు సమయాల్లో పొగమంచు కారణంగా రోడ్డుప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందని దాని కారణంగా వృద్ధులు, పిల్లలు బయటకు రాకపోవడమే ఉత్తమమని తెలిపారు.
"ఈరోజు కనిష్ఠ ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో 11.2 డిగ్రీలుగా నమోదైంది. ఈరోజు ఎక్కడా కూడా సింగిల్ డిజిట్ నంబర్ ఉష్ణోగ్రతలు లేవు. సిటీలో అయితే పరీక్షించిన దాని ప్రకారం 18 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలైన పటాన్చెరు, రాజేంద్రనగర్ వంటి వాటిలో తక్కువగా 8,7 డిగ్రీలు చూశాం. ఈరోజు అయితే అక్కడా 12, 13 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉంది" -శ్రీనివాస్ రావు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి
తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఈరోజు అంతటా 4 నుంచి 5 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయని, ఉష్ణోగ్రతలు పెరగటం మూలంగా ఇప్పుడు మనం ఇంచుమించు సాధారణ స్థితికి చేరుకున్నట్లు తెలిపారు. రాబోయే రెండు నుంచి మూడు రోజుల పాటు ఈ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉండే అవకాశం ఉందన్నారు. నాలుగు రోజుల అనంతరం గాలుల స్థితి మారి ఉత్తర గాలులు స్టార్ట్ అవుతాయని, దీని కారణంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలో టెంపరేచర్ తగ్గే అవకాశం కూడా కనబడుతోందని పేర్కొన్నారు.
పొగ మంచు వచ్చేస్తోంది - వాహనదారులూ ప్రయాణాల సమయంలో జర జాగ్రత్త!
సరిలేరు మీకెవ్వరు : చలి వణికిస్తున్నా, మంచు కప్పేస్తున్నా తొణకరు, బెణకరు

