650 ఇళ్ల కూల్చివేత - 2 వేల కుటుంబాలు రోడ్డు పాలు : భూదాన్ భూముల్లో ఎవరిని కదిపినా కన్నీళ్లే
వర్ణణాతీతంగా మారిన భూదాన్ భూముల నిర్వాసితుల పరిస్థితి - నిలువనీడ లేకుండా పోయిందని కన్నీటి పర్యంతం - కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇళ్లు నిర్మించుకున్నామన్న బాధితులు - నోటీసులు ఇవ్వకుండా నేలమట్టం చేశారని ఆవేదన

Published : February 26, 2026 at 10:39 AM IST
Demolished 650 Houses on Bhoodan Lands : వారంతా నిలువ నీడ లేని నిరుపేదలు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడిన సొమ్మంతా మధ్యవర్తుల్ని నమ్మి ధారపోసి ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే వారు ఇచ్చినవి నకిలీ పట్టాలని తెలియక సంబురపడ్డారు. ఇళ్లు కట్టుకున్నవి భూదాన్ భూములని, ఖాళీ చేయాలని అధికారులు హుకుం జారీ చేశారు. దీంతో కళ్లముందే నివాసాలను కూలగొడుతుంటే తల్లడిల్లిపోయారు.
భూదాన్ భూముల్లో ఇళ్లు కట్టుకున్నారని : ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో 100 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న బాధితుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. భూదాన్ భూముల్లో ఎవరికీ ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదంటూ మంగళవారం మొదలుపెట్టిన ఇళ్ల కూల్చివేతలు, రెండోరోజూ కొనసాగడంతో బాధితులు రోడ్డున పడ్డారు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్మంతా చెల్లించి రేకుల షెడ్లు, చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకుంటే వారి కళ్ల ముందే అధికారులు వారి నివాసాలను నేలమట్టం చేశారు. కష్టపడి కట్టుకున్న కలల సౌధాలు కళ్ల ముందే కూలిపోతుంటే తల్లడిల్లిపోయారు. బరువెక్కిన గుండెలతో ఇంటి సామాన్లు తీసుకుని రోడ్డునపడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు దాదాపు 600లకు పైగా కుటుంబాలు తీరని వేదనతో ఉబికివస్తున్న కన్నీరుతో అక్కడి నుంచి బయటకు వచ్చారు. చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నచందంగా చెల్లాచెదురయ్యారు.
ఖాళీ చేయండమ్మా అని కనీసం చెప్పాలి కదా. ఏదీ లేకుండా వచ్చేసారు. వెంటవెంటనే పడేశారు. గిన్నెలు కాదు కదా, కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా చేశారు. మా పిల్లల ముఖం కూడా చూడరా? దానిలోనే మమ్మల్ని కూడా పూడ్చిపెట్టేయొచ్చు కదా. మాకు ఏదీ లేకుండా చేశారు. అక్కడ ఇక్కడ అప్పులు చేసి, పుస్తేల తాడు కూడా అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం. కష్టం చేసి బతుకుతున్నాం. - బాధితురాలు
ప్రభుత్వమే దారి చూపాలి : రెండు రోజుల్లో మొత్తం 650 ఇళ్లు కూల్చివేయడంతో దాదాపు 2 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వీరందరికీ ప్రభుత్వం ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవన్, టీటీడీసీలో పునరావాసం కల్పించింది. పునరావాస కేంద్రాల్లో ఎటుచూసినా దయనీయ దృశ్యాలే కనిపించాయి. ఎవరిని కదిలించినా ఉబికి వస్తున్న కన్నీటితో బాధితులంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము కేవలం 100 గజాల్లో గూడు కట్టుకుని ఉంటుంటే, నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టారని కన్నీరుమున్నీరయ్యారు. తాము డబ్బు పెట్టి స్థలం కొనుక్కుని, ఇళ్లు నిర్మించుకున్నామని చెబుతున్నారు. తమకు భూదాన్ యజ్ఞసమితి పట్టాలు ఇచ్చిందని, ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వ అధికారులు వచ్చి ఉన్న ఫలంగా ఖాళీ చేయించి ఇళ్లు కూల్చేశారని బోరుమని విలపించారు. ప్రభుత్వమే తమకు దారి చూపించాలని వేడుకుంటున్నారు.
నీళ్లు లేక పిల్లలు కళ్లు తిరిగి ఎన్నిసార్లు కిందబడ్డారో. అసలు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో మాకైతే తెలియట్లేదు. ఎవర్ని నమ్మాలి. ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదండి. పిల్లలకు తిండి లేదు. 9 సంత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. - బాధితురాలు
రోడ్డుపై బైఠాయించి నిరసన : తమకు నిలువ నీడ లేకుండా చేశారంటూ భూదాన్ ఇళ్ల బాధితులు రెండోరోజూ ఆందోళనలు చేపట్టారు. దీంతో ఖమ్మం నగరంలోని పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమకు న్యాయం చేయాలంటూ బాధితులంతా వందలాదిగా పునరావాస కేంద్రాల నుంచి బయటకు వచ్చి ఆందోళనలకు దిగారు. టీటీడీసీ ఎదుట, ఖమ్మం ఇల్లెందు క్రాస్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, బాధితులకు మధ్య తోపులాట జరిగింది. భూదాన్ బాధితులను పరామర్శించి వారికి మద్దతు తెలిపేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ ఖమ్మం రానున్నారు. వెలుగుమట్లలోని ఇళ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించి, బాధితులతో మాట్లాడనున్నారు.
మేము ఇక్కడికి వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయింది. నిన్న సాయంత్రం వచ్చి కూల్చివేశారు. మేం అయోమయంలో పడిపోయాం. ఏం చేయాలో అర్థం కాలేదు. మేము సామాన్లు కూడా సర్దలేదు. వాళ్లే వచ్చి సామాన్లు సర్ది, వాళ్లే మమ్మల్ని ఇక్కడ దించారు. మాకు ఇప్పుడు ఏం లేదు. మేము రోడ్డు మీదైనా కూర్చుంటాం కానీ మా ఇళ్లకు, మాకు ఎక్కడైనా జాగా చూపించాలి. - బాధితురాలు
ప్రభుత్వ భూమిని తిరిగి సర్కారుకే అప్పగించి - డబ్బులు కాజేసి!

