ETV Bharat / state

కిల్లర్ ప్రియాంక వారి కుటుంబ కథాచిత్రమ్‌! - పిల్లల విక్రయాల సొమ్ముతో విలాస జీవితం

పిల్లల విక్రయాల ద్వారా వచ్చే సొమ్మే దిల్లీ ముఠా కీలక సూత్రధారి ప్రియాంక కుటుంబానికి ఆదాయం - ఆ డబ్బుతో విలాస జీవితం - ప్రియాంక కుటుంబం అందరిపై దిల్లీలో కేసులు

Infant Trafficking Racket in AP
Infant Trafficking Racket in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 9, 2026 at 10:56 AM IST

3 Min Read
Choose ETV Bharat

Infant Trafficking Racket in AP : పిల్లల విక్రయాల ద్వారా వచ్చే సొమ్మే ఆ కుటుంబానికి ఆదాయం. ఆ డబ్బుతోనే విలాస జీవితం గడుపుతారు. కాలు బయటపెడితే కారు ఉండాల్సిందే. కీలక నిందితురాలు బాయ్‌ఫ్రెండ్స్‌నూ మార్చేస్తుందని దర్యాప్తులో తేలింది. ఇలా ఒకరు, ఇద్దరు కాదు యావత్‌ కుటుంబంలో అందరూ విక్రయాల కేసుల్లో నిందితులే. ఒకరు మినహా అందరూ ప్రస్తుతం జైళ్లలోనే ఉన్నారు. ఇదీ శిశు అమ్మకాల కేసులో దిల్లీ ముఠా కీలక సూత్రధారి ప్రియాంక కుటుంబ నేపథ్యం. ప్రియాంకను అదుపులోకి తీసుకునేందుకు విజయవాడ నుంచి దిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం ఆమె మూలాలు తెలుసుకుని వెళ్లే సరికే త్రుటిలో తప్పించుకుని పరారైంది. నిందితురాలిని పట్టుకునేందుకు నగరం నుంచి మరో బృందం కూడా వెళ్లనుంది.

పిల్లల్ని తీసుకుని వివిధ ప్రాంతాల్లో విక్రయాలు : ప్రియాంకకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఆమె దిల్లీతోపాటు యూపీలోని మీరట్‌లోనూ నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. దిల్లీ సబర్బన్, యూపీలోని శివారు గ్రామాల నుంచి పిల్లల్ని తీసుకుని వివిధ ప్రాంతాల్లోని ముఠాలకు విక్రయిస్తుంది. ఈమెపై దిల్లీలోని పశ్చిమ విహార పోలీసు స్టేషన్, హరియాణాలోని ఫరీదాబాద్‌ స్టేషన్లతోపాటు విజయవాడలో మూడు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇది ఒక ఎత్తైతే ప్రియాంక తల్లి, సోదరి, తమ్ముడిపై దిల్లీలోని బేగంపూర్‌ స్టేషన్‌లో పిల్లల విక్రయాల కేసులు నమోదయ్యాయి. అక్కడి పోలీసులు వీరిని అరెస్టు చేశారు. తల్లి దేవకి, సోదరి ప్రియ దిల్లీలోని మందాలి జైలులో, సోదరుడు పీయూష్‌ తీహార్‌ కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారు.

కాలు బయటపెడితే కారు ఉండాల్సిందే : ఈ కేసులో దిల్లీకి చెందిన కిరణ్‌శర్మ అరెస్టు అయినప్పటి నుంచి ప్రియాంక తప్పించుకు తిరుగుతోంది. దిల్లీలో ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులకు అక్కడి నుంచి మకాం మీరట్‌కు మార్చినట్లు గుర్తించారు. ఆపై మీరట్‌ వెళ్లేసరికి గంట ముందు ఆమె, భర్త బయటకు వెళ్లిపోయినట్లు తేలింది. దీంతో ఇంట్లో ఉన్న ఆమె అత్తమామలకు నోటీసులు ఇచ్చారు. నిందితురాలు మీరట్‌ నుంచి ఉత్తరాఖండ్‌ పారిపోయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అక్కడ బృందానికితోడు మరొకటి విజయవాడ నుంచి పంపనున్నట్లు తెలిసింది. పిల్లల అమ్మకాలతో వచ్చే ఆదాయంతో ప్రియాంక విలాస జీవితం గడుపుతోంది. కాలు బయటపెడితే కారు ఉండాల్సిందే. బాయ్‌ఫ్రెండ్స్‌నూ మార్చేస్తుందని దర్యాప్తులో తేలింది. నిందితురాలి బ్యాంకు ఖాతాలు, లావాదేవీలను విశ్లేషిస్తున్నారు.

కవిత తరఫున నూరి కొరియర్‌గా : ముంబయి ముఠా కింగ్‌పిన్‌ అయిన కవిత సహాయకురాలు నూరి ఆచూకీని పోలీసులు గుర్తించారు. ముంబయి శివారు థానేలో ఉన్నట్లు తేలింది. ఈమెను కూడా ఒకట్రెండు రోజుల్లో అదుపులోకి తీసుకునే వీలుంది. ఈమె రెండుసార్లు పిల్లల్ని తీసుకుని విజయవాడ వచ్చి సరోజినికి అప్పగించింది. కవిత తరఫున నూరి కొరియర్‌గా వ్యవహరించినట్లు తేలింది. ముంబయిలో అరెస్టు అయిన కవితను గురువారం విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి రిమాండ్‌ విధించారు.

Children Kidnap Gang Arrest in Vijayawada: మరోవైపు పిల్లలను విక్రయిస్తున్న మరో ముఠాలో ప్రధాన నిందితురాలు బలగం సరోజినీతోపాటు మరో నలుగురి పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఆరుగురు పిల్లలను రక్షించామని విజయవాడ సీపీ రాజశేఖర్‌ బాబు తెలిపారు. పిల్లలను దిల్లీ నుంచి రూ.లక్ష రూపాయలకు కొని రూ.5 లక్షలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది మార్చి 1న విజయవాడలో ఈ ముఠాను అరెస్టు చేయగా ఇప్పటివరకు పిల్లల విక్రయం కేసులో 10 మందిని అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. సరోజినీతో పాటు షేక్‌ ఫరీనా అనే వ్యక్తి ముఠాలో ఉన్నట్లు ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు సీపీ తెలిపారు.

ముంబై నుంచి ముగ్గురు వ్యక్తుల ద్వారా లక్ష రూపాయలకు సరోజిని కొని ఇక్కడ అమ్ముతోందని తెలిపారు. ఆరుగురు శిశువులను విక్రయించిన క్రమంలో పోలీసులు చాకచక్యంగా ముఠాలోని సభ్యులను పట్టుకున్నారు. పిల్లలను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు జరిపారు. ఆరుగురు చిన్నారులను అక్రమార్కుల చేతుల్లో నుంచి క్షేమంగా కాపాడారు. ఈ ముఠాపై మొత్తం 3 కేసులు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు.

ఏడాదిన్నరలో చేతులు మారిన 28 మంది పిల్లలు - ఉత్తరాది నుంచి తెచ్చి బెజవాడలో విక్రయం!

'బలగం' సరోజిని మాయ, పసికందుల బేరసారం - అమ్మ పిలుపు కోసం తపించిన దంపతులకు శోకం