ETV Bharat / state

ఏపీపై ద్రోణి ఎఫెక్ట్ - రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు!

ద్రోణి ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ -రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం -నేడు వేలేరుపాడులో 8.6 సె.మీ వర్షపాతం నమోదు

Heavy Rains Likely In Several Districts Tomorrow
Heavy Rains Likely In Several Districts Tomorrow (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 27, 2026 at 10:30 PM IST

2 Min Read
Choose ETV Bharat

Heavy Rains Likely in Several Districts Tomorrow : రాష్ట్ర తీరప్రాంతం నుంచి మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణకోస్తా తీరప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించింది. వీటి ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గాలులుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రేపు(ఆదివారం) శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని మిగతా 20 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు(శనివారం) అత్యధికంగా ఏలూరు జిల్లా వేలేరుపాడులో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఏలూరు జిల్లా వేలేరుపాడులో 86.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముదినేపల్లిలో 83.6, మండవల్లిలో 67.4 , పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో 74 , తాడేపల్లిగూడెంలో 60.6 , తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో 60.4 ,కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో 60.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు.

లోతట్టు ప్రాంతాలు జలమయం : కృష్ణాజిల్లా పామర్రులో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. వర్షం ప్రభావానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. తహసీల్దార్‌ కార్యాలయం గదుల్లోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపై నీరు చేరడంతో ప్రజల రాకపోకలుకు అంతరాయం ఏర్పడింది. రాజమహేంద్రవరంలో ఏకధాటిగా వాన కురవడంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. గండేపల్లి, తొండంగి, తాళ్లరేవులోనూ వర్షం పడుతోంది. వరుణుడు కరుణించడంతో పంటల సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు.

మచిలీపట్నంలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షంతో పల్లపుప్రాంతాలు జలమయ్యాయి. వర్షానికి పూర్తిగా ప్రధాన రోడ్లు నీట మునిగాయి. మోకాలు లోతు వర్షపు నీటిలోనే ప్రజలు ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆర్టీసీ బస్టాండ్ జలదిగ్బంధమైంది. కోనేరుసెంటర్ చెరువును తలపిస్తుంది. వర్షపునీరు తొలగించే ప్రయత్నాల్లో మున్సిపల్ సిబ్బంది నిమగ్నమయ్యారు.

అధికారుల హెచ్చరిక : వర్షం కురిసే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్‌ సమీపంలో ఉండవద్దని అధికారులు హెచ్చరించారు. విద్యుత్ వైర్లు తెగిపడి కనిపిస్తే వాటికి దూరంగా ఉండి వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో అవసరమైతేనే బయటకు వెళ్లాలని, వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

అంతేకాకుండా వర్షాలు, పిడుగుల నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పిడుగులు పడే సమయంలో పొలాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, చెట్ల కింద ఆశ్రయం పొందకూడదని హెచ్చరించారు. పశువులను కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉంచకుండా వాటికి రక్షణ కల్పించాలని సూచించారు.

ప్రజల అండతో కొండనైనా ఢీకొడ్తాం - సేవ చేసేందుకే కూటమి ఏర్పాటు: సీఎం చంద్రబాబు

దశాబ్దం గడిచినా అసంపూర్తిగా బైపాస్ - ట్రాఫిక్​తో ఉక్కిరిబిక్కిరవుతున్న కాకినాడ ప్రజలు