ETV Bharat / state

బంగాళాఖాతంలో తీరం దాటిన వాయుగుండం - ఆ జిల్లాలకు వర్ష సూచన

కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడి - దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

Cyclone in the Bay of Bengal Rain Alert to AP
Cyclone in the Bay of Bengal Rain Alert to AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 11, 2026 at 2:41 PM IST

3 Min Read
Choose ETV Bharat

Cyclone in Bay of Bengal and Rain Alert to AP: బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలోని తీవ్ర వాయుగుండం నిన్న (శనివారం) వాయుగుండంగా బలహీనపడింది. సాయంత్రం శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టివుకు సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. శనివారం సాయంత్రానికి ముల్లయిట్టివుకు 30 కిలోమీటర్లు, జాఫ్నా (శ్రీలంక)కు 70 కి.మీ, మన్నార్‌ (శ్రీలంక)కు 90 కి.మీ, కరైకల్‌ (పుదుచ్చేరి)కి 190 కి.మీ, చెన్నైకు 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఆదివారం ఉదయంలోగా తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆదివారం తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం(నేడు) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇదిలా ఉండగా మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. శుక్రవారం ఇది తుపానుగా బలపడుతుందని ఐఎండీ తొలుత అంచనా వేసినా పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదని వాతావరణ నిపుణులు చెప్పారు. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంకలో ట్రింకోమలి, జాఫ్నా మధ్యలో శనివారం మధ్యాహ్నానికి తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది.

దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురవొచ్చని చెప్పింది. శని, ఆదివారాల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

దక్షిణ కోస్తా, రాయలసీమకు వర్ష సూచన: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు ఆగ్నేయంగా 150 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. ఇది శ్రీలంకలోని పోట్స్‌విల్‌కు ఉత్తర ఈశాన్యంగా 180 కి.మీ. దూరంలో, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 590 కి.మీ. దూరంలో ఉన్నట్లు వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు.

గడిచిన 6 గంటల్లో తీవ్ర వాయుగుండం గంటకు 6 కి.మీ. వేగంతో కదిలింది. 24 గంటల్లో వాయవ్య దిశగా కదిలి మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. శ్రీలంకలోని ట్రింకోమలీ-జాఫ్నా మధ్య ఈ మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. శని, ఆది వారాల్లో 2 రోజులు ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు.

సంక్రాంతి ముంగిట దక్షిణాది రాష్ట్రాలకు వాయుగండం పొంచి ఉందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ఇది తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో భూమధ్యరేఖ సమీపంలో తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయానికి వాయుగుండంగా బలపడిందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. సాయంత్రానికి ఇది పొట్టువిల్‌ (శ్రీలంక)కు 570 కిలోమీటర్లు, బట్టికోలా (శ్రీలంక)కు 620 కి.మీ., కరైకల్‌ (తమిళనాడు)కు 990 కి.మీ., చెన్నైకి 1,140 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. పరిస్థితులు అనుకూలించకపోవడంతో రాష్ట్రానికి తుపాను ప్రమాదం తప్పినట్లు తాజాగా వాతావరణ నిపుణులు తెలిపారు.

రెయిన్ అలర్ట్ : బలపడిన వాయుగుండం - నేడు తుపానుగా మారే అవకాశం

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం- నేడు, రేపు ఏపీకి వర్ష సూచన