సంక్రాంతి ముంగిట పొంచి ఉన్న వాయు‘గండం’ - పోర్టులకు తుపాను హెచ్చరిక
నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య తీవ్ర వాయుగుండం- రేపు తమిళనాడు, కేరళకు భారీ వర్ష సూచనలు, ఆరెంజ్ అలెర్ట్ జారీ- ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్ష సూచనలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 11:05 AM IST
Depression Over Southeast Bay of Bengal : నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య తీవ్ర వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. ఇది శ్రీలంకలోని పోట్స్‌విల్‌కు తూర్పు ఆగ్నేయంగా 420 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. హాంబన్‌టోటాకు తూర్పు ఆగ్నేయంగా 470 కి.మీ. దూరంలో, త్రికోమలికి ఆగ్నేయంగా 570 కిలోమీటర్ల దూరంలో ఉండగా, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 1,020 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ తీవ్రవాయుగుండం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. ఇదే వేగంతో 36 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
శ్రీలంకలోని హాంబన్‌టోటా-కల్ మున్నాయ్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రేపు తమిళనాడు, కేరళకు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. రేపు ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు.
Cyclone Alert to Andhra Pradesh on Before Sankranti : సంక్రాంతి ముంగిట దక్షిణాది రాష్ట్రాలకు వాయు‘గండం’ పొంచి ఉందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ఇది తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో భూమధ్యరేఖ సమీపంలో తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయానికి వాయుగుండంగా బలపడిందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. సాయంత్రానికి ఇది పొట్టువిల్ (శ్రీలంక)కు 570 కిలోమీటర్లు, బట్టికోలా (శ్రీలంక)కు 620 కి.మీ., కరైకల్ (తమిళనాడు)కు 990 కి.మీ., చెన్నైకి 1,140 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
రాష్ట్రానికి వర్ష సూచన : గురువారానికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. తర్వాత 48 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతుందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో శుక్ర, శని, ఆదివారాల్లో శ్రీలంక, తమిళనాడులో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా. శని, ఆదివారాల్లో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వాయుగుండం నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు తుపాను హెచ్చరికల కేంద్రం ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేసింది.
రెండు తీవ్ర తుపాన్లు, ఆరు తుపాన్లు, 12 వాయుగుండాలు : సాధారణంగా డిసెంబరు 31 నాటికి ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగుస్తుంది. వాతావరణ శాస్త్రం ప్రకారం బంగాళాఖాతంలో మిగిలిన నెలలతో పోలిస్తే జనవరి, ఫిబ్రవరిల్లో వాయుగుండాలు, తుపాన్లు చాలా తక్కువగా ఏర్పడతాయి. 1891-2024 మధ్యలో రెండు తీవ్ర తుపాన్లు, ఆరు తుపాన్లు, 12 వాయుగుండాలు ఏర్పడ్డాయి. వాటిలో అధిక శాతం శ్రీలంకలోనే తీరం దాటాయి. మూడు వాయుగుండాలు మినహా మిగిలినవన్నీ సంక్రాంతికి ముందే ఏర్పడటం గమనార్హం. వాటిలో ఒక తుపాను మాత్రమే ఏపీలో తీరం దాటింది.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం

