ETV Bharat / state

లోన్​ల కోసం మీ గుర్తింపు కార్డులు ఇస్తున్నారా? - ఇన్​కమ్​ ట్యాక్స్​ నోటీసులు వస్తాయి జాగ్రత్త!

ప్రజలను మోసగిస్తూ వ్యక్తిగత వివరాల చౌర్యానికి పాల్పడుతున్న దళారులు - ప్రజల గుర్తింపు కార్డులతో సొమ్ము చేసుకుంటున్న నేరగాళ్లు - వివరాల ఆధారంగా బ్యాంకు ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు

Cyber Crime Precautions Telugu
Cyber Crime Precautions Telugu (geyyt images)
author img

By ETV Bharat Telangana Team

Published : February 27, 2026 at 1:24 PM IST

3 Min Read
Choose ETV Bharat

Cyber Crime Precautions Telugu : తెలుగు రాష్ట్రాల్లో సామాన్య ప్రజలను మోసగిస్తూ, వ్యక్తిగత వివరాల చౌర్యానికి పాల్పడుతున్న దళారులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. దీంతో ఆర్థిక నేరస్థులు, సైబర్ నేరగాళ్లు తేలికగా డబ్బులు సంపాదించునేలా సహకరిస్తున్నారు. దీనికోసం ఆధార్, పాన్​, ఓటరు వంటి గుర్తింపు కార్డులను ప్రజల నుంచి కాజేసి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో అనేక మంది సామాన్యులు ఎలాంటి వ్యాపారాలు చేయకున్నా, వారికి ఆదాయపు పన్ను చెల్లించాలంటూ నోటీసులు అందుతున్నాయి. వారి బ్యాంకు ఖాతాల్లోకి అక్రమంగా నగదు జమ అవుతున్నట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించి కేసులు నమోదు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోకున్నా, రుణాలు తిరిగి చెల్లించాలంటూ నోటీసులు అందుతున్న పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

బ్యాంకు నోటీసులు రావడంతో : హైదరాబాద్​కు చెందిన ఓ వ్యాపారి తనకు రుణం కావాలని బ్యాంకులో దరఖాస్తు చేయాలనుకున్నారు. దీనికోసం ఆయన ఓ ఏజెంట్​ను ఆశ్రయించారు. తన వ్యక్తిగత వివరాలను అతడికి అందించారు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకున్నప్పటికీ తనకు సిబిల్​ స్కోర్​ తక్కువగా ఉండటంతో రుణం మంజూరు కాలేదని ఆ ఏజెంట్​ వ్యాపారికి తెలియజేశాడు. అయితే మూడు నెలలు గడిచాక ఆ వ్యాపారికి బ్యాంకు నుంచి ఓ నోటీసు వచ్చింది. దానిలో రుణానికి సంబంధించిన వాయిదా చెల్లించడం లేదని ఉంది. దీంతో ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆయన బ్యాంకుకు వెళ్లి కనుక్కోగా, తన పేరు మీద రూ.5 లక్షల వ్యక్తిగత రుణం మంజూరైనట్లు అధికారులు తెలిపారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించి దగ్గరిలోని పోలీస్ స్టేషన్​లో కంప్లైంట్ చేశారు.

అసలేం జరుగుతోందంటే? : విశ్రాంత ఉద్యోగులు, చిరు వ్యాపారులు, అడ్డా కూలీలు, గృహిణులు, ఆటో డ్రైవర్లు వంటి వారి ఆర్థిక అవసరాలను గుర్తించి దళారులు రంగంలోనికి దిగుతున్నారు. ప్రభుత్వ పథకాలను వినియోగించి వ్యక్తిగత రుణాలు మంజూరు చేయిస్తాం అని ప్రజలను నమ్మిస్తున్నారు. వారి నుంచి ఆధార్​, పాన్​ వంటి ఐడీ కార్డులను, ఫొటోలను, వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. వారి పేరు మీద సిమ్​కార్డులు తీసుకుంటున్నారు. ఈ కొత్త నంబర్లను వినియోగించి బ్యాంకు ఖాతాలను ప్రారంభిస్తున్నారు. బ్యాంకు నుంచి రుణం మంజూరయ్యేంత వరకు తాము ఈ ఖాతాను వినియోగించుకుంటాం అంటూ బాధితులను నమ్మిస్తున్నారు. దీనికి ప్రతిఫలంగా ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అందజేస్తామని ఆశ చూపుతున్నారు. తర్వాత దీనికి సంబంధించిన సిమ్​కార్డును, బ్యాంకు ఖాతా పుస్తకాన్ని, డెబిట్​, క్రెడిక్​ కార్డులను విదేశాల్లోని సైబర్​ నేరగాళ్లకు చేరవేస్తున్నారు.

కమీషన్ల ఆశ చూపి : ఇలా మోసాలకు పాల్పడేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా ఏజెంట్లను నియమించుకుంటున్నారు. ప్రతి బ్యాంకు ఖాతాకు రూ.20 వేలు ఇస్తామంటూ ఏజెంట్లు తమ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారికి కమీషన్ల ఆశ చూపించి వారితో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. ఈ ఖాతాదారుల ఆధార్​, పాన్​కార్డుల ఆధారంగా అప్పటికప్పుడు నకిలీ కంపెనీలను సృష్టిస్తున్నారు. వారికి తెలియకుండానే కంపెనీ అధ్యక్షులుగా, డైరెక్టర్లుగా నియమిస్తున్నారు. దీంతో నగదు లావాదేవీలకు సంబంధించిన కేసులు నమోదైనా లేదా నోటీసులు వచ్చినా బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

బాధితుల పేర్లతో నకిలీ సంస్థలు : మరికొందరు వ్యాపారులు పన్నులు ఎగ్గొట్టి ఇన్​పుట్​ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సబ్సిడీలను పొందడానికి అడ్డదారులను వెతుకుతున్నారు. దీనిలో భాగంగా అవసరాల్లో ఉన్న సామాన్య ప్రజలకు ఆర్థిక సహాయం అందిస్తామని ఆశ చూపుతున్నారు. దీనికోసం లబ్ధి పొందాలంటే ఆధార్​, పాన్, ఓటరు కార్డులు అవసరమంటున్నారు. వారి పేర్లతో నకిలీ సంస్థలను అప్పటికప్పుడే సృష్టిస్తున్నారు. వీటికి జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. ఆ టిన్​ నంబర్లను వాడుకుని రూ.కోట్లలో వ్యాపారం జరిగినట్లు నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారు. దర్జాగా పన్నులు ఎగవేస్తున్నారు.

"అపరిచితులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు. పాన్​ కార్డు, ఆధార్​ కార్డలను ఎవరికీ ఇవ్వవద్దు. పాన్​ కార్డుతో బ్యాంకు రుణాలు, జీఎస్టీ నంబరును ఎవరైనా తీసుకున్నట్లు సందేహం వస్తే దీనికి సంబంధించిన అధికారులను ఆశ్రయించాలి. నగదు దుర్వినియోగం, మోసం జరిగినట్లు గుర్తిస్తే ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి." - శివమారుతి, ఏసీపీ, నగర సైబర్​క్రైమ్​

బ్యాంకు మేనేజర్​నే బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు! - రూ.1.44 కోట్లు స్వాహా

మ్యూల్​ ఖాతాల గుర్తింపునకు 'ఆపరేషన్​ క్రాక్​డౌన్'​