సిమ్ కార్డులతోనూ సైబర్ నేరాలు: ఈ యాప్‌తో చెక్ పెట్టొచ్చు
ఒక వ్యక్తి ఆధార్‌కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో 'సంచార్ సాథీ' యాప్‌లో వివరాలు - నమ్మకమైన ఏజెంట్ వద్దనే సిమ్ కొనుగోలు చేయాలి

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 11:41 AM IST
Cybercrimes Using SIM Cards: రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కొందరు సిమ్ కార్డులతోనూ మోసాలకు పాల్పడుతున్నారు. ఒక వ్యక్తికి తెలియకుండానే ఆ వ్యక్తి పేరిట సిమ్ కార్డులు సృష్టిస్తున్నారు. ఎప్పుడో కొనుగోలు చేసి వాడకుండా వదిలేసిన వాటితోనూ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అమాయకులు తెలియకుండానే ఉచ్చులో చిక్కుకుంటున్నారు. అందుకే ఒక ఆధార్ కార్డుపై ఆ వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో సులువుగా తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 'సంచార్ సాథీ' యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా సైబర్ మోసాలకు చెక్ పెట్టొచ్చు.
కంపెనీ అధికారిక కేంద్రంలోనే కొనాలి: కొత్త సిమ్ కార్డు తీసుకునేందుకు దుకాణానికి వెళ్లినప్పుడు వినియోగదారుల నుంచి ఆధార్ కార్డు, వేలిముద్రలు తీసుకుంటారు. ఈ సమయంలోనే నేరగాళ్లు నమోదు ప్రక్రియలో రెండుసార్లు క్లిక్ చేయడంతో రెండు సిమ్ కార్డులకు ఆమోదించినట్లు అవుతోంది. వినియోగదారుడు తాను అడిగిన ఒక సిమ్‌కార్డు మాత్రమే తీసుకుంటారు. రెండోది పక్కదారి పడుతోంది. అందుకే నమ్మకమైన ఏజెంట్ వద్దనే సిమ్ కొనుగోలు చేయాలని బీఎస్‌ఎన్‌ఎల్ ఎస్‌డీఈ నేతాజీ తెలిపారు. కంపెనీ సంస్థ అధికారిక కేంద్రంలో కొనుగోలు చేయడం శ్రేయస్కరమని పేర్కొన్నారు.
మన ఆధార్ కార్డ్ పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నయో తెలుసుకోవాలంటే సంచార్ సాథీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో సిటిజన్ సెంట్రిక్ సేవలకు సంబంధించిన ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో 'నో మొబైల్ కనెక్షన్ ఇన్ యువర్ నేమ్'పై క్లిక్ చేయాలి. అక్కడ పది అంకెల చరవాణి దిగువ క్యాప్చా నమోదు చేసి, సబ్మిట్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆపై ఆ వ్యక్తి పేరుపై ఉన్న సిమ్ కార్డుల నంబర్లు కనిపిస్తాయి. వాటిలో నంబర్లు ఎంపిక చేస్తే, నాట్ మై నంబర్, రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో ఒకటి ఎంచుకుని ఫిర్యాదు చేయొచ్చు.
సంచార్ సాథీలో ఈ సేవలు కూడా
సీఈఐఆర్: మీ ఫోన్ పోయినా లేదా అపహరణకు గురైనా, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) ద్వారా వెంటనే దాన్ని బ్లాక్ చేసి పనిచేయకుండా చేయవచ్చు. అంతే కాదు మీ ఫోన్ తిరిగి దొరికితే, దానిని అన్‌బ్లాక్ చేసుకుని వాడుకోవచ్చు. ఇందుకోసం ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఐఎంఈఐ, ఇతర వివరాలు ఇచ్చి సంచార్ సాథీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బాధితులు పోగొట్టుకున్న దాదాపు 15,43,666 ఫోన్లను బ్లాక్ చేశారు. వాటిల్లో 8,47,140 ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించారు.
సైబర్ నేరగాళ్లకు చెక్: నేడు సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్లు లింక్‌ల ద్వారా మాల్‌వేర్లు పంపించడం, బ్యాంకు అధికారుల ముసుగులో ఫోన్ చేయడం, ఓటీపీ తెలుసుకుని పలు నేరాలకు పాల్పడుతున్నటువంటి సంఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. వీటన్నింటికీ మూలం మొబైల్ ఫోన్స్, సిమ్‌కార్డులే అని స్పష్టం అవుతోంది. సంచార్ సాథీ యాప్‌లో సైబర్ నేరాల గురించి అవగాహన కూడా పెంచుకోవచ్చు. నేరగాళ్ల ఉచ్చు నుంచి తప్పించుకునేందుకు అవసరమైన మెలకువల్ని నేర్చుకోవచ్చు.
చక్షులో కూడా ఫిర్యాదు: సైబర్ నేరగాళ్లు - కాల్స్, ఎస్‌ఎంఎస్, వాట్సప్‌ల ద్వారా మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తిస్తే, వెంటనే 'చక్షు' పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకు ఖాతా, పేమెంట్ వ్యాలెట్, సిమ్, గ్యాస్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, కేవైసీ అప్‌డేట్, ఎక్స్‌పైరీ, డీయాక్టివేషన్, ఇంపర్సనేషన్ (ప్రభుత్వ అధికారుల ముసుగులో మోసానికి పాల్పడటం), సెక్స్‌టార్షన్ లాంటి మోసాల గురించి చక్షులో ఫిర్యాదు చేయవచ్చు.
ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ల్లో సంచార్ సాథీ యాప్ అందుబాటులో ఉంది వాటి లింక్స్
www.sancharsathi.gov.in లేదా https://tafcop.sancharsathi.gov.in
పీపీపీ విధానంతో నష్టం లేదు - వైద్య విద్య వ్యవస్థలో మార్పులు తప్పనిసరి :ఎన్‌ఎంసీ ఛైర్మన్
రాజధానిలో భూసమీకరణ ప్రక్రియకు శ్రీకారం - అభివృద్ధిపై స్పష్టత కోరుతున్న రైతులు

