ETV Bharat / state

17 శాఖలు, 250 అద్దె ఖాతాలు - అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన ఐ4సీ

విజయవాడ నగరంలో కలకలం రేపుతోన్న అద్దె ఖాతాలు - దాదాపు 250 ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్లు తేల్చిన ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌

Cybercrime Agency identified Mule Accounts
Cybercrime Agency identified Mule Accounts (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 15, 2026 at 2:16 PM IST

2 Min Read
Choose ETV Bharat

Cybercrime Agency identified Mule Accounts in Vijayawada: విజయవాడలో ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల్లో భారీగా అద్దె ఖాతాలున్నట్లు ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌(ఐ4సీ) గుర్తించింది. సైబర్‌ నేరాలను నియంత్రించే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఈ ఏజెన్సీ మొత్తం 17 శాఖల్లో దాదాపు 250 ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్లు తేల్చింది.

ప్రస్తుతం ఈ ఖాతాలను స్తంభింపజేసింది. అనంతరం ఈ వివరాలను ఎన్టీఆర్‌ జిల్లా కమిషనరేట్‌కు అందజేసింది. ఐ4సీ గుర్తించినవే కాకుండా ఇలాంటి ఖాతాలు చాలా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పలు బ్యాంకులు వివిధ సేవలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాయి. సంబంధిత ఏజెన్సీకి చెందిన సిబ్బంది బ్యాంకుల్లో చక్రం తిప్పుతున్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున అద్దె ఖాతాలు తెరవగలుగుతున్నారు. ఇటీవల కేసు నమోదు చేసిన కేసులో నాలుగవ నిందితుడైన దుర్గాప్రసాద్‌ సైతం ప్రైవేటు ఏజెన్సీ ద్వారా బ్యాంకులో విధులను నిర్వహిస్తున్నాడు.

పెద్ద ఎత్తున అద్దె ఖాతాలు: నిందితుడు విచ్చలవిడిగా ఎటువంటి అర్హత లేని వారితో ఖాతాలను తెరిపిస్తున్నప్పటికీ బ్యాంకు అధికారులు అనుమతిస్తున్నారు. మ్యూల్‌ అకౌంట్లు అదే విధంగా అనుమానాస్పద లావాదేవీలపై తరచూ బ్యాంకర్లతో పోలీసులు సమావేశాలను నిర్వహిస్తున్నా సరే పలు బ్యాంకు శాఖలు వీటిపై ఏ మాత్రం పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. ఈ కేసులో ఫిబ్రవరి 6వ తేదీన దుర్గాప్రసాద్‌ ఓ బ్యాంకులో ఖాతాను తెరిపించారు.

దీనిపై సైబర్​క్రైమ్​ పోలీసులు శనివారం సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ శాఖ ఆ బ్యాంకు మేనేజర్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ తరహా ఖాతాలపై అప్రమత్తంగా ఉండాలంటూ సూచించినా పట్టించుకోకుండా ఖాతాలను తెరుస్తున్నారని నోటీసులో అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి పాత్రపై అనుమానాలు సైతం ఉన్నాయని, దీనిపై వివరణ ఇవ్వాలని తాఖీదులో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే పటమట మరో బ్యాంకు మేనేజర్‌కు తాఖీదులను ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ బ్రాంచ్​ మేనేజర్‌కు సోమవారం నోటీసులను ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఫోన్‌పే బదిలీలు: ఈ కేసులో తాజాగా అరెస్టైన నిందితుడు శివ దుర్గాప్రసాద్‌కు ప్రధాన నిందితుడు రవికుమార్‌ నుంచి యూపీఐ లావాదేవీలను ఎక్కువగా జరిగినట్లు గుర్తించారు. పొదుపు, కరెంట్‌ ఖాతాలను తెరిచేందుకు వీలుగా డిపాజిట్ల కోసం ఫోన్‌పే ద్వారా బదిలీలను చేసినట్లు తేలింది. ఖాతాలను తెరిపించడం, వీటి ద్వారా లావాదేవీల పర్యవేక్షణలన్నీ రవికుమార్‌ చేసేవాడు. అదే విధంగా అతని సోదరుడు ఏ 2 స్టీవెన్‌ కార్యాలయంలో ఉండి చెన్నైలో ఉన్న సూత్రధారికి నగదు బదిలీలు, ఓటీపీల ద్వారా వివరాలను పంపించేవాడు.

అనంతరం ఖాతాలు తెరిచినందుకు కమీషన్లు కూడా యూపీఐ ద్వారా జమయ్యేవి. దుర్గాప్రసాద్‌పై గతంలో సైతం పెనమలూరు పోలీసు స్టేషన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ కేసు నమోదైంది. అనంతరం నిందితుడైన దుర్గాప్రసాద్​ను శనివారం కోర్టులో న్యాయాధికారి ఎదుట ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్‌ విధించడంతో పోలీసులు కారాగారానికి తరలించారు.

బ్యాంక్​ అద్దె ఖాతాల నేరాలు - అత్యాశకు పోయి జైలుకు

అద్దె ఖాతాలతో మోసాలు - స్నేహితులతో జట్టుకట్టిన సూర్య