ETV Bharat / state

వ్యాపారులకు టోకరా వేసిన సైబర్ ముఠా - రూ.32 లక్షలు మాయం

భారీగా లాభాలంటూ ఆన్​లైన్​లో వ్యాపార ప్రకటనలు - నమ్మించి నిలువుదోపిడీ చేస్తున్న సైబరాసురులు

CYBER FRAUD IN NTR AND KRISHNA DISTRICTS
CYBER FRAUD IN NTR AND KRISHNA DISTRICTS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 25, 2025 at 12:06 PM IST

3 Min Read
Choose ETV Bharat

Cyber Fraud IN Ntr And Krishna : ప్రస్తుతం ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందో, అంతకన్నా ఎక్కువే దుర్వినియోగమవుతోందని చెప్పవచ్చు. ఎందుకంటే సులభంగా డబ్బును సంపాదించాలన్న అత్యాశతో ఎంతోమంది ఎదుటి వారి బలహీనతలను, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా అలా అని కాకుండా కొంతమంది సైబర్​ మోసాలతో రెచ్చిపోతున్నారు. తాజాగా ఎన్టీఆర్​, కృష్ణా జిల్లాలో అమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ ముఠాలు మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకొచ్చింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వక్రదారి పట్టిస్తూ, సెకండ్‌ హ్యాండ్‌ యంత్రాలు అమ్ముతామంటూ తాజాగా ఇద్దరు వ్యాపారుల నుంచి రూ.32 లక్షలు కొట్టేశారు.

సామాజిక మాధ్యమాలే ఆయుధాలుగా! : సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, టెలిగ్రామ్‌, ఫేస్‌బుక్​లను సైబర్‌ నేరగాళ్లు తమ ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. అమాయకులకు వల వేసి, వారిని మభ్యపెట్టి రూ.లక్షలు గుంజేస్తున్నారు. ఎవరూ ఊహించని రీతిలో రోజుకో రకంగా టోకరా వేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యాపారం, పెట్టుబడుల పేరుతో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరు ఆశతో మోసపోతున్నారు.

సెకండ్‌ హ్యాండ్‌ యంత్రాలు అమ్ముతామంటూ! : రామవరప్పాడులో ఓ వ్యాపారి రసాయనాలను విక్రయిస్తుంటారు. అక్టోబరు 17న ఫేస్‌బుక్‌లో సెకండ్‌ హ్యాండ్‌ యంత్ర సామగ్రి అమ్ముతామంటూ వచ్చిన ఒక ప్రకటన చూశారు. దానిలో ఉన్న నంబరుకు కాల్​ చేసి సంప్రదించారు. దాదాపు రూ.12లక్షల విలువైన యంత్ర సామగ్రిని కొనేందుకు ఆసక్తి చూపారు. సంప్రదింపులు తర్వాత అక్టోబరు 23న ప్రకటనకు సంబంధించిన వ్యక్తులు చెప్పిన బ్యాంకు ఖాతాకు మొత్తం డబ్బులు పంపారు. తర్వాత మోసపోయినట్లు గుర్తించి విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల 21న ఫిర్యాదు చేశారు. వ్యాపారి పంపిన డబ్బులు నవీ ముంబయి జుహూనగర్‌ ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాకు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు.

షేర్స్‌, స్టాక్స్‌లో పెట్టుబడులంటూ : విద్యాధరపురానికి చెందిన ఓ ఫర్నిచర్‌ వ్యాపారి సెప్టెంబరు 19న ఫేస్‌బుక్‌లో షేర్‌ మార్కెట్‌పై వచ్చిన ఒక ప్రకటన చూశారు. ఆసక్తితో దానిని క్లిక్‌ చేయగానే ‘ఆనంద్‌రాఠి షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్‌ లిమిటెడ్‌’ అనే వాట్సాప్‌ గ్రూప్‌నకు అనుసంధానమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి ఎవరో లైనులోకి వచ్చాడు. తక్కువ పెట్టుబడులకు ఎక్కువ లాభాలంటూ అతను ఆశ చూపించాడు. ఆ వ్యాపారి చేత ఫోన్లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించాడు. అతని మాటలు నమ్మిన ఆ వ్యాపారి, ఆరు బ్యాంకు ఖాతాలకు దాదాపు రూ.23లక్షలు పంపించారు. తర్వాత అవతలి వారి నుంచి స్పందన లేకపోవడం, లాభాలను తీసుకునేందుకు ప్రయత్నించినా వీలు కాకపోవడంతో మోసపోయినట్లు వ్యాపారి గుర్తించారు. దీనిపై ఈ నెల 19న సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆ డబ్బులు బ్యాంకు ఆఫ్‌ బరోడా ఝార్ఖండ్, తెలంగాణ, విశాఖపట్నం, అసోం, ఒడిశా శాఖలకు, మహారాష్ట్రలోని యాక్సిస్‌ బ్యాంకు శాఖకు వెళ్లినట్లు గుర్తించారు.

సాంకేతికత వృద్ధి ప్రజల జీవన విధానాలను మెరుగుపరుస్తున్నా, దాన్ని చెడు దారిలో వాడుతున్న ముఠాలు ఎంతో మంది సాధారణ ప్రజలకు నష్టం కలిగిస్తున్నాయి. పోలీసులు తరచూ వీటిపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. అవగాహనే రక్షణ అని పెద్దలు చెప్పిన మాట ఇక్కడ మరింత స్పష్టంగా తెలుస్తోంది.

ఏం చేయాలంటే! :

  • సైబర్‌ నేరాల కట్టడికి కేంద్రం ఇండియన్‌ సైబర్‌ క్రైం కో ఆర్డినేషన్‌ సెంటర్‌ ప్రారంభించారు. దీనిలో బ్యాంకులు, దర్యాప్తు సంస్థలు, వివిధ ఆర్థిక సంస్థలను భాగస్వాములను చేశారు.
  • బాధితులు ఫిర్యాదు చేసేందుకు 1930 టోల్‌ఫ్రీ నంబర్​కి ఫోన్‌ చేసి మోసం వివరాలు చెప్పొచ్చు. సైబర్‌ క్రైం వెబ్‌సైట్‌లో ఫిర్యాదును పూర్తి చేయొచ్చు.
  • బాధితుల యూపీఐ, బ్యాంకు ఖాతా నంబరు, ఫోన్‌ నంబరుతోపాటు సైబర్‌ నేరగాళ్లు వినియోగించిన ఫోన్‌ నంబరు, బ్యాంకు ఖాతా నంబరు, యూపీఐ ఐడీ వంటి వివరాలు ఇవ్వాలి.
  • టోల్‌ఫ్రీ నంబరు, వెబ్‌సైట్‌కు వచ్చిన వివరాలను స్థానిక పోలీసుస్టేషన్లకు పంపిస్తారు. అక్కడ నుంచి జిల్లా పోలీసు కార్యాలయాల్లో ఉండే సైబర్‌ సెల్‌ దానిని పర్యవేక్షిస్తుంది.

మాటలతో భయపెట్టి కాపాడుతామని భరోసానిస్తారు - వారి వలలో పడితే అంతే!

కాంబోడియాలో శిక్షణ - తెలుగు రాష్ట్రాల్లో వల విసురుతున్న సైబర్ నేరగాళ్లు