ETV Bharat / state

రూ. 49 లక్షలు స్వాహా - చిలక్కి చెప్పినట్లు చెప్పినా వినలేదు!

పోలీసుల మాట వినకుండా సైబరాసురుల ఉచ్చులో పడిన స్టీల్‌ ప్లాంట్‌ విశ్రాంత ఉద్యోగి - డిజిటల్‌ అరెస్టని భయపెట్టడంతో రూ.49 లక్షలు బదిలీ చేసిన విశ్రాంత ఉద్యోగి

Cyber Frauds to Retired Employees in AP
Cyber Frauds to Retired Employees in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 21, 2026 at 10:06 AM IST

3 Min Read
Choose ETV Bharat

Cyber Frauds to Retired Employees in AP : కళ్లముందు నిత్యం ఎన్నో మోసాలు, డిజిటల్ అరెస్టులు, వందల సంఖ్యలో సైబర్ నేరాల గురించిన వార్తలను ప్రతిరోజు చూస్తున్నాం. సైబర్ నేరస్థుల వలలో పడి కోట్లు పోగొట్టుకున్న అమాయకపు ప్రజలు ఎందరో ఉన్నారు. అప్రమత్తతపై ఎప్పటికప్పుడు అధికారులు హెచ్చరిస్తున్నా, సరే తగిన సూచనలను ఇస్తున్నా, అత్యాశతో బాధితులు ఈ నేర ఉచ్చులో పడుతున్నారు. ఇలాంటి ఘటనే విజయవాడలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే?

డిజిటల్ అరెస్టు అనే పదమే ఎక్కడా లేదు. ఆ పేరుతో వచ్చే కాల్స్​కు స్పందించవద్దని పోలీసులు ఆ రిటైర్డ్ ఉద్యోగికి చిలక్కి చెప్పినట్లు చెప్పారు. రూ.72.50 లక్షలు బదిలీ చేసేందుకు బ్యాంకుకు వచ్చిన అతణ్ని వెనక్కి పంపించారు. ఎవరైనా ఇబ్బంది పెడితే తమను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. 15 రోజుల్లో మళ్లీ సైబర్ నేరగాళ్ల నుంచి అతనికి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో మోసగాళ్లకు రూ.49 లక్షలు బదిలీ చేశారు ఆ విశ్రాంత ఉద్యోగి.

విజయవాడలో స్థిరపడిన స్టీల్ ప్లాంట్ విశ్రాంత ఉద్యోగికి గత నెలాఖరులో ఈడీ నుంచి ఫోన్​ చేస్తున్నామంటూ ఓ కాల్ వచ్చింది. మీ పై కేసులు ఉన్నాయని బెదిరించారు. యూనిఫాంలో వీడియో కాల్ చేసిన వ్యక్తి రూ.72.50 లక్షలు ఇవ్వాలని, అలా చేస్తే మీ కేసు మాఫీ చేస్తానని అన్నాడు.

దీంతో రిటైర్డ్ ఉద్యోగి విజయవాడ రామచంద్రనగర్​లోని ఎస్​బీఐ బ్రాంచికి వెళ్లారు. తన పేరిట ఉన్న రూ.78 లక్షల ఫిక్స్​డ్ డిపాజిట్లను రద్దు చేసుకున్నారు. అందులో నుంచి రూ.72.50 లక్షలను మరో అకౌంట్​కు బదిలీ చేయాలని కోరారు. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఖాతా నంబరు పరిశీలిస్తే అది కోల్‌కతాకు చెందినదని తేలింది.

అవగాహన కల్పించిన వినలేదు : దీంతో పోలీసులు ఆ లావాదేవీ నిలివేశారు. డిజిటల్ అరెస్టు మోసాలపై అవగాహన కల్పించారు. తర్వాత మళ్లీ బ్యాంకుకు వచ్చిన విశ్రాంత ఉద్యోగి బెంగళూరుకు మారిపోతున్నాము అంటూ ఎఫ్​డీ క్లోజ్ చేశారు. ఆ మొత్తాన్ని తన పొదుపు అకౌంట్​లోకి బదిలీ చేయించుకున్నారు.

అనంతరం ఇండియన్ బ్యాంకులో అకౌంట్ తెరిచారు. అక్కడి నుంచి మోసగాళ్ల ఖాతాకు రూ.49 లక్షలు బదిలీ చేశారు ఆ విశ్రాంత ఉద్యోగి. ఆ సమయంలో బ్యాంకు సిబ్బంది అతన్ని ప్రశ్నించారు. ఆయన తెలిసిన వ్యక్తికే పంపిస్తున్నామని చెప్పారు. తీరిగ్గా 4 రోజుల తర్వాత పోలీసులను ఆశ్రయించారు. తనకు మళ్లీ అదే ఫోన్ కాల్ వచ్చిందనీ, మోసగాళ్లు బెదిరించడంతో బదిలీ చేశానని ఆయన పోలీసులకు చెప్పారు. తాను పోగొట్టుకున్న సొమ్మును తిరిగి ఇప్పించాలని అర్థించారు.

ఇదిలా ఉండగా మరోవైపు సైబర్ నేరాల పట్ల ఉన్న అవగాహనతో ఓ వృద్ధ జంట చాకచక్యంగా బయటపడ్డారు. పోలీసులు కల్పిస్తున్న అవగాహనతో సైబర్ నేరస్థులకు చెక్‌ పెట్టారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో సైబర్ నేరస్థుల నుంచి ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయిన వృద్ధులను లక్ష్యంగా చేసుకొని కోట్లు కొల్లగొడుతున్న డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరం నుండి కృష్ణా జిల్లా ఉయ్యూరు టౌన్ పోలీసులు ఇద్దరు వృద్ధులను కాపాడారు.

డిజిటల్ అరెస్ట్ అనే పదం కానీ పద్ధతి గాని ఎక్కడా లేదని ముంబై క్రైమ్ బ్రాంచ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కస్టమ్స్, సీబీఐల నుండి మాట్లాడుతున్నాం మీ ఆధార్ కార్డు సిమ్ కార్డులు మనీ ల్యాండరింగ్​లో ఇరుక్కున్నాయి లేదంటే డ్రగ్స్ రవాణాలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, అని ఎవరైనా బెదిరిస్తే వెంటనే స్థానిక పోలీస్ వారికి గాని, 1930 గాని రిపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలియజేశారు.

ఒక్కో ఖాతాకు రూ. 13 వేలు - కమీషన్‌ ఆశ చూపించిన రాజస్థాన్‌ ముఠా

విశ్రాంత ఉద్యోగులే టార్గెట్ - మనీలాండరింగ్ జరిగిందని మోసగించే ప్రయత్నం