విశ్రాంత ఉద్యోగికి టోకరా - మోసగాళ్లను పట్టించిన సెల్ఫోన్
పెట్టుబడుల పేరుతో భారీ మోసాలకు తెగబడిన ఇద్దరు నిందితులు - ఏళ్లగ విశ్రాంతి ఉద్యోగి దగ్గర నుంచి రూ. 20 లక్షల పైనే లూఠీ - నేరగాళ్లను పట్టించిన సెల్ఫోన్

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 2, 2026 at 11:48 AM IST
Cyber Crime Investment Cheating : పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా, అధిక లాభాలు వస్తాయనే ఆశ చూపి సైబర్ నేరగాళ్లు ఇలాంటి మోసాలకు తెగబడుతున్నారు. పెట్టుబడుల పేరుతో లోయ ప్రకాశరావు అనే విశ్రాంత రైల్వే ఉద్యోగిని రూ. 20 లక్షల మేర మోసం చేసిన నిందితులు గౌతమ్, మంజునాథ్ అనే ఇద్దరు బెంగళూరు వాసులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
నాలుగున్నర ఏళ్ల ఉచ్చులో విశ్రాంత ఉద్యోగి: విశ్రాంత ఉద్యోగికి టోకరా వేసి అతని నుంచి నాలుగున్నర ఏళ్లుగా డబ్బులు కాజేస్తూనే ఉన్నారు. అవి చాలవన్నట్లు ఇంకా డబ్బులు కావాలనడంతో మోసపోయినట్లు గుర్తించి గత నెల 19న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులు ఉపయోగించిన ఫోన్ నంబరుపై నిఘా వేయటంతో అసలు గుట్టు బయటపడింది.
మోసగాళ్లను పట్టించిన ఫోన్: లోయ ప్రకాశరావు రైల్వేలో పని చేసి 13 ఏళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. 2022 జనవరిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆన్‌లైన్‌లో మ్యూచువల్ ఫండ్స్ గురించి వెతికారు. వెంటనే బెంగళూరుకు చెందిన గౌతమ్, మంజునాథ్‌లు ఇతనికి మారుపేర్లతో ఫోన్ చేశారు. వీరిద్దరూ గతంలో ట్రేడింగ్ బిజినెస్ నిర్వహించే సంస్థలో పని చేసి మానేశారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో మ్యూచువల్ ఫండ్స్ గురించి ప్రకాశరావు వెతగగానే అతని వివరాలు వీరికి వచ్చాయి. దీంతో నయా దోపిడీకి తెరలేపారు. ఆ ఫోన్ నంబరును కేవలం విశ్రాంత ఉద్యోగితో మాట్లాడేందుకు మాత్రమే నిందితులు ఉపయోగించారు. ఇదే వీరిని సులభంగా పోలీసులకు పట్టించింది.
మ్యూల్ ఖాతాలతో మోసం: సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ నంబరు CDR రిపోర్టును పరిశీలించారు. ఆ నంబరు బెంగళూరుది కావడంతో సీపీ ఎస్.వి. రాజశేఖరబాబు ఒక బృందాన్ని బెంగళూరుకు పంపించారు. అదే సమయంలో ప్రకాశరావు నగదు పంపిన బ్యాంకు ఖాతాల వివరాలు కూడా సేకరించారు. అవి అనంతపురం, బెంగళూరుకు చెందినవి కావడంతో మరో బృందం వాటిపై దృష్టి పెట్టింది. ఇద్దరు వ్యక్తులు తమ ఖాతాలను అద్దెకు ఇచ్చినట్లు గుర్తించారు. వారి ఖాతాల నుంచి డబ్బులు వెళ్లిన వారి వివరాలను సేకరించగా అసలు నిందితులు గౌతమ్, మంజునాథ్‌లు పోలీసులకు దొరికిపోయారు.
డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు అంగీకారం: ప్రకాశరావు వయస్సు 71 ఏళ్లుగా గుర్తించిన గౌతమ్, మంజునాథ్‌లు అతనికి పలు ఆశలు చూపి పెట్టుబడులు పెట్టించారు. ఆదాయం చూపించి వాటిని తీసుకోవాలంటే రకరకాల రుసుముల పేర్లు చెప్పి వసూలు చేశారు. పాత లాభాలు రావాలంటే రుసుములు కట్టాల్సిందే అని బెదిరించి భయపెట్టారు. ఇలా రూ. 23 లక్షల వరకు గుంజేసారు. ఎంత డబ్బులు పోగొట్టుకున్నాడో తెలియని స్థితిలో రూ. 20 లక్షలు పోయినట్లు ఫిర్యాదు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 7.5 లక్షల నగదు వసూలు చేశారు. మరో రూ. 15 లక్షలు తిరిగి ఇచ్చేందుకు నిందితులు అంగీకరించారు. బ్యాంకు ఖాతాలు అద్దెకు ఇచ్చిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఫోన్ పోతే ఆ 15 నిమిషాలు చాలా కీలకం - జాగ్రత్తలు పాటిస్తే వ్యక్తిగత సమాచారం సేఫ్
ప్రజలకు సులభంగా అర్ధమయ్యేలా - సైబర్ నేరాలపై 'ఖాకీ స్టూడియో' యానిమేటెడ్ వీడియోలు

