రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తాం : నూతన డీజీపీ సీవీ ఆనంద్
నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ - డీజీపీ ఆఫీసులో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు - రాష్ట్రంలో శాంతి భద్రతల నియంత్రణకు అహర్నిషలు కృషి చేస్తానని వెల్లడి

Published : May 1, 2026 at 10:54 AM IST
|Updated : May 1, 2026 at 2:38 PM IST
CV Anand takes charge as Telangana DGP : రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కొత్త టెక్నాలజీని మరింతగా వాడుకుంటూ సమర్థంగా పని చేస్తామన్నారు. ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరేలా కృషి చేస్తామని చెప్పారు. నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతల్లో సమస్య రాకముందే అప్రమత్తంగా ఉండటం మంచిదని అన్నారు.
నేరాల దర్యాప్తులో తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఉత్తమ పనితీరు కనబరిచారని ఆయన తెలిపారు. మారుతున్న పరిస్థితుల్లానే నేరాలు జరిగే తీరులోనూ మార్పులు వస్తున్నాయన్నారు. నేరగాళ్లు కొత్త కొత్త టెక్నాలజీని వాడుతూ, మోసాలకు పాల్పడుతున్నారన్నారు. వారు అనుసరిస్తున్న టెక్నాలజీ పోలీసులకు కూడా సవాలు విసురుతుందని చెప్పారు.
"నేరాల దర్యాప్తులో తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఉత్తమ పని తీరు కనబరిచారు. మారుతున్న పరిస్థితుల్లానే నేరాలు జరగుతున్న తీరు కూడా మారింది. నేరగాళ్లు సైతం కొత్త సాంకేతికతను వాడుతూ నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. ఇది పోలీసులకు సవాల్‌గా మారింది. శాంతి భద్రతల సమస్య రాకముందే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నికేసులు పెట్టినా మాదక ద్రవ్యాల ముఠాలు కూడా విస్తరిస్తున్నాయి. డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ టీం ఎంతో కృషి చేస్తోంది"- సీవీ ఆనంద్, తెలంగాణ డీజీపీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చివరి దశకు చేరుకుంది : ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చివరి దశకు చేరుకుందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఆ కేసును ప్రస్తుతం సిట్ విచారిస్తుందన్నారు. గతంలో హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడే ఆ కేసు గురించి తనకు తెలుసని ఆయన వివరించారు. త్వరలో ఫోన్ ట్యాపింగ్ కేసును సమీక్షించి తుది ఛార్జిషీట్ ఫైల్ చేస్తామని సీవీ ఆనంద్ తెలిపారు.
అంతకు ముందు కుటుంబ సభ్యులతో కలిసి డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సీవీ ఆనంద్‌కు పోలీసుశాఖ ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
కీలక విభాగాల్లో సేవలు : 1991 ఐపీఎస్ బ్యాచ్‌నకు చెందిన సీవీ ఆనంద్ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఇటీవలే పదోన్నతి పొందారు. హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్‌గా(డీజీపీగా) ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన పోలీస్ శాఖలోని పలు కీలక విభాగాల్లో సేవలందించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా రెండు విడతల్లో పనిచేశారు. ఇంతవరకు డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి పదవీకాలం గురువారంతో ముగియడంతో సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం నూతన పోలీస్ బాస్‌గా నియమించింది.
ఇటీవలే యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) డీజీపీ పోస్టుకు అర్హులైన ఐపీఎస్ అధికారుల జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో సీవీ ఆనంద్‌తో పాటు 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యమిశ్రా ఉన్నారు. ఈ ముగ్గురిలో అత్యంత సీనియర్ అయిన సీవీ ఆనంద్‌ను డీజీపీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
చిన్ననాటి నుంచే క్రమశిక్షణకు మారుపేరుగా : నూతన డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్ సమీపంలోని కుంట్లూరు గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన బాల్యం నుంచే ఎంతో క్రమశిక్షణగా పెరిగారు. తండ్రి దామోదర్ రెడ్డి ప్రభుత్వ అధికారి కావడంతో పరిపాలనపై చిన్ననాటి నుంచే అవగాహన ఏర్పడింది. ప్రముఖ స్కూళ్లలో ఒకటైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. నిజాం కాలేజీలో డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ విద్యను పూర్తి చేశారు. అనంతరం 1991లో సివిల్స్ పరీక్ష రాసి ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు.
పోలీసింగ్‌లో ఎన్నో మార్పులకు ఆధ్యుడు : సీవీ ఆనంద్ తన కెరీర్ ప్రారంభంలోనే 10 సంవత్సరాల పాటు వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించడం ఆయనలోని పోరాట పటిమను చాటింది. ప్రాణాలకు తెగించి మరీ కీలక ఆపరేషన్లను లీడ్ చేసినందుకుగాను ఆయనకు 2002లోనే ప్రెసిడెంట్ గ్యాలెంటరీ మెడల్ అందుకున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ విభాగాల్లో ఆయన ప్రవేశపెట్టిన పలు కీలక మార్పులు నేటికీ ఆదర్శంగా ఉన్నాయి.
నగరంలోని రోడ్లపై ప్రమాదాలను తగ్గించేందుకు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను పెంచి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను వాడుకుంటూ ఈ-చలాన్, స్పీడ్ గన్ వ్యవస్థలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. సైబరాబాద్ కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో షీ టీమ్స్, షీ షటిల్స్ తదితర వినూత్న కార్యక్రమాలతో ఐటీ కారిడార్‌లో మహిళలకు భరోసానిచ్చారు. ఎండలో విధులు నిర్వహించే కానిస్టేబుళ్లకు సన్ గ్లాసెస్ పంపిణీ చేయడమే కాకుండా అనేక కీలక సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచారు.
తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం - ఉత్తర్వులు జారీ
తెలంగాణ పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

