గిరిపుత్రుల భవిష్యత్‌కు భరోసా - 60 రోజుల పాటు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణ
సీఎంఎస్ లాబొరేటరీ సహాయంతో ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణనిస్తోన్న సీఆర్‌పీఎఫ్ 198 బెటాలియన్ - డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా శిక్షణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 18, 2026 at 3:38 PM IST
Skill Development Training to Tribal Youth : వారంతా అడవిబిడ్డలు. పల్లె తప్పా పట్నం ఊసే ఎరుగనివారు. డిగ్రీలు పూర్తి చేసినా ఉద్యోగాలు ఎలా సాధించాలో తెలీదు. అందుకోసం ఏ కోర్సులు చదవాలి, ఇంటర్వ్యూలలో ఎలా మాట్లాడాలి వంటి వాటిపై అవగాహన లేదు. అలాంటి గిరిపుత్రులకు భవిష్యత్‌కు భరోసానిస్తూ సీఎంఎస్ లాబొరేటరీ సహాయంతో 60 రోజుల పాటు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణనిస్తోంది సీఆర్‌పీఎఫ్ 198 బెటాలియన్.
గిరిజన ప్రాంతాల్లోనే పుట్టి పెరిగి, బాహ్య ప్రపంచంతో పెద్దగా పరిచయం లేని గిరి పుత్రుల జీవితాల్లో CRPF 198 బెటాలియన్ కొత్త వెలుగులు నింపుతోంది. చదువుకోవాలనే ఆశ ఉన్నా, ఆర్థిక పరిస్థితులు సహకరించక మధ్యలోనే చదువు ఆపేసిన యువతకు అండగా నిలుస్తోంది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
చదువుకోవాలని ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల కొందరు, ఉద్యోగాలు ఎలా సాధించాలో అవగాహన లేక మరికొందరు నిరుద్యోగులుగా మారుతున్నారు. అరకు, పాడేరు వంటి వెనుకబడిన ప్రాంత యువతలో ఆత్మవిశ్వాసం నింపడంతోపాటు ఆర్థికంగా నిలదొక్కుకునేలా శిక్షణ ఇస్తోంది. ప్రతి ఏటా 45 యువతీ యువకులను ఎంచుకొని పలు అంశాలపై సీఎంఎస్ లాబొరేటరీ సహకారంతో శిక్షణ ఇస్తోంది సీఆర్‌పీఎఫ్ 198 బెటాలియన్.
వివిధ అంశాలపై తర్ఫీదు : ఈ 60 రోజుల శిక్షణలో భాగంగా వీరికి డేటా ఎంట్రీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ,రెజ్యూమ్ బిల్డ్ చేయడం, దుస్తులు, ఆహార శైలి వంటి అంశాలపై తర్ఫీదు ఇస్తున్నారు. యువతీ యువకులకు వేర్వేరుగా ఉచిత వసతితో పాటు భోజన సౌకర్యం కల్పిస్తూ అనేక విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. మొదటి సారి ఊరు వదిలి సిటీకి రావడంతో కొంచెం బెరుకుగా ఉండేదని అయితే అక్కడి స్టాఫ్ ప్రోత్సహించడంతో ధైర్యంగా వివిధ అంశాలు నేర్చుకోగలిగామంటున్నారీ విద్యార్థులు. ఈ 60 రోజుల శిక్షణ తమలో ఆత్మవిశ్వాసం నింపిందని తెలిపారు. ఫలితంగా నేడు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించగలిగామని చెబుతున్నారు.
శిక్షణ పూర్తి చేసి ఉద్యోగాలు : శిక్షణ ఇవ్వడం నుంచి సర్టిఫికెట్లు అందించి ఉద్యోగంలో చేరేవరకు ఎంతో ప్రోత్సహించారని చెబుతున్నారీ విద్యార్థులు. చెడు వ్యసనాలకు తావివ్వకుండా మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారంటున్నారు. ఈ 60 రోజుల శిక్షణ తమలో మార్పు తీసుకురావడం పట్ల తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారని చెబుతున్నారు. శిక్షణ పూర్తి చేసి ఉద్యోగం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన యువత అభివృద్ధే లక్ష్యంగా సీఆర్‌పీఎఫ్ తమ సొంత నిధులతో వారికి శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉందంటున్నారు సీఆర్‌పీఎఫ్ సెకండ్ వింగ్ కమాండర్ కిషోర్. ముఖ్యంగా గజాయి డ్రగ్స్ వంటి వాటికీ గిరిజన యువతను దూరంగా ఉంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెబుతున్నారు.
"గత మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నాం. గిరిజన ప్రాంతాల్లో చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న యువతను ఎంపిక చేసుకుంటున్నాం. ఈ ఏడాది సీఎంఎస్ లాబొరేటరీ సహాయంతో 60 రోజుల పాటు శిక్షణ ఇచ్చాం. వీరికి డేటా ఎంట్రీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ,రెజ్యూమ్ బిల్డ్ చేయడం, దుస్తులు, ఆహార శైలి వంటి అంశాలపై తర్ఫీదు ఇచ్చాం. తద్వారా దాదాపు 35మంది ఉద్యోగాలు సాధించారు. ఒక్కోక్కరికి సుమారు రూ. 12,000 నుంచి రూ.25,000 జీతం వస్తుంది." - కిషోర్, సీఆర్‌పీఎఫ్ సెకండ్ వింగ్ కమాండర్
పాడేరు పరిసర ఏజెన్సీ ప్రాంతాల నుంచి 45 మంది గిరిజన యువతీ యువకులను ఎంపిక చేసింది సీఆర్‌పీఎఫ్ బెటాలియన్. ఆర్థిక పరిస్థితులు బాగోలేక పెద్దగా చదువుకోని వారికి వివిధ అంశాలపట్ల శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు. తద్వారా దాదాపు 35మంది ఉద్యోగాలు సాధించారు. సీఎంఎస్ వారు 60 రోజుల పాటు ఇచ్చిన శిక్షణ పూర్తి కావడంతో గిరిజన యువత సీఆర్‌పీఎఫ్ సెకండ్ వింగ్ కమాండర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందుకున్నారు.
పగలు ప్రజలకు సేవ - రాత్రిళ్లు లక్ష్యం కోసం శ్రమ
రోలర్ స్కేటింగ్‌లో రాణిస్తున్న భవ్య శ్రీ - క్రీడల విభాగంలో ఎంబీబీఎస్ సీటు

