ETV Bharat / state

రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసులు - అప్రమత్తమైన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక పడకలు, మందులు సిద్ధం - ప్రజలు ఆందోళన చెందొద్దన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ - గత అనుభవాలతో కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు

COVID-19 Preparedness in AP
COVID-19 Preparedness in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 21, 2026 at 10:28 PM IST

2 Min Read
Choose ETV Bharat

COVID-19 Preparedness in AP : రాష్ట్రంలో కోవిడ్ కేసులు మళ్లీ నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముందుజాగ్రత్త చర్యలను మరింత ముమ్మరం చేసింది. కొత్త కేసుల సంఖ్యపై ఎప్పటికప్పుడు డేగకన్ను వేసి ఉంచుతోంది. కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్నవారికి వెంటనే పరీక్షలు చేయాలని నిర్ణయించింది. బాధితులకు మెరుగైన చికిత్స అందించేలా అన్ని ప్రభుత్వాసుపత్రులను సర్వం సిద్ధం చేస్తోంది.

ప్రజలు ఆందోళన చెందొద్దు : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రుల్లో కోవిడ్ పరీక్షల కిట్లు, మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు. ప్రత్యేక పడకలు, రక్షణ సామగ్రికి ఎలాంటి లోటు రాకుండా చూడాలని సూచించారు. అత్యవసర ఔషధాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచేలా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. అయితే, వైద్య శాఖ అధికారులు మాత్రం అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తించి పరీక్షలు చేయాలన్నారు. వారికి అవసరమైన చికిత్స అందించేలా ప్రభుత్వాసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

గత అనుభవాలతో కార్యాచరణ : కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్య శాఖ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉండాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. గతంలో కోవిడ్ సమయంలో ఎదురైన అనుభవాలను ఆయన గుర్తు చేశారు. ఆ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. దశల వారీగా అమలు చేసేలా పక్కా కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి ఉంచుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

సిద్ధంగా 255 ప్రత్యేక పడకలు : కోవిడ్ బాధితులకు అత్యవసర వైద్యం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 బోధనాసుపత్రులను (టీచింగ్ ఆసుపత్రులు) ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటిలో మొత్తంగా 255 ప్రత్యేక కోవిడ్ పడకలను (బెడ్స్) ఏర్పాటు చేశారు. కేవలం బోధనాసుపత్రుల్లోనే కాకుండా, సెకండరీ స్థాయి ఆసుపత్రుల్లోనూ ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. భవిష్యత్తులో వచ్చే అవసరాలకు అనుగుణంగా అక్కడ కూడా ప్రత్యేక పడకలను కేటాయించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు.

భారీగా మాస్కులు, మందుల నిల్వలు : కరోనా కట్టడిలో కీలకమైన మాస్కులు, రక్షణ సామగ్రి కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో 6 లక్షల 77 వేల 936 ట్రిపుల్ లేయర్ మాస్కులను అందుబాటులో ఉంచారు. కేంద్ర ఔషధ నిల్వ కేంద్రాల్లో అదనంగా మరో 5.26 లక్షల మాస్కులు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా 58,790 ఎన్-95 మాస్కులు, 4,436 పీపీఈ కిట్లు వినియోగానికి సిద్ధంగా ఉంచారు. 2,572 శానిటైజర్ బాటిళ్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. వీటితో పాటు కోవిడ్ చికిత్సలో అత్యవసరమైన యాంటీబయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్ (సెలైన్స్) తదితర మందుల నిల్వలు కూడా రాష్ట్రంలో తగిన స్థాయిలో ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

ఏపీలో కొవిడ్ కేసులు - ‘ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌.5’ వేరియంట్​గా గుర్తింపు

రాష్ట్రంలో 19 కరోనా కేసులు ​ - సీజనల్‌ వ్యాధి లాంటిదే ఆందోళన వద్దంటున్న వైద్యులు