ETV Bharat / state

మారుతున్న ఒరవడి - ఆడపిల్లల దత్తత వైపే దంపతుల మొగ్గు

పిల్లల్లేని దంపతుల్లో మారుతున్న ఆలోచన తీరు - ఆడపిల్లల్ని దత్తత తీసుకోవడానికే దంపతుల మొగ్గు - ఏడేళ్లలో దత్తత తీసుకున్న శిశువుల్లో బాలికలే అధికం - 58.36 శాతంగా బాలికల దత్తత రేటు

Girl Child Adoption Increasing
Girl Child Adoption Increasing (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 27, 2026 at 7:30 AM IST

2 Min Read
Choose ETV Bharat

Girl Child Adoption Increasing : చేతి గాజుల చప్పుడు. కాలి మువ్వల సవ్వడి. తమ నట్టింట వినిపించాలని, వారి ముద్దు ముద్దు మాటలు తమ చెవులను సోకాలని, వారికి అల్లారు ముద్దుగా మురిపెంతో గోరు ముద్దలు తినిపించాలని, పిల్లలు లేని దంపతులు కోరుకుంటున్నారు. మగ పిల్లల కంటే ఆడ పిల్లలను దత్తత తీసుకోవడానికే ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు కేవలం మగపిల్లల కోసం తపించే రోజులు ఉండేవి. కానీ కాలం మారింది. దాంతో పాటే ప్రజల ఆలోచన శైలిలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఈనాడు ప్రతి కుటుంబమూ ఇంట్లో కచ్చితంగా ఆడపిల్ల ఉండాలని బలంగా కోరుకుంటోంది.

కాలం మారుతోంది. దత్తతలో మగపిల్లల కంటే ఆడపిల్లల వైపే దంపతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఏడేళ్ల ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే దత్తతలో 58.36 శాతం అంటే 370 బాలికలు, 41.64 శాతం అంటే 264 మంది బాలురున్నారు. ఒక్క 2020-21 ఏడాది మినహా మిగతా అన్ని సంవత్సరాల్లోనూ ఆడబిడ్డల దత్తత 50 శాతానికి మించింది.

దేశీయ, విదేశీ దత్తతలోనూ ఇదే ఒరవడి: దేశీయ దత్తత, విదేశీ దత్తతలోనూ వారి శాతమే ఎక్కువగా ఉంది. విదేశీ దత్తతలో సగటున 60 శాతంపైగా ఆడపిల్లలకు ప్రేమాప్యాయతలు పంచేందుకే మొగ్గు చూపుతున్నారు. ఆడపిల్ల పుడితే నిర్దాక్షిణ్యంగా చెత్త కుప్పలు, ముళ్ల తుప్పల్లో పడేసే వారు సమాజంలో ఒకవైపు ఉండగా, మరోవైపు అమ్మాయి నట్టింట అడుగు పెడితే చాలు సాక్షాత్తూ మహాలక్ష్మే వచ్చిందని సంబరపడిపోతున్న వారూ పెరుగుతున్నారు. దేశీయ దత్తతలోనే కాదు, విదేశీ దత్తతలోనూ ఇదే ఒరవడి కనిపిస్తోంది. అంతేకాదు, అనాథ దివ్యాంగ పిల్లలనూ చేరదీస్తున్నారు.

దత్తత తీసుకుంటున్న వారిలో భారీగా ప్రవాసీయులు: చిన్నారులను దత్తత తీసుకుంటున్నవారిలో ప్రవాసీయులు భారీగానే ఉన్నారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, స్పెయిన్, యూకే, కెనడా, ఇటలీ, బెల్జియం దేశాల్లోని ప్రవాసాంధ్రులు, ఆయా దేశాలకు చెందిన వారు చిన్నారుల్ని దత్తత తీసుకున్నారు. అంతేకాకుండా మన రాష్ట్రంతోపాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుకు చెందిన వారూ ఉన్నారు.

దత్తతకు రైతులూ ముందుకు: ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, సాఫ్ట్‌వేర్‌ రంగానికి చెందిన వారితోపాటు రైతులు కూడా పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు. 2019-20 ఏడాదిలో 25 మంది వ్యాపారవేత్తలు, 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 15 మంది రైతులు, 11 మంది ఉపాధ్యాయులు, 10 మంది వివిధ కంపెనీ మేనేజర్లు, 10 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు పిల్లల్ని దత్తత తీసుకున్నారు. 2024-25లో 5 మంది దివ్యాంగ బాలికలను, 2025-26లో 10 మంది దివ్యాంగ చిన్నారులను దత్తత తీసుకున్నారు. ఈ రెండేళ్లలో ఆరుగురు దివ్యాంగ పిల్లలను ఇతర దేశాలకు చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు.

రెండేళ్లపాటు ‘కారా’ పర్యవేక్షణ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 శిశుగృహాల్లో ప్రస్తుతం 119 మంది చిన్నారులున్నారు. వీరంతా సున్నా నుంచి ఆరేళ్లలోపు పిల్లలు. ఇందులో అబ్బాయిలు 40 మంది, అమ్మాయిలు 79 మంది ఉన్నారు. దాదాపు వెయ్యి మంది చిన్నారుల దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో కంటే దత్తతలో వేగం పెరిగింది. పిల్లల్ని దత్తత ఇచ్చిన తర్వాత కూడా ఆయా కుటుంబాలు వారిని సంరక్షిస్తున్న తీరుపై రెండేళ్లపాటు ‘కారా’ పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి 6 నెలలకోసారి తనిఖీ చేస్తారు.

యువతకు ఉజ్వల భవిత - కెరీర్‌, నైపుణ్యాలు, ఉపాధికి 'మై భారత్'

టీచర్లే మన లీడర్లు, రేపటి 'ఛేంజ్ మేకర్లు' - సింగపూర్ వెళ్లి వచ్చిన ఉపాధ్యాయులతో మంత్రి లోకేశ్ భేటీ