కాగితాలపై 'సైబర్' మాయ! - నేరాలు తగ్గాయంటూ సీఎం ముందే అసత్యాలు?
ముఖ్యమంత్రికి కేసులు తగ్గాయని చూపిన పోలీసు శాఖ - స్టేషన్లలో ఫిర్యాదులు తీసుకోకపోవడమే అసలు కారణం - ఏడాదిగా అటకెక్కిన 'జిల్లాకో సైబర్ స్టేషన్' హామీ

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 21, 2025 at 8:17 AM IST
AP Cyber Crime Data Discrepancy: రాష్ట్రంలో సైబర్ నేరాలు నిజంగానే తగ్గాయా? లేక పోలీసుల చిట్టాలో మాత్రమే తగ్గినట్లు కనిపిస్తున్నాయా? నిత్యం మనం వింటున్న 'డిజిటల్ అరెస్టులు', 'ఆన్‌లైన్ మోసాల' వార్తలు తగ్గాయా? అంటే అవుననే అంటోంది ఏపీ పోలీసు శాఖ. రాష్ట్రంలో సైబర్ నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ముందే అధికారులు గణాంకాలు ప్రదర్శించారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. బాధితుల సంఖ్య పెరుగుతోంది. దోపిడీల తీవ్రత పెరుగుతోంది. కానీ పోలీసు రికార్డుల్లో మాత్రం నేరాలు తగ్గినట్లు చెప్తున్నారు. ఫిర్యాదులు స్వీకరించకుండా, కేసులు నమోదు చేయకుండా కృత్రిమంగా నేరాల రేటును తగ్గించి చూపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎం ముందే అంకెల గారడీ: తాజాగా జరిగిన కలెక్టర్ల సదస్సులో పోలీసు ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబుకు ఒక నివేదికను సమర్పించారు. అందులో సైబర్ నేరాల గణాంకాలను ప్రస్తావించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాలు ఏకంగా 21.57 శాతం తగ్గాయని వివరించారు. 2023 డిసెంబరు నుంచి 2024 నవంబరు వరకు రాష్ట్రంలో 1,905 కేసులు నమోదయ్యాయని చూపించారు. అదే 2024 డిసెంబరు నుంచి ఈ ఏడాది నవంబరు వరకు కేవలం 1,494 కేసులు మాత్రమే నమోదయ్యాయని, అంటే నేరాలు తగ్గాయని సీఎంకు వివరించారు.
'కేసులు నమోదు చేయట్లేదు, అందుకే తగ్గాయి': రికార్డుల్లో నేరాలు తగ్గడానికి అసలు కారణం 'పోలీసుల అయిష్టతే' అని తెలుస్తోంది. సైబర్ నేరాల బారిన పడిన బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్తే వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఫిర్యాదు తీసుకునేందుకు స్థానిక పోలీసులు ఆసక్తి చూపడం లేదు. సైబర్ కేసు నమోదు చేస్తే, దాని దర్యాప్తు క్లిష్టంగా ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం అవసరం అవుతుంది. ఈ తలనొప్పులు మనకెందుకులే అనే ఉద్దేశంతో చాలా చోట్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం లేదు. బాధితులను సవాలక్ష ప్రశ్నలతో విసిగించి, ఫిర్యాదు ఇవ్వకుండానే వెనక్కి పంపేస్తున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారు, లేదా ఎస్పీలు చురుగ్గా ఉన్న జిల్లాల్లో మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. మిగిలిన సామాన్యుల గోడు అరణ్య రోదనగానే మిగిలిపోతోంది. అందుకే కేసుల సంఖ్య తగ్గినట్లు కనిపిస్తోంది.
స్టేషన్లు లేవు, దిక్కు లేదు: సైబర్ నేరాలను అరికట్టేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో లేవు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం సీఐడీ ప్రధాన కార్యాలయం, విశాఖపట్నం, విజయవాడ కమిషనరేట్లలో మాత్రమే ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మెజారిటీ కేసులు వీటిలోనే నమోదవుతున్నాయి. మిగిలిన జిల్లాల్లోని ప్రజలకు ఎక్కడ ఫిర్యాదు చేయాలో కూడా తెలియని పరిస్థితి. 'జిల్లాకొక సైబర్ పోలీస్ స్టేషన్' ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఏడాది కిందట ప్రకటించింది. కానీ ఇప్పటికీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. అడుగు ముందుకు పడలేదు.
అవగాహన శూన్యం: సైబర్ నేరాలను అరికట్టడంలో సీఐడీ విభాగం కూడా విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. సీఐడీలో ప్రత్యేకంగా సైబర్ నేరాల విభాగం ఉన్నప్పటికీ, దానికి తగిన వనరులు, సిబ్బంది లేరు. అసలు ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి? డిజిటల్ అరెస్టు అంటే ఏంటి? ఫెడెక్స్ కొరియర్ స్కామ్ అంటే ఏంటి? అనే విషయాలపై ప్రజలకు కనీస అవగాహన కల్పించడం లేదు. ఒకవేళ మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలన్న విషయం గ్రామీణ ప్రజలకు ఇంకా తెలియదు. బాధితులు ఫిర్యాదు చేసేలా ప్రోత్సహించడంలో యంత్రాంగం విఫలమైంది.
ఐదేళ్ల చిట్టా చూస్తే షాకే: గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, ఈ ఏడాది కేసులు ఎంత అసాధారణంగా తగ్గాయో అర్థమవుతుంది. ఏటా పెరుగుతూ వచ్చిన గ్రాఫ్, ఈ ఏడాది సడెన్‌గా పడిపోయింది. దీన్ని బట్టే కేసులు నమోదు చేయడం లేదని అర్థమవుతోంది.
- 2021: 1,875 కేసులు
- 2022: 2,341 కేసులు (పెరిగాయి)
- 2023: 2,341 కేసులు (స్థిరంగా ఉన్నాయి)
- 2024: 2,853 కేసులు (భారీగా పెరిగాయి)
- 2025: 1,771 కేసులు (అకస్మాత్తుగా పడిపోయాయి)

