ETV Bharat / state

రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యల కలకలం - నలుగురు మృతి

చౌడేశ్వరి నగర్‌ పరిసర ప్రాంతాల్లో బాధితులు - 14 మంది అసుపత్రి పాలు - మొత్తం నలుగురు మృతి - కిడ్నీల సమస్యలు తలెత్తడానికి పాలు కల్తీ కావడమే కారణమని స్థానికుల అనుమానం

Kidney diseases in Rajamahendravaram
Kidney diseases in Rajamahendravaram (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 23, 2026 at 7:28 AM IST

4 Min Read
Choose ETV Bharat

Kidney Diseases in Rajamahendravaram: రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్‌ పరిసర ప్రాంతాల్లో కిడ్నీ సంబంధిత వ్యాధులు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒకే ప్రాంతంలో 14 మందికి కిడ్ని సంబంధిత సమస్యలు తలెత్తగా కొద్ది రోజుల క్రితం ఇద్దరు మృతి చెందారు. తాజాగా సోమవారం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. దాంతో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. ఫలితంగా స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తున్నాయి.

ఈరోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందడంతో స్థానికులు వణికిపోతున్నారు. వ్యాధులకు కల్తీ పాలే కారణమనే అనుమానాలు సైతం సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీంతో పాల నమూనాలను ల్యాబ్‌లకు పంపించిన అధికారులు అనంతరం ఇంటింటి సర్వేను చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలో పాలు, నీరు, ఇతర నమూనాలను వైద్యఆరోగ్య సిబ్బంది ప్రస్తుతం సేకరిస్తున్నారు.

రాజమహేంద్రవరంలో కలకలం రేపుతున్న కిడ్నీ సంబంధిత వ్యాధులు - నలుగురు మృతి (ETV Bharat)

సమస్యపై స్పందించిన కలెక్టర్: నలుగురు మృతి చెందడంపై కలెక్టర్ కీర్తి చేకూరి స్పందించారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ ఈ సమస్యపై ఆదివారం మధ్యాహ్నం అధికార యంత్రాంగం దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అనంతరం దీనిపై హుటాహుటిన టీమ్​ను నియమించి అప్రమత్తమైనట్లు కీర్తి చేకూరి వెల్లడించారు. ఏ ఏ ప్రాంతాల్లో ఈ తరహా కేసులు ఉన్నాయో ప్రధానంగా ఇంటింటి సర్వే చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సర్వేలో ప్రధానంగా పాలు, నీరు, ఇతర నమూనాలను సేకరించినట్లుగా వివరించారు. వీటన్నింటి అంశాలను క్రోడీకరించి చూస్తే ఇందులో చాలా కామన్​గా పాలను ఉపయోగించడం వలనే ఈ వ్యాధులు ప్రబలినట్లు తేలిందని కీర్తి వివరించారు. దాంతో పాలను సరఫరా చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి తెలిపారు. దీనిపై ఎఫ్​ఐఆర్​ను నమోదు చేసినట్లు వెల్లడించారు. పాలను దాదాపు 106 కుటుంబాలకు సరఫరా చేశారని అన్నారు. అందుకు అనుగుణంగా ఆ కుటుంబాల రక్తనమూనాలను సేకరించి ల్యాబ్​లకు పంపించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి వివరించారు.

వ్యాధిగ్రస్తుల్లో ఇద్దరు మృతి: బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడినవారే ఎక్కవగా ఉన్నారు. 5 నెలల శిశువు, మూడేళ్ల బాలుడు సైతం ఉండటం గమనార్హం. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనారోగ్యానికి గురవడంతో వారు ఆసుపత్రి సిబ్బంది అధికారులకు హుటాహుటిన సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. భాగిశెట్టి కనకరత్నం అనే మహిళకు కిడ్నీలు దెబ్బతినగా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అయితే దురదృష్టవశాత్తు ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఆమె కుమారులు తెలిపారు.

పాల కల్తీ జరిగిందేమోననే అనుమానం: మరో బాధితురాలు తాడి కృష్ణవేణి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని 5 ప్రైవేటు ఆసుపత్రుల్లో 12 మంది కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తుండటంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు తెలిపారు. కోరుకొండ మండలానికి చెందిన గణేశ్ అనే వ్యాపారి వీరందరికీ పాలు పోస్తున్నట్లు గుర్తించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

ఇంటింటి సర్వే: శివరాత్రి రోజు పాలు, పెరుగు చేదుగా అనిపించాయని కొంతమంది బాధితులు అంటున్నారు. బాధితుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను టాక్సికాలజీ పరీక్షకు పంపించారు. పాల నమూనాలను హైదరాబాద్‌, విశాఖలోని ఆహార పరిశోధన కేంద్రాలకు పంపించామని నివేదికలు వచ్చిన తర్వాత అసలు కారణం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు.

గణేశ్ రోజూ ఎవరికి పాలు పోస్తున్నాడో వివరాలు సేకరించి, ఆయా కుటుంబాలను సర్వే చేయాలని కలెక్టర్‌ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. ఘటనపై ఎంపీ పురందేశ్వరి ఆరా తీశారు. జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

స్పందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్: ఘటనపై స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. పాలు పోయించుకున్న కుటుంబాలను గుర్తించి వారి ఇంట్లో వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఇంటింటి సర్వేలో భాగంగా పాలు, నీరు మొదలైన నమూనాలను సమగ్రంగా సేకరించామని స్పష్టం చేశారు. కిడ్నీ వ్యాధులపై వైద్యఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా పని చేస్తున్నారని, ఎవరూ ఏ విధమైన భయాందోళనలకు గురికావొద్దని ప్రజలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధైర్యం చెప్పారు.

కేసులపై అప్రమత్తం: అంతేకాకుండా అనుమానిత కేసులపై వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని కమిషనర్‌ వీరపాండియన్‌ తెలిపారు. పాలు, నీరు, ఇతర నమూనాలు సేకరించామని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు పేర్కొన్నారు.

"గత కొన్ని సంవత్సరాలుగా గణేశ్ అనే వ్యక్తి మాకు పాలను పోస్తున్నాడు. కానీ ప్రస్తుతం పాల కల్తీ వల్లనే అనారోగ్యం పాలయ్యారని మేం అనుమానిస్తున్నాం. కిడ్నీ వ్యాధి బారిన పడిన వారిలో చాలా మంది 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనారోగ్యానికి గురయ్యారు. అంతేకాకుండా ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం" -స్థానికులు

'కిడ్నీ బాధితులు డబ్ల్యూహెచ్‌వో సూచనలు పాటించాలి'

పట్టాలెక్కిన పరిశోధనలు- ఉద్దానం బాధతులకు కూటమితో ఊరట