ETV Bharat / state

కుటమి ప్రభుత్వ చొరవ - మల్లవల్లికి మళ్లీ పారిశ్రామిక కళ

ప్లాట్ల కేటాయింపుతో పరిశ్రమలు స్థాపిస్తున్న పారిశ్రామిక వేత్తలు- జోరందుకున్న నిర్మాణ పనులు- కార్మికులతో సందడిగా మారిన మల్లవల్లి - ఉపాధి అవకాశాలు పెరిగాయంటున్న స్థానికులు

Construction Works at Mallavalli Industrial Hub
Construction Works at Mallavalli Industrial Hub (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 26, 2026 at 7:20 AM IST

3 Min Read
Choose ETV Bharat

Construction Works at Mallavalli Industrial Hub: వైఎస్సార్సీపీ హయాంలో చడీచప్పుడు లేని మల్లవల్లి ఇండస్ట్రియల్ హబ్‌ కూటమి ప్రభుత్వ చొరవతో పారిశ్రామిక కళ సంతరించుకుంటోంది. భూ కేటాయింపులు దక్కించుకున్న యాజమాన్యాలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. నిర్మాణ పనులు జోరందుకోవడంతో ఆ ప్రాంతం కార్మికులతో సందడిగా మారింది. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయని సంతోషం వ్యక్తం అవుతోంది.

అప్పట్లో చిట్టడవుల్లా మల్లవల్లి భూములు: కృష్ణా జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే సంక్పలంతో కూటమి ప్రభుత్వం మల్లవల్లి పారిశ్రామికవాడపై ప్రత్యక దృష్టి పెట్టింది. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల కోసం 14 వందల 67 ఎకరాల భూమిని ఏపీఐఐసీ ద్వారా సేకరించింది. పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న 427 మంది పారిశ్రామిక వేత్తలకు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించింది. వైఎస్సార్సీపీ హయాంలో అక్కడ ఎకరా భూమిని రూ. 80 లక్షలకు పెంచేశారు. అంత చెల్లించలేక అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. ఫలితంగా అప్పట్లో మల్లవల్లి భూములు చిట్టడవుల్ని తలపించాయి. పరిశ్రమల సందడి లేక ఆ ప్రాంతం నిశ్శబ్ధంగా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చాక మల్లవల్లికి మళ్లీ కళొచ్చింది. భూములు పొందిన పారిశ్రామిక వేత్తలు నిర్మాణ పనులు మొదలుపెట్టారు.

చేతి నిండా పని: కూటమి అధికారంలోకి వచ్చాక పారిశ్రామికవేత్తలకు ఎకరా భూమిని పాత ధరకే, అంటే పదహారున్నర లక్షలకే కేటాయించింది. భూమి విలువ అందుబాటులో ఉండడం, మౌలిక సదుపాయాలు కల్పిస్తుండంతో చాలా మంది పరిశ్రమలు స్థాపిస్తున్నారు. ఒకవైపు జంగిల్ క్లీయరెన్స్ , మరోవైపు నిర్మాణ పనులూ జోరుగా జరుగుతున్నాయి. మల్లవల్లి చుట్టు పక్కల 25 గ్రామాల ప్రజలు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. తమకు చేతి నిండా పని దొరుకుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మల్లవల్లిలో 60 నుంచి 65 సంస్థలు నడుస్తున్నాయి. ప్రభుత్వం 300 యూనిట్ల ఏర్పాటుకు స్థలాలు కేటాయించగా వారంతా ఒక్కొక్కరుగా నిర్మాణాలు చేస్తున్నారు. ఇంకో 4 నెలల్లో పూర్తి స్థాయిలో పరిశ్రమల నిర్మాణం జరుగుతుందని కార్మికులు చెప్తున్నారు. చదువుకున్న తమ పిల్లలకు పరిశ్రమల్లో ఉద్యోగాలు వస్తాయని, తమకూ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

'గతంలో మల్లవల్లిలో ఏ రోడ్డు చూసినా పిచ్చి చెట్లతో నిండి ఉండేది. ఇప్పుడు చూస్తే ఎదో ఒక పరిశ్రమ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొంత మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమల నిర్మాణాలు చేస్తుంటే మరికొంత మంది జంగిల్ క్లీయరెన్స్ చేస్తున్నారు. గత ఐదేళ్లు ఉన్న మల్లవల్లికి సంవత్సరం నుంచి చూస్తున్న మల్లవల్లికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. గతంలో మల్లవల్లిలో ఒకే ఒక్క జేసీబీ ఉండేదని, దానికి కూడా పెద్దగా పని ఉండేది కాదు. ఇప్పుడు పరిశ్రమల నిర్మాణాలు, జంగిల్ క్లియరెన్స్ చేయడం వంటి వాటిలో మాకు చేతి నిండా ఉపాధి లభిస్తుంది.' -ఉపాధి పొందుతున్న జేసీబీ డ్రైవర్లు

పరిశ్రమల స్థాపన కోసం 2018లో APIIC (Andhra Pradesh Industrial Infrastructure Corporation Ltdకి దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటికే 427 మంది పారిశ్రామికవేత్తలకు మల్లవల్లిలో లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించారు. ఇప్పటికే అశోక్ లేలాండ్ యూనిట్ ప్రారంభంకాగా మరికొన్ని పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లలోనూ పని జరుగుతోంది. పాత ధరకే ప్లాట్లు కేటాయించడంతో భారం తగ్గిందని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ హయాంలో పారిశ్రామికవాడను గాలికొదిలేయడంతో స్థానికులకు ఉపాధి గగనంగా మారింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి. పరిశ్రమల నిర్మాణాలు ఊపందుకోవడం ఉత్పత్తి యూనిట్ల ప్రారంభంతో స్థానికులకు చేతినిండా పని దొరుకుతోంది.

మల్లవల్లిలో మట్టి కొరత - చర్యలు తీసుకోవాలంటున్న పారిశ్రామికవేత్తలు

మల్లవల్లికి కొత్త కళ - ఏడాదిలోపు పూర్తి స్థాయిలో అభివృద్ది