'స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్' - చకచకా పొట్టి శ్రీరాముల విగ్రహ నిర్మాణ పనులు, ఈనెల 16న ఆవిష్కరణ
అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహం - శరవేగంగా జరుగుతున్న విగ్రహ నిర్మాణ పనులు - ఈనెల 16న విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 2, 2026 at 8:31 PM IST
Construction of 58 Feet Potti Sriramulu Statue in AP : రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పొట్టిశ్రీరాములు విగ్రహం, స్మృతివనం నిర్మాణానికి ప్రభుత్వం రాజధానిలో 6.8 ఎకరాల భూమి కేటాయించింది. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టింది. ఈనెల 16న తేదిన ముఖ్యమంత్రి చంద్రబాబు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని కోరుతూ ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని బావి తరాలకు తెలియ చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అమరావతి రాజధానిలో 'స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్' పేరుతో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్మృతివనం నిర్మాణం జరుగుతుంది. పొట్టి శ్రీరాములు125వ జయంత్యుత్సవాల ముగింపు సందర్భం ఈనెల 16వ పొట్టి శ్రీరాములు విగ్రహా అవిష్కరణ జరగనుంది. తెలుగు రాష్ట్రం కోసం ఆయన 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసినంటిని గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహం రూపుదిద్దుకుంటోంది. కృష్ణా జిల్లా బొమ్ములూరుకు చెందిన కళాకారులు విగ్రహ భాగాలకు ఆకృతినిస్తూ, దశల వారీగా అమరావతికి తరలిస్తున్నారు.
మొత్తం ఎత్తు 110 అడుగులు : రెండంతస్తుల వేదికపై అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. వేదిక, విగ్రహం కలిపి మొత్తం ఎత్తు 110 అడుగులు ఉంటుంది. వేదిక నిర్మిత ప్రాంతం 17 వేల చదరపు అడుగులు ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 100 మంది కూర్చునేలా మినీ థియేటర్, మ్యూజియం, లైబ్రరీ ఉంటాయి. మొత్తం బరువు 100 టన్నులు కాగా, విగ్రహాన్ని 30 టన్నుల కంచుతో తయారు చేస్తున్నారు. పీఠంపై విగ్రహాన్ని నిలబెట్టేందుకు లోపల 70 టన్నుల బరువైన ఇనుప గడ్డర్లు వాడుతున్నారు. మొదటి దశలో భాగంగా మార్చి 16 నాటికి రెండంతస్తుల వేదిక, విగ్రహం సిద్ధం చేసి విగ్రహావిష్కరణ చేస్తారు. రెండో దశలో మరో 2,000 సీటింగ్ సామర్థ్యంతో ఆడిటోరియం, పార్క్ అభివృద్ధి చేస్తారు.
58 రోజుల దీక్ష-58 అడుగుల విగ్రహం : పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం(డిసెంబరు 15) సందర్బంగా అమరావతిలో పొట్టిశ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నట్లు గత ఏడాది సీఎం చంద్రబాబు తెలిపారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విగ్రహం స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైజ్గా నిలుస్తుందని స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములకు గుర్తింపు కోసం పోరాడిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని తేల్చిచెప్పారు. పొట్టి శ్రీరాములు ప్రాణాలు వదిలిన భవనాన్ని అన్ని విధాలా పరిరక్షిస్తామని తెలిపారు. నెల్లూరులో పొట్టిశ్రీరాములు పుట్టిన ఇంటిని ఓ మెమోరియల్‌గా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు. తెలుగు జాతిని నెంబర్-1గా నిలబెట్టినప్పుడే పొట్టిశ్రీరాములుకు నిజమైన నివాళి అని గుర్తు చేశారు.
6.8 ఎకరాల్లో మెమోరియల్ ట్రస్ట్ : రాజధాని ప్రాంతంలోని శాఖమూరులో ప్రభుత్వం 6.8 ఎకరాల్లో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్, స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ స్మృతి వనానికి గత ఏడాది మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాటికి ఈ స్మృతివనంలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విగ్రహ డిజైన్లను ఇప్పటికే సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’గా నామకరణం చేశారు.
సంకల్పం కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు: సీఎం చంద్రబాబు
అమరవీరుల చరిత్రను స్మరించుకుందాం - పటేల్, పొట్టి శ్రీరాములుకు చంద్రబాబు నివాళి

