గుంతల రోడ్డులో ప్రయాణానికి పాట్లు - పూర్తిగా దెబ్బతిన్న విశదల-మందపాడు రహదారి
రోడ్డుపై ఉన్న గుంతలతో వాహనదారుల అవస్థలు- రాత్రి సమయాల్లో జరుగుతున్న ప్రమాదాలు - దాదాపు 15 గ్రామాల ప్రజలకు ఇదే ప్రధాన రహదారి

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 24, 2026 at 9:59 AM IST
Completely Damaged Visadala-Mandapadu Road : ఆ రహదారి 10 నుంచి 15 గ్రామాలను కలుపుతుంది! పూర్తిగా ధ్వంసమైన ఆ రహదారిపై ప్రయాణం సాహసమనే చెప్పాలి. అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, అసలు రోడ్డులో గుంతలు ఉన్నాయా లేక గుంతల మధ్య రోడ్డు ఉందా అన్న సందేహం కలుగుతుంది. ఎదురుగా ఏదైనా వాహనం వస్తే, మరో వాహనం పూర్తిగా ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లాలోని ఈ రహదారిపై వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బదులు ఎదుర్కొంటున్నారు.
రోడంతా గుంతలు, గోతులు : ఈ రహదారిపై గుంతలు, గోతులు తప్ప రోడ్డు ఆనవాళ్లు లేవు? ఇది గుంటూరు జిల్లా విశదల అడ్డ రోడ్డు నుంచి మందపాడు వైపు వెళ్లే రహదారి. పూర్తిగా ధ్వంసమై గుంతలమయంగా మారిన ఈ రహదారిపై ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. సిరిపురం, రావెల, మందపాడు, బండారుపల్లి, మల్లవరం సహా పరిసర గ్రామాల నుంచి ప్రజలు, విద్యార్థులు, రైతులు ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవల కాలంలో ఈ మార్గం పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ప్రమాదాల బారిన పడి ఆస్పత్రి పాలవుతున్నారు.
"ఈ రహదారి సుమారు 10 నుంచి 15 గ్రామాలను కలుపుతుంది, ఇది పూర్తిగా ధ్వంసమైంది. దీనిపై ప్రయాణించడం అత్యంత ప్రమాదకరం మారింది. ముఖ్యంగా వర్షం పడేటప్పుడు, అలాగే రాత్రిపూట దీనిపై ప్రయాణించడం చాలా కష్టంగా ఉంటుంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి రహదారికి మరమ్మతులు చేయించాలి"- గ్రామస్థులు .
ఆంబులెన్స్ రావాలన్న కష్టమే : రహదారి పొడవునా పెద్ద పెద్ద గుంతలు ఉండటంతో బైకులు, ఆటోలు నడపడం ప్రమాదకరంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. వాహనాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిసర గ్రామాల రైతులు మిరప, పత్తి, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్ని గుంటూరు యార్డుకు తరలించేందుకు ఈ రోడ్డే దిక్కు. రాత్రి వేళల్లో గర్భిణీలు, రోగులను ఆస్పత్రులకు తరలించాలన్నా ఆంబులెన్స్‌లు సకాలంలో రాలేకపోతున్నాయని, అత్యవసర సేవలకు ఆటంకం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఆర్ అండ్ బీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఈ రహదారిని వెంటనే బాగు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
గుర్రాలు, గాడిదలపై జెండాలతో గిరిజనులు - రోడ్డు కోసం వినూత్న నిరసన
రాష్ట్రాభివృద్ధి విజన్‌కు అమరావతి నగర నిర్మాణం మొట్టమొదటి సక్సెస్: సీఎం చంద్రబాబు

