ఫొటో దిగి యాప్‌లో అప్‌లోడ్ చేయడమే మన పని - చెత్త సంగతి మనకెందుకులే!
జీహెచ్ఎంసీలో ఫలితం లేని శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ - ప్రతి డివిజన్‌కు ఓ ప్రత్యేక అధికారి నియామకం - రోజూ ఒక ఫొటో దిగడం యాప్‌లో అప్‌లోడ్ చేసి మమ అనిపిస్తున్న అధికారులు

Published : January 8, 2026 at 12:10 PM IST
Sanitation Special Drive In GHMC : రాజధాని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జోన్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. ఆల్విన్ కాలనీ రెండో ఫేజ్‌లోని ఓ ఖాళీ స్థలం ముందు చెత్త కుప్పను తయారు చేశారు. దాన్ని తొలగించాలని పారిశుద్ద్య సిబ్బందిని స్థానికులు కోరితే, వారు నానా రభస చేసి ఘర్షణకు దిగారు. చెత్తను కాలనీవాసులే పడేశారని, వారే తొలగించాలని తీవ్ర వాగ్వాదానికి దిగారు.
ఇదీ పరిస్థితి : గత నెల డిసెంబరు 31 నుంచి జీహెచ్‌ఎంసీ, విలీన మున్సిపాలిటీలు కలిపి 300 డివిజన్లలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. దీని కోసం గ్రేటర్లో ప్రతి డివిజన్‌కు ఓ ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. ఆయా డీసీలు, జోనల్ కమిషనర్లు, ఇటీవల నియమితులైన అదనపు కమిషనర్లు ఈ శానిటేషన్ ప్రక్రియను పర్యవేక్షించాల్సి ఉంది. డివిజన్లలో రోజూ ఒక ఫొటో దిగడం, యాప్‌లో అప్‌లోడ్ చేయడం, మమ అనిపించడం ఇప్పుడు సర్వ సాధారణంగా మారింది. దీని కారణంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడ చెత్త అక్కడే ఉంటోంది.
అసలు ఏం చేయాలి? ఎలా చేస్తున్నారు?
- హైదారాబాద్‌లో ఇంటింటికి తిరిగి తడి పొడి చెత్త సేకరించాలి. అందుకు ఇంటికి యూజర్ ఛార్జీల కింద రూ.100, రూ.150 చొప్పున చెత్త సేకరించే వారికి చెల్లిస్తున్నారు. కానీ తడి పొడి వేరు చేసే పరిస్థితి మాత్రం లేదు.
- ఇలా సేకరించిన చెత్త స్టేజ్-1 ట్రాన్స్‌ఫాం స్టేషన్ వద్ద అన్లోడ్ చేస్తారు. అక్కడి నుంచి పెద్ద పెద్ద వాహనాల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తారు. ఇక్కడ కొంత తడి పొడి చెత్తను వేరు చేస్తారు.
- జవహర్‌నగర్‌లో సేకరించిన చెత్త కొండల్లా పేరుకుపోతోంది. ప్రస్తుతం నగరంలోని 300 డివిజన్ల నుంచి 9500 టన్నుల చెత్త వస్తుందని అంచనా.
- ట్రాన్స్‌ఫామ్ స్టేషన్ వద్ద ఉదాసీనంగా చెత్త ఏరుకొనే వ్యక్తులకు అవకాశం ఇస్తారు. వారు ఇక్కడి నుంచి ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకెళ్తారు.

పైన చిత్రాన్ని చూశారా : ఇది సికింద్రాబాద్ బోయినపల్లి మార్కెట్ సమీపంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు కనిపించిన చిత్రం. చెత్తా చెదారంతో ఉన్న స్థలంలో వరాహాల స్వైర విహారం కనిపించింది. ఇక్కడ రెండు మూడు రోజులుగా చెత్తను తొలగించలేదని స్థానికులు చెబుతున్నారు. ఇదొక్కటే కాదు, ఇలాంటి దృశ్యాలు నగరం మొత్తం మీద చాలా చోట్లనే కనిపించాయి. ఈటీవీ-ఈటీవీ భారత్ బృందం ప్రత్యేక పరిశీలనలో నగరంలోని పారిశుద్ధ్యంపై పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. చాంద్రాయణగుట్ట, ఖిల్వత్ మైదానం, చాదర్‌ఘాట్ వంతెన, జుమ్మెరాత్ బజార్, చిలుకానగర్, పార్శిగుట్ట, గుడిమల్కాపూర్, బృందావన్ కాలనీల్లో ‘ఈటీవీ- ఈటీవీ భారత్’ బృందం పర్యటించింది. పారిశుద్ధ్య ప్రత్యేక కార్యక్రమంలో బహిరంగంగా ఈ డొల్లతనం వెలుగు చూసింది. దీని ప్రకారం మున్సిపల్ అధికారులు, సిబ్బంది శానిటేషన్ విషయంలో మమ అనిపిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.
ప్రజల నుంచే రూ.లక్షలు! : హైదరాబాద్ నగరంలో దాదాపు 40 లక్షల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. పీటీఐ (ఆస్తి పన్ను) లెక్కల ప్రకారం మొత్తం 27 లక్షల ఇళ్లు ఉన్నాయి. అనధికారిక ఇళ్లు కూడా ఉన్నాయి. ప్రతి ఇంటి నుంచి యూజర్ ఛార్జీల పేరుతో చెత్త సేకరించే కార్మికులకు సగటున రూ.100 చొప్పున ఏకంగా రూ.40 కోట్లు చెల్లిస్తున్నారు. అయినా రహదారులపై చెత్త మాత్రం మాయం కావడం లేదు. మరోవైపు ప్రతి ఏటా జీహెచ్‌ఎంసీ కేవలం పారిశుద్ధ్యానికే రూ.600 కోట్ల వరకు కేటాయిస్తోంది. దీనిలో 50 శాతం సిబ్బంది జీత భత్యాలకే చెల్లిస్తోంది. ఇంత చేస్తున్నా, నగరవాసులకు దోమల బెడద మాత్రం తప్పడం లేదు.
గ్రేటర్లో ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధం - సిద్ధమవుతున్న జీహెచ్ఎంసీ
ఇళ్లముందు వాడని పాత వాహనాలు ఉంటే తీసేస్తారు - జీహెచ్ఎంసీ శానిటేషన్ డ్రైవ్

