పచ్చళ్లు అమ్మి లక్షల్లో సంపాదన - విదేశాల నుంచి కూడా ఆర్డర్లు - సుహాసిని సక్సెస్ స్టోరీ
గొల్లపూడి పికిల్స్ ప్రత్యేకత - దేశ విదేశాలకు సుహాసిని పచ్చళ్లు - ఏడాదికి రూ.10లక్షలకు పైగా టర్నోవర్

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 10:20 AM IST
Gollapudi Pickles Suhasini : వంటింటికే పరిమితమై చాలీచాలని ఆదాయాలతో కుటుంబాలను నెట్టుకొచ్చేందుకు ఈతరం మహిళలు అస్సలు ఇష్టపడటం లేదు. ఆర్థికంగా ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా పరిస్థితులను తిట్టుకుంటూ అలా కూర్చోవడం లేదు. ఇబ్బందులు ఎదురైనా వెనకంజ వేయడం లేదు. అప్పులు, ఇతరులు వెక్కిరించినా కూడా ధైర్యం కోల్పోవడం లేదు. తమ స్థితిగతులకు మార్చుకునేందుకు దారులను వెతుకుతున్నారు. గట్టెక్కేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న సాయాన్ని అందిపుచ్చుకుని స్వయం ఉపాధి బాట పడుతున్నారు. ప్రతి కుటుంబం నుంచి ఓ మహిళా వ్యాపార వేత్త రావాలి అన్న సీఎం చంద్రబాబు పిలుపే స్ఫూర్తిగా తీసుకుని పచ్చళ్ల వ్యాపారాన్ని ఏర్పాటు చేసి లక్ష్యం దిశగా ఆమె అడుగులు వేశారు.
కృష్ణా జిల్లా గొల్లపూడికి చెందిన సుహాసిని వెలుగు రుణాల చేయూతతో మాంసాహార పచ్చళ్లే తన ప్రత్యేకతగా ముందుకు సాగుతున్నారు. ప్రతి నెలా నికరమైన ఆదాయాన్ని గడిస్తూ కుటుంబ పోషణలో అండగా నిలుస్తున్నారు. ఇంటి నుంచి బయటికి రాని పరిస్థితుల నుంచి పచ్చళ్ల వ్యాపారాన్ని ఏర్పాటు చేసి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఆమె ఎదిగారు. ఆమె తయారు చేస్తున్న వాటికి ఎంతలా డిమాండ్ ఉందంటే, దేశంలోని వివిధ ప్రాంతాల్లోనే కాకుండా విదేశాల నుంచి సైతం ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె వ్యాపారం సోషల్ మీడియాలోనూ వైరల్గా మారుతోంది.
జీవనాధారం దృష్ట్యా : సుహాసిని ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు. జీవనాధారం, ఇంట్లో ఖర్చులు కోసం రొయ్యల పచ్చడి తయారు చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా చుట్టుపక్కల వారికి కూడా వాటిని అమ్మడం ప్రారంభించారు. పచ్చళ్లు తీసుకున్న వారి నుంచి మంచి స్పందన, బాగున్నాయని అభినందనలు కూడా వచ్చాయి. ఇలా వారు మరిన్ని ఆర్డర్లు ఇవ్వడంతో చికెన్, మటన్, చేప వంటి మాంసాహార పచ్చళ్లు తయారు చేయడం మొదలుపెట్టారు. స్వయంగా ఇంట్లో తయారుచేసిన పచ్చుళ్లు కావడంతో మెల్లగా ఆమె బ్రాండ్ పాపులర్ అయిపోయింది. ఈరోజు ఆమె తయారు చేసిన పచ్చళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకే కాకుండా విదేశాలకు కూడా సరఫరా అవుతోంది.
దేశ విదేశాలకు సుహాసిని పచ్చళ్లు : భర్త, పిల్లల సహకారంతో వాట్సప్ గ్రూపుల ద్వారా ప్రచారం, ఎక్స్‌పోల్లో స్టాళ్లు ఏర్పాటు చేయడం వంటి అనేక పనులు చక్కబెడుతున్నారు. స్నేహితులు, తెలిసినవారి ద్వారా ఈ పచ్చళ్ల రుచులు ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు వ్యాపించాయి. నరసరావుపేట, చిత్తూరు, నెల్లూరు, మహారాష్ట్ర, తమిళనాడు ఇలా అనేక రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. క్రమంగా సౌది, అమెరికా, యూకే వంటి దేశాలకు పంపిస్తున్నారు. విజయవాడ ఉత్సవ్, కలెక్టరేట్ ఆవరణలో తాజాగా వైజాగ్ పారిశ్రామిక సదస్సులో సుహాసిని ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఏడాదికి రూ.10లక్షలకు పైగా టర్నోవర్ : పారిశ్రామిక సదస్సులో స్టాళ్లు ఏర్పాటు చేయడంతో సుహాసిని పచ్చళ్లకు మరింత ప్రాచుర్యం వచ్చింది. ప్రస్తుతం నెలకు 200 కేజీలకు పైగా పచ్చళ్లను అమ్ముతున్నారు. అంతేకాకుండా వీటితో పాటు ప్రోటీన్ లడ్డూ, పల్లీలు, కొబ్బరి, నువ్వులు, కరివేపాకు, మునగాకుతో చేసిన కారప్పొడులు, పప్పుల పొడి వంటివి తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏడాదికి రూ.10లక్షలకు పైగా టర్నోవర్ సాధిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.వెలుగు సంఘాల చేయూత, సీఎం స్ఫూర్తి, భర్త, పిల్లల ప్రోత్సాహంతోనే ఇవన్నీ సాధించగలుగుతున్నానని, చేయగలుగుతున్నానని సుహాసిని చెబుతున్నారు. నేటి తరం మహిళలకు సుహాసిని నిజంగా ఒక స్ఫూర్తి. కష్టపడే తత్వం, లక్ష్యం, మంచి ఆలోచన ఉంటే సామాన్య మహిళ కూడా వ్యాపారవేత్తగా ఎలా ఎదగవచ్చో, ఎలా సాధించవచ్చో ఆమె నిరూపించారు.
యూనిఫామ్ వేసుకునే అవకాశం రాలేదు కానీ సైనికుడికి ఆయుధాన్ని అందించే స్థాయికి ఎదిగింది 'ఆమె'
రికార్డు స్థాయిలో తిరుమల లడ్డూల విక్రయం - నాణ్యత, రుచి పెరగడంపై భక్తులు హర్షం

