ETV Bharat / state

ఇరుసుమండ బ్లో అవుట్‌ ఎఫెక్ట్ - 4 గ్రామాలకు ఇబ్బందులు, ఇంటింటా సర్వే

బ్లో అవుట్ నియంత్రణకు ఇంకా వారం రోజుల సమయం పడుతుందన్న ఓఎన్‌జీసీ డైరెక్టర్ విక్రమ్ సక్సేన - మంటలవల్ల నష్టపోయిన బాధితుల వివరాలను నమోదు చేస్తున్నామన్న కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్

Irusumanda Blowout Incident Updates
Irusumanda Blowout Incident Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 7, 2026 at 10:32 PM IST

3 Min Read
Choose ETV Bharat

Irusumanda Blowout Incident Updates : కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ గ్రామంలో ఏర్పడిన బ్లో అవుట్ నియంత్రణకు ఇంకా వారం రోజుల సమయం పడుతుందని ఓఎన్‌జీసీ టెక్నాలజీస్ అండ్ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేన వెల్లడించారు. అమెరికాకు సంబంధించిన ఒక సంస్థతో దీనిపై అగ్రిమెంట్ జరిగిందని 3 రోజుల్లో ఆ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి నియంత్రణ చర్యలు చేపడతారని ఆయన తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, రాజోలు శాసనసభ్యుడు దేవ వరప్రసాద్​లతో కలిసి బ్లో అవుట్ ఘటన వివరాలను ఆయన వెల్లడించారు. 6 నుంచి 7 రోజులు వ్యవధిలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చి దానిపై వెల్ క్యాప్ చేస్తామని విక్రమ్ సక్సేన స్పష్టం చేశారు.

ఇరుసుమండ బ్లో అవుట్‌ ఎఫెక్ట్ - 4 గ్రామాలకు ఇబ్బందులు, ఇంటింటా సర్వే (ETV Bharat)

నష్టపోయిన బాధితుల వివరాలు నమోదు : మరోవైపు బ్లోఅవుట్‌ వల్ల ఎగసిపడిన మంటలవల్ల నష్టపోయిన బాధితుల వివరాలను సిబ్బంది నమోదు చేస్తున్నారని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అలాగే బ్లో అవుట్ కారణంగా ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదని రాజోలు శాసనసభ్యుడు దేవ వరప్రసాద్ అన్నారు. అనుకోని సంఘటనలు జరుగుతుంటే దూరప్రాంతాలకు వైద్యం కోసం వెళ్లవలసి వస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఓఎన్‌జీసీ స్వయంగా రాజోలు నియోజకవర్గం లక్కవరంలో 25 కోట్ల రూపాయలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇలా చేయడం ద్వారా ఓఎన్‌జీసీ బ్రాండ్ ఇక్కడ నిలబడుతుందన్నారు.

"ఇరుసుమండ వద్ద జరిగిన బ్లో అవుట్ ఘటన మంగళవారం సాయంత్రానికి అంత మన కంట్రోల్​లోకి వచ్చింది. ఈ బ్లో అవుట్ వల్ల 4 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం వారంత సొంత ఇళ్లకు వెళ్తున్నారు. ఇంకా సమస్యలు ఉంటే అక్కడి ప్రజలతో మాట్లాడి పరిష్కరిస్తున్నాం. ప్రస్తుతం ఘటన కారణంగా నష్టపోయిన వివరాలను నమోదు చేస్తున్నాం." - ఆర్.మహేష్ కుమార్, కోనసీమ జిల్లా కలెక్టర్

తగ్గిన మంటల తీవ్రత : ఓఎన్‌జీసీ బ్లో అవుట్ నుంచి మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. గత 2 రోజులు కంటే ఈరోజు మంటల తీవ్రత తగ్గింది. 400 జీపీఎం సామర్థ్యం గల భారీ పంపు యంత్రంతో మంటలపై నీటిని నిరంతరాయంగా పంపుతున్నారు. డ్రిల్ సైటులో కాలిపోయిన వివిధ సామాగ్రిని అక్కడి నుంచి బయటకు తరలిస్తున్నారు. బ్లో అవుట్ జరిగిన డ్రిల్ సైట్​కు వెళ్లే విధంగా రహదారిని ఏర్పాటు చేశారు. అలాగే వివిధ యంత్రాలను అందుబాటులో ఉంచారు. సంబంధిత అధికారులు అక్కడే ఉండి మంటల అదుపు ప్రక్రియను పరిశీలిస్తున్నారు.

అంబ్రిల్లా తరహాలో వెదజల్లుతున్న నీరు : మరోవైపు పైపుల సాయంతో గూడవల్లి పంట కాల్వ నుంచి నీటిని మళ్లించి మంటల్ని ఆర్పేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. వాటర్ అంబ్రిల్లా తరహాలో నిరంతరం నీటిని వెదజల్లుతున్నారు. ఫలితంగా మండుతున్న రిగ్‌ వద్ద ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతోంది. మరోవైపు ప్రమాదస్థలం వద్ద కాలిన వస్తువులు, వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. దిల్లీ నుంచి పెట్రోలియం మంత్రిత్వశాఖ అధికారులు, ONGC క్రైసిస్ మేనేజ్‌మెంట్‌ సభ్యులు బ్లోఅవుట్‌ చోటుచేసుకున్న ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.

కిలోమీటర్ పరిధిలో ఇంటింటా సర్వే : అలాగే బ్లోఅవుట్‌ ప్రాంతానికి వెళ్లేందుకు అత్యవసర రహదారిని ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రూ.8 లక్షలతో రహదారి ఏర్పాటు చేశారు. అలాగే బ్లోఅవుట్ ప్రాంతంలో కిలోమీటర్ పరిధిలో ఇంటింటా సర్వే నిర్వహించారు. ఈ ఇంటింటా సర్వే చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను అధికారులు నియామించారు. అదేవిధంగా పంట నష్టం వివరాలను వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే కాలుష్య నియంత్రణ శాఖ నీరు, గాలి కాలుష్యం వివరాలను పరిశీలించింది.

ఆహార పంపిణీ, ఇతర మౌలిక సదుపాయాలు : సోమవారం గ్యాస్‌ లీక్‌ అవుతున్న విషయాన్ని ఇరుసుమండ గ్రామంలోని కొందరు చిన్నారులు ముందే గుర్తించారు. వారే వీధుల్లోకి వెళ్లి ప్రజల్ని అప్రమత్తం చేశారు. విపరీతమైన గ్యాస్‌ వాసన రావడం వల్ల బయటకు పరుగులు పెట్టి ప్రాణాలు కాపాడుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. రెండు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బ్లోఅవుట్‌ బాధితులకు స్థానిక ప్రజాప్రతినిధులు ఆహార పంపిణీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చాక ప్రస్తుత బావిని శాశ్వతంగా మూసివేసి కొత్త రిగ్‌ను ఏర్పాటు చేసేందుకు ONGC అధికారులు నిర్ణయించారు.

'నిక్షేపాల అన్వేషణలో తలమునకలైన సిబ్బంది' - వెలుగులోకి బ్లోఅవుట్‌ ముందు దృశ్యాలు

'ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి' - ఇరుసుమండ బ్లోఅవుట్​పై సీఎం చంద్రబాబు సమీక్ష