సీమ ప్రగతికి కేంద్రాలుగా ఓర్వకల్లు, కొప్పర్తి నడవాలు - రూ.వేల కోట్ల పెట్టుబడులు
కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి చర్యలు చేపట్టిన కూటమి ప్రభుత్వం - లక్షలాది మంది స్థానికులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా అడుగులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 17, 2025 at 8:50 PM IST
Government on Kopparthi and Orvakal Industrial Corridors : పెట్టుబడులను ఆకర్షించాలి! యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి! అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలి! పారిశ్రామికవేత్తలందరికీ ఏపీనే గమ్యస్థానం అవ్వాలి! వీటన్నింటికి తోడు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ పోవాలి! ఇదే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యం. అందుకే రాష్ట్రాభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అవకాశాలను సృష్టించుకుంటోంది. రెట్టింపైన స్పీడులో పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
అందులో భాగంగానే పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్లు కూడా అందులో భాగమే. వేల ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తోన్న కూటమి సర్కారు పరిశ్రమల స్థాపనతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు చూపడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరి కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్లతో ఎన్ని లక్షల ఉద్యోగాలు రానున్నాయి? ఎన్ని వేల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉంది? ఇందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?
లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు : కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్లతో ఆయా ప్రాంతాల అభివృద్ధితో పాటు లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి. పెట్టుబడుల ఆకర్షణకే అధిక ప్రాధాన్యతిస్తోన్న కూటమి ప్రభుత్వం వీలైనన్ని ఎక్కువ పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానించేడమే లక్ష్యంగా పెట్టుకుంది. పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి పరిచి వాటిల్లో పరిశ్రమలు స్థాపించేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోంది. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించ వచ్చనేది ప్రభుత్వ భావన. అందుకే మొన్న ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నేడు మరిన్ని పరిశ్రమలను ఆహ్వానించేలా కారిడార్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసింది.
ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 4 వేల 9 వందల 20 కోట్లతో చేపట్టే పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో రహదారుల నిర్మాణం, నీటి వసతులు, సహా ఇతర మౌలిక వసతుల కల్పన పనులు చెపట్టనున్నారు. ఒక్క కొప్పర్తిలోనే 2 వేల కోట్ల రూపాయలతో 2 వేల 596 ఎకరాలను అభివృద్ధి చేయనున్నారు. మొత్తంగా ఈ రెండు కారిడార్లలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
తెరపైకి మెగా ఇండస్ట్రీయల్ హబ్ : కర్నూలు జిల్లాలో అపారమైన వనరులు ఉన్నా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక వేలాది మంది పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఓర్వకల్లు మెగా ఇండస్ట్రీయల్ హబ్- ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఓర్వకల్లు వద్ద పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీనికి ఓర్వకల్లు మండలంలోనే 22 వేల ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. APIICకి 13,830 ఎకరాలు కేటాయించింది. గట్టుపాడు వద్ద ప్రతిపాదించిన ఉత్తర, దక్షిణ క్లస్టర్లలో 2,471 ఎకరాల్లో ప్రతిపాదించిన క్లస్టర్‌ను APIIC ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీనికి రూ.2,870.39 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందులో సుమారు 1,754 ఎకరాలు పారిశ్రామిక అవసరాలకు కేటాయించనుంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నత్తనడకన సాగిన ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ పనులు కూటమి ప్రభుత్వం రాకతో ఊపందుకున్నాయి. ఓర్వకల్లు మండలం గుట్టపాడు సమీపంలోని జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ పనులూ చకచకా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో ఈ కంపెనీ పనులు నత్తను తలపించాయి. 2.2 మిలియన్ టన్నుల ఉక్కు తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సదరు సంస్థ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పరిశ్రమలోనే 3,200 మందికి ప్రత్యక్షంగా, 12 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయంటే అతిశయోక్తి కాదు.
4,700 ఎకరాల్లో అభివృద్ధి : ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ అభివృద్ధికి కేంద్రం కూడా ముందుకొచ్చింది. మొదటి దశలో 2,600 ఎకరాల్లో, రెండో దశలో 2,100 ఎకరాల్లో మొత్తం కలిపి 4,700 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రోడ్లు, డ్రైనేజీలు, నీటి వసతి, విద్యుత్ తదితర మౌళిక వసతులు కల్పించనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో MSMEపార్కు అభివృద్ధికి రూ.2,786 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. తద్వారా రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
దేశంలోనే మొట్టమొదటి చిప్ తయారీ సెమీకండక్టర్ పరిశ్రమ ఓర్వకల్లులో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇండిచిప్ సెమీకండక్టర్స్ లిమిటెడ్ సంస్థ తన భాగస్వామ్య సంస్థ అయిన జపాన్‌కు చెందిన మైక్రో టెక్నాలజీ కంపెనీతో కలిసి స్థాపించనున్నారు. రూ.14 వేల కోట్లకుపైగా పెట్టుబడులతో పరిశ్రమ స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమకు అవసరమైన 130 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. భూమిని సైతం ఓర్వకల్లు సమీపంలో గుర్తించారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 2 వేల మందికి, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
1.76 లక్షల మందికి ఉపాధి అవకాశాలు : చెన్నై కారిడార్‌లో భాగంగా కొప్పర్తిని పారిశ్రామిక హబ్‌గా కేంద్ర ప్రభుత్వం ఇది వరకు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గతంలో నిధులు కేటాయించింది. ఈ నిర్ణయంతో అతిపెద్ద కంపెనీలు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లో పరిశ్రమలను స్థాపించనున్నాయి. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.76 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి.
రూ.17,310 కోట్ల పెట్టుబడులు : ఐదేళ్ల కిందటే విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్-VCICలో భాగంగా కొప్పర్తిని అభివృద్ధి చేయాలని కేంద్రం భావించినా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సహకారం లేకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు. కానీ, సీఎం చంద్రబాబు తీసుకున్న చొరవతో రాయలసీమ నడి బొడ్డున ఉన్న కడప శివారులో కమలాపురం నియోజకవర్గంలో పెండ్లిమర్రి, సీకేదిన్నె, వల్లూరు మండలాల్లోని 6 గ్రామాల పరిధిలో 6,740.44 ఎకరాల్లో కారిడార్ ఏర్పాటైంది. రూ.17,310 కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ కొప్పర్తి పారిశ్రామిక నోడ్‌గా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా రవాణా మార్గాలు, ఉపాధి అవకాశాలతో జిల్లా సహా పాటు పరిసర ప్రాంతాల దశ మారనుంది.
ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లతో అభివృద్ధితో కడప, కర్నూలు జిల్లాలకు మంచి రోజులు రానున్నాయి. వృథాగా పడి ఉన్న వేలాది ఎకరాల్లో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టనుంది. ఫలితంగా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
మూడు చోట్ల పారిశ్రామిక క్లస్టర్లు : రాష్ట్రంలో ఓర్వకల్లు, కొప్పర్తి, పామూరుల్లో రూ.7,949.48 కోట్లతో ఏపీఐఐసీ ద్వారా పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం హడ్‌కో, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ల నుంచి రూ.7,500 కోట్లు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో రూ.5 వేల కోట్లు రుణంగా ఇచ్చేందుకు హడ్కో ఇప్పటికే అంగీకరించింది. ఈ రుణానికి ప్రభుత్వం హామీ ఇవ్వనుంది. ఓర్వకల్లు, కొప్పర్తిల్లో ప్రతిపాదించిన నోడ్‌లలో కొంత భాగాన్ని జాతీయ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి పథకం, గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ నగరాల పథకం కింద కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తోంది. అదిపోనూ మిగిలిన విస్తీర్ణాన్ని ఏపీఐఐసీ ద్వారా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. దీనికోసం ఏపీ స్టేట్ స్పెషల్ ప్రాజెక్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌పీడీసీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
పరిశ్రమల కోసం 5,880 ఎకరాలు : మూడుచోట్ల పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయడం ద్వారా సుమారు 5,880 ఎకరాలు పరిశ్రమలకు కేటాయించేందుకు అందుబాటులోకి రానున్నాయి. వీటి అభివృద్ధికి అవసరమైన నిధుల్లో రూ.5 వేల కోట్లు రుణంగా తీసుకుని మిగిలిన మొత్తాన్ని పరిశ్రమలకు భూములు విక్రయించడం ద్వారా సర్దుబాటు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాధ్యమైనంత మేర వడ్డీ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది.
ఆ పనులు ఏపీఐసీడీసీకి అప్పగింత - ప్రభుత్వ కీలక నిర్ణయం
లక్షల ఉద్యోగాల దిశగా రాయలసీమ - ఓర్వకల్లు, కొప్పర్తి కారిడార్లకు శంకుస్థాపన

