పేద మహిళలతో పాటు ఉద్యోగినులకు భరోసా - శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం
ఉద్యోగినులు, కూలి పనులు చేసుకునే మహిళల చిన్నారుల సంరక్షణ - తొలిదశలో విశాఖ, విజయవాడ, తిరుపతిలో ప్రయోగాత్మకంగా 15 కేంద్రాలు - స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రభుత్వం

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 3, 2026 at 8:50 AM IST
Coalition Government Come Forward to Take Responsibility Over Childcare: పేద మహిళలతో పాటు ఉద్యోగినులకు భరోసా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. చిన్నారుల సంరక్షణ బాధ్యతను భుజాన వేసుకుని కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తల్లికి ఉపశమనం పిల్లలకు సురక్షిత భవిష్యత్ లక్ష్యంతో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. తల్లికి ధైర్యం, చిన్నారికి రక్షణ, కుటుంబానికి ఆదాయం వంటి మూడు లక్ష్యాలను ప్రధాన ఉద్దేశంగా ముందుకు సాగుతోంది.
తిరుపతిలో ప్రయోగాత్మకంగా 5: రాష్ట్రంలో తొలిసారిగా శిశు సంరక్షణ కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగినులు, కూలి పనులు చేసుకునే మహిళల చిన్నారుల సంరక్షణకు ఈ కేంద్రాలు పెద్ద ఊరటగా నిలవనున్నాయి. విశాఖ, విజయవాడ, తిరుపతిలో ప్రయోగాత్మకంగా ఐదు చొప్పున మొత్తం 15 కేంద్రాలను తొలిదశలో ఏర్పాటు చేయనున్నారు. వీటిని స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య పరీక్షలు, టీకాలు వంటి సేవలను సమగ్రంగా అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ జారీ చేసింది.
పూర్తిగా ఉచిత సేవలు: ప్రతి నగరంలోనూ ఐదు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా అందులో రెండు మురికివాడల్లో, మిగిలిన మూడు మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలను ఈ కేంద్రాల్లో చేర్చుకుంటారు. ఒక్కో కేంద్రంలో 25 మంది చొప్పున మొత్తం 375 మంది చిన్నారులకు సంరక్షణ అందించనున్నారు. మురికివాడల్లో ఏర్పాటు చేసే కేంద్రాల్లో పేద మహిళల పిల్లలకు పూర్తిగా ఉచిత సేవలు అందించనున్నారు. మధ్యతరగతి కుటుంబాల కోసం ఏర్పాటు చేసే కేంద్రాల్లో మాత్రం అందుబాటు ధరల్లో స్వల్ప ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ విధంగా అన్ని వర్గాల వారికీ ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు.
విముక్తి : కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం ఏడాదికి దాదాపు కోటీ 50 లక్షలు ఖర్చు చేయనుంది. ప్రతి కేంద్రంలోనూ ముగ్గురు సహాయకులను నియమించనున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎమ్లు, పట్టణ ఆరోగ్య సిబ్బందినీ ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. కేంద్రాల ద్వారా ఉద్యోగినులు ప్రసవానంతరం త్వరగా తమ పనుల్లోకి తిరిగి చేరే అవకాశం ఉంటుంది. అలాగే పేద మహిళలు పిల్లల సంరక్షణ బాధ్యత నుంచి విముక్తి పొంది తిరిగి ఉపాధి కోసం వెళ్లగలుగుతారని ప్రభుత్వం భావిస్తోంది.
కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా- 16కు చేరిన మృతుల సంఖ్య
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల లోటు - ఫ్యాన్లు, ఏసీల కొరతతో తీవ్ర ఇబ్బందులు

