రాజమహేంద్రవరం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు సాయం - అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు
కల్తీ పాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై అధికారులతో సమీక్ష - సీఎం సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ అధికారులు - ఘటనపై వివరాలు తెలుసుకున్న సీఎం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 23, 2026 at 1:22 PM IST
|Updated : February 23, 2026 at 7:09 PM IST
CM Review on Kidney Disease in Rajamahendravaram : రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో స్థానికులు అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. లాలాచెరువు ప్రాంతంలో నలుగురు చనిపోయారని, 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వరలక్ష్మి డెయిరీకి చెందిన కల్తీ పాల వల్లే పలువురు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్థారణ అయిందని పేర్కొన్నారు. సెక్షన్ 194 కింద బాధ్యులపై కేసు నమోదు చేశామన్నారు.
అంతకుముందు కల్తీ పాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. అనారోగ్యం బారిన పడిన, మరణించిన ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న వైద్యసాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు వివరించారు. చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని సీఎం సూచించారు.
''కిమ్స్ ఆస్పత్రి సమాచారం ప్రకారం వాంతులు, కడుపునొప్పితో వచ్చారు. మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యలతో ఆస్పత్రులకు వచ్చారు. వీరంతా లాలాచెరువు ప్రాంతంలోని చౌడేశ్వరీనగర్, స్వరూప్‌నగర్ వాసులు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా, సీరం, క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. వెంటనే నమూనాలు తీసుకొని ల్యాబ్‌లకు పంపారు. కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలోని వరలక్ష్మి మిల్క్ డెయిరీ నుంచి 106 మందికి పాల సరఫరా అయింది. వరలక్ష్మి మిల్క్ డెయిరీ నుంచి వచ్చిన పాలే ఈ అస్వస్థతకు కారణమని నిర్ధరించారు''. - సీఎం చంద్రబాబు
రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో విక్రయదారులు 106 ఇళ్లకు పాలు పంపిణీ చేస్తున్నారని అధికారులు వివరించారు. పాలు వినియోగించిన కుటుంబాల్లోని 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని అధికారులు తెలిపారు. మిగిలిన అందరి నుంచి శాంపిల్స్ తీసుకుంటున్నామన్నారు. పాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపామని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలతో పాటు ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. ఫలితాల అనంతరం విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రాజమహేంద్రవరం వెళ్లాలని ఆదేశించారు.
ఇంటింటి సర్వే కొనసాగుతోంది: రాజమహేంద్రవరంలో అనూరియా (మూత్రం ఆగిపోవడం) మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో కొంతమంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ఆరోగ్యశాఖ, నగరపాలక అధికారులు ఇంటిటా సర్వే చేపట్టినట్లు క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు.
కల్తీ పాలన ఆరోపణల నేపథ్యంలో పాలు పోసే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 42 మంది రైతుల నుంచి పాల సేకరణ జరుగుతోందని, పశువులు, వాటి ఆహారం శాంపిల్స్ సేకరించినట్లు కీర్తి చేకూరి చెప్పారు. పాల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పాలు, పెరుగు శాంపిళ్లను ఫుడ్ సేఫ్టీ విభాగం సేకరించిందని అన్నారు. స్థానికుల్లో ఏ లక్షణాలున్నా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ భరోసానిచ్చారు. ఏ లక్షణాలున్నా 94940 60060 ద్వారా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయవచ్చునని కలెక్టర్ తెలిపారు.
"ఇప్పటివరకు 73 శాంపిల్స్ సేకరించాం. ఇవాళ సాయంత్రానికి ఫలితాలు వస్తాయి. ఇంటింటి సర్వే కొనసాగుతోంది. ఎలాంటి లక్షణాలున్నా చికిత్స ఆందిస్తున్నాం. 42 మంది రైతుల నుంచి పాల సేకరణ జరుగుతోంది. పశువులు, వాటి ఆహారం శాంపిల్స్ సేకరించాం. పాలు, పెరుగు శాంపిళ్లను ఫుడ్ సేఫ్టీ విభాగం సేకరించింది. ఇప్పటివరకు నలుగురు మరణించారు. తాడి కృష్ణవేణి, తాడి రమణి, రాధాకృష్ణమూర్తి, శేషగిరిరావు మరణించారు. 8 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంటింటికి వెళ్లి రక్త నమూనాల సేకరణ కొనసాగుతోంది.'' - కీర్తి చేకూరి, జిల్లా కలెక్టర్
నాలుగుకు చేరిన అనూరియా మృతులు: ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఇద్దరు మృతి చెందారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రుల్లో పలువురికి చికిత్స చేస్తున్నారు. కలుషిత పాలు తాగి అస్వస్థతకు గురై బాధితులు ఆస్పత్రిలో చేరారు. రాజమహేంద్రవరం ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఘటన జరిగిన ప్రాంతాల్లో పాలు, నీరు, ఇతర నమూనాల సేకరణించారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు అధికారులు ఏర్పాటు చేశారు. ఘటనపై ఆరోగ్యశాఖ, నగరపాలక అధికారులు ఇంటింటా సర్వే చేపట్టారు.
శాంపిళ్ల సేకరణ జరుగుతోంది: ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించి సమీక్షలు చేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. పాలు సరఫరా చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. అనధికారికంగా నడుపుతున్న డెయిరీని సీజ్ చేశామని పేర్కొన్నారు. విజయవాడ నుంచి కూడా నిపుణులు వచ్చారని తెలిపారు. శాంపిళ్ల సేకరణ జరుగుతోంది. వాటి ఫలితాలు వచ్చాక మరిన్ని వివరాలు వస్తాయన్నారు.

