ETV Bharat / state

వడ్లు కొనకపోతే జూన్‌ 15 తర్వాత కేంద్రంపై యుద్ధమే: కాగజ్​నగర్​ సభలో సీఎం రేవంత్​రెడ్డి

తండాలు, గూడెల్లో ఉన్న ఆదివాసీలకు వంద శాతం ఇల్లు ఇవ్వాలని సీఎం ఆదేశం - గూడెం ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని హామీ - సేకరించిన ధాన్యం కొనకపోతే కేంద్రంపై యుద్ధమేనని ప్రకటన

CM Revanth Reddy
CM Revanth Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 1, 2026 at 8:51 PM IST

|

Updated : June 1, 2026 at 9:17 PM IST

3 Min Read
Choose ETV Bharat

CM Revanth Sanctions Indiramma Houses : రబీ సీజన్​లో రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వడ్లు కొనకపోతే జూన్‌ 15 తర్వాత కేంద్రంపై యుద్ధమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో పర్యటించిన సీఎం.. కోఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. అర్హులైన అందరూ ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవాలని సూచించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్​ను ఆవిష్కరించారు. నెలరోజుల్లో ఇల్లు నిర్మాణం చేసుకొనేలా కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి తెలిపారు. అనంతరం కాగజ్​నగర్​ సభకు హాజరయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లాకు గతంలో అన్యాయం జరిగిందని, తాను సీఎం అయ్యాక జిల్లాను అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చామని.. అందులో భాగంగానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

ఆదివాసీలకు వందకు వంద శాతం ఇల్లు : ఇందిరమ్మ ఇల్లు మహిళ ఆత్మగౌరవమన్న సీఎం.. గూడెల్లో ఉన్న పేదలకు 21 వేల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇల్లు ఇంకా పూర్తిస్థాయిలో రాలేదని కొందరు చెప్పారని.. తండాలు, గూడెల్లో ఉన్న ఆదివాసీలకు వందకు వంద శాతం ఇల్లు ఇవ్వాలని ఆదేశాలిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని స్పష్టం చేశారు.

తల తాకట్టు పెట్టైనా నిధులు ఇస్తా : గూడెల్లో గుడిసెలు ఉండకూడదని, పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికష్టాలున్న ఇందిరమ్మ బిల్లు గంట కూడా ఆగకుండా చూసుకుంటున్నట్లు చెప్పిన రేవంత్​రెడ్డి.. తల తాకట్టు పెట్టైనా నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మరో రెండున్నర లక్షల ఇళ్లను నూతనంగా మంజూరు చేస్తున్నట్లు వేదికపై నుంచే ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ప్రకటన చేశారు. గూడెం ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని స్పష్టం చేశారు.

"ఆదివాసీ గూడెలు, తండాల్లో గుడెసెలు కనిపించకూడదు. ఏడాది లోగా ఐటీడీఏ సహకారంతో ఆదివాసీలు, గిరిజనులందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూలు చేస్తాం. వారంతా గౌరవంగా బతికేలా చేస్తాం. వారికి ఇళ్లు మంజూరు చేయడమే కాదు, ఇంటి నిర్మాణం కోసం కూడా సహకరిస్తాం. ఆదిలాబాద్‌లో సెప్టెంబర్‌ 17న మరో లక్ష గృహప్రవేశాలు చేస్తాం" - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

కిషన్ రెడ్డికి సీఎం విజ్ఞప్తి : కాళేశ్వరంలో పెట్టిన రూ.లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయాయని సీఎం విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఆదిలాబాద్‌లోని ప్రాజెక్టులను మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. తుమ్మడిహట్టి నిర్మించి ఆదిలాబాద్‌లోని 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తుమ్మడిహట్టి నిర్మాణం కోసం మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసినా.. ఇప్పటి వరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు సమస్య వస్తే మహారాష్ట్రకు నష్టం వస్తుందని సీఎం చెప్పారు. ఈ విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జోక్యం అవసరం అన్నారు. కిషన్ రెడ్డి దూతగా వ్యవహరించి మహారాష్ట్ర సీఎంతో మాట్లాడి తుమ్మడిహట్టి కోసం కావాల్సిన 2వేల ఎకరాలు ఇప్పించాల్సిగా సీఎం విజ్ఞప్తి చేశారు.

ఆ బాధ్యత కేంద్రానిదే : ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్న ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సేకరించే బాధ్యత తమదని, వాటిని కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 62 లక్షల క్వింటాల వడ్లు కొనుగోలు చేశామని, మొత్తం 75 లక్షల క్వింటాల వడ్లు కొంటామన్నారు. ఒకవేళ కేంద్రం ముందుకురాకుంటే ఆందోళన తప్పదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

"ధాన్యాన్ని సేకరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. వాటిని కొనే బాధ్యత కేంద్రానిది. జూన్ 15 నాటికి 75లక్షల క్వింటాళ్ల వడ్లు కొంటాం. ఆ తరువాత వాటిని కొనే బాధ్యత కేంద్రానిదే. రాష్ట్రం సేకరించే 75లక్షల క్వింటాళ్ల వడ్లు, 20 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న, జొన్నలు అన్నీ కేంద్రం కొనుగోలు చేయాల్సిందే. జూన్ 15 వరకు ఇది జరగకుంటే మా కార్యాచరణ ప్రకటిస్తాం" - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

Last Updated : June 1, 2026 at 9:17 PM IST