ETV Bharat / state

హైదరాబాద్‌ మెట్రోపై నిర్ణయాల అమలులో జాప్యం - కేంద్రమంత్రులకు సీఎం రేవంత్​రెడ్డి లేఖలు

గత నెలలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు కావడం లేదన్న సీఎం - వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి - జాప్యంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుందని ఆందోళన

CM LETTER TO UNION MINISTERS
CM LETTER TO UNION MINISTERS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : July 5, 2026 at 3:09 PM IST

|

Updated : July 6, 2026 at 8:22 AM IST

3 Min Read
Choose ETV Bharat

CM Revanth Reddy Letters To Union Ministers : హైదరాబాద్‌ మెట్రో రైలు నిర్ణయాల అమలులో జాప్యంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎస్​బీఐ క్యాప్స్ మదింపు నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ అనే నిర్ణయం కారణంగా అటు ప్రతిపాదిత కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం ఇటు రెండో దశ డీపీఆర్ అంచనాలు సైతం భారీగా పెరగనున్నాయి. దీంతో దిల్లీ భేటీలో నిర్ణయాల మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదివారం కేంద్రమంత్రులు మనోహర్​లాల్ ఖట్టర్‌, కిషన్‌రెడ్డిలకు లేఖలు రాశారు.

ట్రాఫిక్‌ చిక్కుల నుంచి హైదరాబాద్ వాసులను ఆదుకుంటున్న మెట్రో ప్రాజెక్టు విస్తరణకు అడుగులు వేగంగా ముందుకు పడటం లేదు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశ స్వాధీన ప్రక్రియ, రెండో దశకు అనుమతుల ప్రక్రియపై కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడిని పెంచుతోంది. ఈ మేరకు మెట్రో ప్రాజెక్టులపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిలకు సీఎం రేవంత్‌రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. జూన్‌ 23న రైల్వే మంత్రి, జూన్‌ 24న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సమక్షంలో జరిగిన సమావేశాల్లో మెట్రో రైలుపై అధ్యయన బాధ్యతలు ఎస్​బీఐ క్యాప్స్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాలపై ఇప్పటికీ విధివిధానాలు ఖరారు కాకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్రం బాధ్యతలు ఇవ్వలేదు : మెట్రో ఫేజ్‌-1 టేకోవర్, ఫేజ్‌-2 విస్తరణ ఆర్థికంగా ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని సీఎం లేఖలో తెలిపారు. అందువల్లే ఆస్తుల విలువ, రీఫైనాన్సింగ్, భవిష్యత్‌ రుణాల సమీకరణ అంశాలను సమగ్రంగా రెండు దశలను కలిపి పరిశీలించాలని మంత్రులతో సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నట్లు గుర్తుచేశారు. ఈ ప్రక్రియకు సమన్వయ అధికారిగా తెలంగాణ తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఇప్పటికే నియమించామని సీఎం స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు కేంద్రం ఎస్‌బీఐ క్యాప్స్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించలేదని టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ కూడా ఖరారు చేసి పంపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

దీని ఫలితంగా ఫేజ్‌-1 టేకోవర్‌ ప్రక్రియలో అనిశ్చితి ఏర్పడటమే కాకుండా రోజువారీ నిర్వహణలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అదే సమయంలో ఫేజ్‌-2 డీపీఆర్‌లకు ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియ ఆలస్యమవుతోందని వివరించారు. ప్రాజెక్టు అమలులో మరింత జాప్యంతో మెట్రో ఫేజ్‌-2 మొత్తం ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉందని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని సీఎం కోరారు. కేంద్రంలో వివిధ శాఖల మధ్య సమన్వయం విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరో 5 శాతం భారం : రూ.43 వేల కోట్ల పైచిలుకు అంచనాతో మెట్రో రెండో దశ డీపీఆర్​ను రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి పంపించింది. ఇప్పుడు రెండో దశ విస్తరణను ఎస్​బీఐ క్యాప్స్‌తో మదింపు చేయాలన్న నిర్ణయంతో మరోసారి డీపీఆర్​ను రూపొందించనున్నారు. అంటే ప్రస్తుతం అంచనా విలువ మరో 5 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. మెట్రో రైలు స్వాధీన ప్రక్రియ త్వరగా ముగిస్తే రద్దీకి అనుగుణంగా కొత్త కోచ్‌లను కొనుగోలు చేయాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ప్రణాళికలు రూపొందించింది. 60 కొత్త కోచ్‌ల కోసం బెంగళూరులోని 'భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్'తో చర్చలు కూడా జరిగాయి. కానీ స్వాధీన ప్రక్రియలో జాప్యం, ఎస్​బీఐ క్యాప్స్‌ మదింపు, ప్రస్తుత రుణాన్ని బదిలీ చేసుకునేందుకు తక్కువ వడ్డీ రేట్లను అందించే రుణ సంస్థను గుర్తించి ప్రక్రియ పూర్తి చేసేందుకే ఏడాది సమయం పడుతుందని మెట్రో అధికారులు అంతర్గత అంచనాకు వచ్చారు. అంటే అప్పటి వరకు కొత్త కోచ్‌ల కొనుగోలు కూడా ఆగిపోనుంది. అంతేకాకుండా ఆర్డర్ ఇచ్చిన తర్వాత డెలివరీకి 15 నెలల సమయం పడుతుందని తయారీ సంస్థ పేర్కొంది. ఫలితంగా కొత్త బోగీల ఆశలు కూడా మరో రెండేళ్లపాటు పోతాయని భావిస్తున్నారు.

మెట్రో రైలు విస్తరణకు సహకరించండి : కేంద్ర రైల్వే మంత్రిని కోరిన సీఎం

తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలి - మోదీకి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి

Last Updated : July 6, 2026 at 8:22 AM IST