పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే - పాలమూరు పచ్చనిపైరే
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలమే - సీఎం రేవంత్ రెడ్డి పుట్టినగడ్డపై ప్రేమ కురిపిస్తారని ఆశగా చూస్తున్న ప్రజలు - 18 లక్షల ఎకరాలకు నీరందిస్తే పాలమూరు పచ్చనిపైరే

Published : June 4, 2026 at 9:16 AM IST
Pending Works in Palamuru Ranga Reddy Lift Irrigation Projects : సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజుల పర్యటనలో పుట్టినగడ్డ (మహబూబ్‌నగర్ జిల్లా)పై ప్రేమ కురిపిస్తారని నిధులు సమకూర్చి పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తారని ఉమ్మడి పాలమూరు ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏళ్లుగా పెండింగ్ పనుల కారణంగా పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరు మాత్రం అందడం లేదు. ఇకనైనా ఈ ప్రభుత్వంలో పరిస్థితి మారుతుందని ఆశిస్తున్నారు.
పాలమూరు-రంగారెడ్డి : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రధాన లక్ష్యం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 18 ప్యాకేజీల్లో పనులను చేపట్టగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన వరకు రిజర్వాయర్లు పూర్తికావొచ్చాయి. ఉదండాపూర్‌తో కలిపి దాదాపు 60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఆయా పంపుహౌస్‌ల పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రధానంగా 3వ ప్యాకేజీలోని నార్లాపూర్-ఏదుల మధ్య గ్రావిటీ కాల్వ పూర్తయితే కర్వెన రిజర్వాయర్ వరకు నీటి తరలింపు మార్గం సుగమం అవుతుంది.
నారాయణపేట-కొడంగల్ : నారాయణపేట - మక్తల్ - కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఊట్కూరు పెద్ద చెరువు నుంచి బాపూర్ వద్ద నిర్మించనున్న పంపుహౌస్ వరకు కాలువ పనులు, పంపుహౌస్ నిర్మాణ ప్రాంతంలో పైపులైను పనులు, భూత్పూర్-కాట్రేవుపల్లి, కానుకుర్తి గ్రావిటీ కెనాల్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 560 ఎకరాల భూసేకరణ మాత్రమే జరిగింది.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం : మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్‌ఐ) పరిధిలో రిజర్వాయర్లు ఉన్నా వాటి సామర్థ్యం కేవలం 4 టీఎంసీల లోపే ఉంది. దీని కింద దాదాపు 20 రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించినా ఆ అంశం ఏమాత్రం ముందడుగు పడలేదు. డిస్ట్రిబ్యూటరీలు, ఉప కాల్వలు నిర్మించాల్సిన అవసరమైతే ఉంది. ఇవి పూర్తయితే మరో 1.44 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంది.
సమస్యలు అనేకం : సంగంబండ పరిధిలో మాగనూరు, మక్తల్, కృష్ణ, నర్వ మండలాలకు సాగునీరందించే ప్రధాన కాలువల నిర్మాణం పూర్తయ్యింది. కానీ ఇక్కడ అనేక పునరావాస సమస్యలు ఉన్నాయి.
- కోయిలసాగర్ పరిధిలో 14 వేల ఎకరాలకు నీరు అందించేందుకు కొత్త కాలువ నిర్మించాల్సి ఉంది.
- ఆర్డీఎస్ (రాజోలి బండ డైవర్షన్ స్కీం) ఆయకట్టు 85 వేల ఎకరాల లక్ష్యం కాగా ప్రస్తుతం అది సగమే పారుతోంది. తుమ్మిళ్ల ఎత్తిపోతలతో కొంత ఉపశమనం ఉన్నా రిజర్వాయర్ల నిర్మాణానికి ఏ మాత్రం ముందడుగు పడటం లేదు. దీనికోసం భారీగా భూసేకరణ చేయాల్సి ఉంది.
- శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్సెల్బీసీ) సొరంగం పనులు ఇంకా 9.533 కిలో మీటర్ల పొడవునా కొండలను తవ్వాల్సి ఉంది.
- రాజీవ్ భీమా ఎత్తిపోతల పెండింగ్ పనులు, కానాయపల్లి ఆర్‌ఆర్ కాలనీ నిర్మాణం, కెనాల్ విస్తరణ, శంకరసముద్రంలో నిలిచిపోయిన పనులను చేపట్టాల్సి ఉంది.
- ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 18.02 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలనేది పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రధాన లక్ష్యం. కొనసాగతున్న ప్రాజెక్టుల (ఆన్‌గోయింగ్) పరిధిలో ఇంకా 1.11 లక్షల ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 1.07 లక్షల ఎకరాలు చేపట్టారు. ఇంకా 4,694 ఎకరాల భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది.
- కొత్తగా కృష్ణా, భీమాపై ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే పాలమూరు జిల్లా సుసంపన్నంగా సస్యశ్యామలమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి నిధుల వరద పారించి పనులు పట్టాలెక్కించేలా చూడాలని పాలమూరు బిడ్డలు కోరుకుంటున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ - క్షేత్రస్థాయిలో పరిశీలన
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి : సీఎం ఆదేశాలు

